Black mail case
-
తండ్రి ఎస్సై..కొడుకు 18 కేసుల్లో నిందితుడు
సాక్షి, రాంగోపాల్‌పేట్: పార్కులు, నిర్మానుష్య ప్రాంతాల్లో ఏకాంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసి పోలీసునంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు సోమవారం వివరాలు వెల్లడించారు. స్టేషన్‌ఘన్‌పూర్‌కు సృజన్ కుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ప్రస్తుతం మన్ననూర్లోని 4వ బెటాలియన్‌లో నివాసం ఉంటున్నాడు. ఫిబ్రవరి 7న సాయంత్రం నెక్లెస్‌రోడ్‌లోని బతుకమ్మ ఘాట్‌వద్ద ఓ జంట కారు పక్కన కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సృజన్‌కుమార్ తాను టాస్క్‌ఫోర్స్ పోలీసు అధికారినంటూ ఇక్కడ ఎందుకు కూర్చున్నారని వారిని బెదిరించాడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డు చూపించి వెంటనే తనకు కొంత డబ్బు ఇవ్వాలని లేని పక్షంలో కేసు పెడతానని బెదిరించాడు. అంతేగాక వారిని కారులో బంజారాహిల్స్ రోడ్ నంబర్–1 లోని కమల్ వాచ్ షోరూమ్‌కు తీసుకుని వెళ్లాడు. అక్కడ రూ.5800 విలువైన వాచ్‌ని కొనుగోలు చేసి బాధితులచే బిల్లు కట్టించాడు. అనంతరం వారిని నేరుగా నెక్లెస్‌రోడ్‌కు తీసుకువచ్చి అక్కడ పార్కు చేసిన తన బైక్ తీసుకుని వెళ్లిపోయాడు. దీనిపై బాధితులు రాంగోపాల్‌పేట్ పోలీసుకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతడిని రాంగోపాల్‌పేట్ పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి ఆపిల్ రిస్ట్ వాచ్, బీఫిట్ లింక్ బీకే వాచ్, ఆక్టివా వాహనం, రెండు ఆపిల్ ఫోన్లు, పోలీసు గుర్తింపు కార్డు, ఐపాడ్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పోలీస్ ఐడీ కార్డుతో బెదిరింపులు.. నిందితుడి తండ్రి ఎస్సైగా పనిచేస్తూ కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. జల్సాలకు అలవాటు పడిన సృజన్ కుమార్ 10వ తరగతితో చదువుకు స్వస్థి చెప్పాడు. 2007 నుంచి మోసాలకు పాల్పడుతున్న ఇతడిపై తెలంగాణాలో 14 కేసులు, ఏపీలో 4 కేసులు ఉన్నాయి. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో అతడిపై నాన్‌బెయిల్ వారెంట్ పెండింగ్‌లో ఉంది. ఏపీలో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లిన సృజన్‌కుమార్ ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చిడు. నకిలీ పోలీసు గుర్తింపు కార్డుతో, బైక్‌పై పోలీస్ స్టిక్కర్‌తో తిరుగుతూ అమాయకులను బెదిరించి మోసాలకు పాల్పడుతున్నాడు. అంతేగాక అతను ముగ్గురిని వివాహం చేసుకున్నట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. (చదవండి: చాటింగ్ చేయొద్దన్నందుకు చావే శరణ్యమనుకుంది) -
డబ్బులు ఇవ్వకపోతే నీ ఇళ్లు కూల్చివేయిస్తా..
సాక్షి,నల్లకుంట: ఓ ఇంటి నిర్మాణంలో ఇంటి యజమానిని బెదిరించి రూ.5 లక్షలు డిమాండ్ చేసిన ముగ్గురిపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ మొగిలిచర్ల రవి కథనం ప్రకారం.. ఎన్.సత్యనారాయణ మూర్తి పాత నల్లకుంటలో ఇంటి నంబర్ 1–8–726/డీ నిర్మాణం చేపట్టారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేకుండా ఇంటి పై అంతస్తు నిర్మాణం చేపడుతున్నారంటూ ఎన్.అదిశ్రీ, కోనేటి శ్రీనివాస్, మరో వ్యక్తి ఎ.సుదర్శన్ బ్లాక్ మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తమకు డబ్బులు ఇవ్వకపోతే జీహెచ్ఎంసీ అధికారులతో ఇళ్లు కూల్చివేయిస్తానంటూ బెదిరించారు. ఇంటి నిర్మాణం కోసం అవసరమైన రుణం కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకోగా రుణం మంజూరు చేయకుండా బ్యాంక్ అధికారులకు తప్పుడు సమాచారమిచ్చారు. దీంతో ఆదిశ్రీ , శ్రీనివాస్, సుదర్శన్‌ల వల్ల తనకు ప్రాణహాని ఉందని సత్యనారాయణ మూర్తి మంగళవారం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే.. -
ఫొటోలు తీసి చెప్పినట్లు చేయాలని బెదిరింపులు
బన్సీలాల్‌పేట్: మైనర్ బాలికను ప్రేమించి మోసం చేసి ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు తీసిన ఫొటోలను చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన గురించి డీసీపీ శనివారం విలేకరులకు వివరించారు. బషీర్‌బాగ్ చంద్రానగర్ ప్రాంతానికి చెందిన నాగరాజు (19), దోమల్‌గూడ మైసమ్మబండ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక సంవత్సర కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నపుడు నాగరాజు ఫొటోలు తీశాడు. వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశాడు. తాను చెప్పినట్లు చేయకపోతే ఫొటోలను బహిర్గతం చేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక తన స్నేహితులకు విషయం చెప్పింది. ఈ నెల 6న నాగరాజు బాలికను డీబీఆర్ మిల్స్ ప్రాంతానికి రావాలని