విద్యార్థిని బ్లాక్‌మెయిల్ కేసులో మరో ముగ్గురు నిందితులు?
* మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన వైద్యాధికారులు
* ఆత్మహత్యపై కొనసాగుతున్న విచారణ
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం మల్యాడ గ్రామానికి చెందిన పదోతరగతి విద్యార్థినిని బ్లాక్‌మెయిల్ చేసి, లైంగికంగా వేధించి, ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేసిన కేసులో మరో ముగ్గురు నిందితులున్నారని తెలిసింది. కనిమెల్ల గ్రామానికి చెందిన ఇంటర్‌నెట్ సెంటర్ నిర్వాహకుడు రమేష్, మైలపల్లికి చెందిన మహేశ్, అదే గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై బాలిక సోదరుడు ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీరు కాకుండా మల్యాడ, సతివాడ, కనిమెల్ల గ్రామాలకు చెందిన మరో ముగ్గురు యువకులు కూడా బాలికను వేధించినట్టు తెలిసింది. విచారణ సమయంలో ఈ విషయాన్ని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. బాలికను ఎవరెవరు వేధించారన్న వివరాలు చెప్పకుండా ఈ కేసులో నిందితుడైన మృతురాలి క్లాస్‌మేట్ నోరును గ్రామపెద్దలు నొక్కేసినట్టు తెలిసింది. ఈ బాలికనేకాకుండా పాఠశాలకు చెందిన మరికొంతమంది విద్యార్థినులను సైతం వీరంతా లైంగిక వేధింపులకు గురిచేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. రెండుగ్రామాల మధ్