కోరాడు. డీబీఆర్‌మిల్స్ ప్రాంతానికి వెళ్లిన స్నేహితులు నాగరాజును చిదకబాది అతని ఫోన్లోని ఫొటోలను తొలగించారు. విషయం బయటకు రావడంతో ఇద్దరూ ఈ నెల 7న ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో బాలిక తండ్రి 8న గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు బాలిక కోసం వెతకడం ప్రారంభించారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం బాలిక నెక్లెస్ రోడ్డులో ఉన్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బంది వెళ్లి బాలిక స్టేషన్ తీసుకు వచ్చి విచారించామన్నారు. అనంతరం నాగరాజును అదుపులోకి తీసుకొని విచారించారు. బాలిక అందరితో చనువుగా ఉండటం నచ్చలేదని అందుకే బ్లాక్ మెయిల్ చేశానని యువకుడు ఒప్పుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. విలేకరుల సమావేశంలో చిక్కడ్పల్లి ఏసీపీ నర్సింహ్మారెడ్డి, సీఐ శ్రీనివాస్, క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్‌కుమార్, ఎస్ఐలు బాలక్రిష్ణ, అజయ్‌కుమార్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
420 గురుస్వామి..!
తల్లాడ: ఆయనొక గురుస్వామి. ఓ మహిళ ఫిర్యాదుతో ఆయనపై ‘420’ సెక్షన్ కింద తల్లాడ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపిన వివరాలు... ఖమ్మం నగరానికి చెందిన గూడూరు రమాదేవి, మద్యానికి బానిసగా మారిన తన భర్త రవిని దానికి (మద్యానికి) దూరం చేయాలని కోరుతూ తల్లాడకు చెందిన గురుస్వామి పస్తం రంగారావును ఆశ్రయించింది. దీనికి గురుస్వామి అంగీకరించాడు. ఇందుకుగాను పదివేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆ మొత్తాన్ని అతడికి ఆమె ఇచ్చింది. ఆమె పలుమార్లు గురుస్వామి వద్దకు వచ్చి పూజలు చేసింది. అయినప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తానిచ్చిన డబ్బును తిరిగివ్వాలని కోరింది. పూజలు చేసినందుకు డబ్బంతా ఖర్చయిందని, తానేమీ తిరిగివ్వలేనని ఆ గురుస్వామి బదులిచ్చాడు. ఆమె గట్టిగా అడగడంతో ‘‘చేతబడి చేసి నిన్ను చంపుతా’’ అని బెదిరించాడు. ఆమె భయపడింది. తల్లాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్ఐ మేడా ప్రసాద్, ఆ గురుస్వామిపై శుక్రవారం 420 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తు జరుపుతున్నారు. -
విద్యార్థిని బ్లాక్మెయిల్ కేసులో మరో ముగ్గురు నిందితులు?
* మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యాధికారులు * ఆత్మహత్యపై కొనసాగుతున్న విచారణ నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని బ్లాక్మెయిల్ చేసి, లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులున్నారని తెలిసింది. కనిమెల్ల గ్రామానికి చెందిన ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్, మైలపల్లికి చెందిన మహేశ్, అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై బాలిక సోదరుడు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీరు కాకుండా మల్యాడ, సతివాడ, కనిమెల్ల గ్రామాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా బాలికను వేధించినట్టు తెలిసింది. విచారణ సమయంలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బాలికను ఎవరెవరు వేధించారన్న వివరాలు చెప్పకుండా ఈ కేసులో నిందితుడైన మృతురాలి క్లాస్మేట్ నోరును గ్రామపెద్దలు నొక్కేసినట్టు తెలిసింది. ఈ బాలికనేకాకుండా పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థినులను సైతం వీరంతా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. రెండుగ్రామాల మధ్యనున్న దారిలో అడ్డగించి ఇబ్బందిపెట్టినట్టు సమాచారం. చురుకుగా విచారణ విద్యార్థిని మృతిపై విచారణ చురుగ్గా సాగుతోంది. పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని గురువారం వెలికి తీయించారు. తహశీల్దారు కృష్ణమోహన్, సీఐ రవికుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శవపంచనామా జరిపించారు. జిల్లా కేంద్రాస్పత్రికి చెందిన వైద్యాధికారులు రాజ్యలక్షి తదితరులు మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న సమక్షంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మాల్యాడ గ్రామంలోని శ్మశానవాటికలో పంచనామా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది. గ్రామపెద్దలను విచారించిన డీఎస్పీ మల్యాడ గ్రామ సర్పంచ్‌తో పాటు మాజీసర్పంచ్, మరికొంతమంది పెద్దలను ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న వేర్వేరుగా విచారణ చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తరువాత సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని వినిపిస్తున్న ఆరోపణలపై ప్రశ్నించారు.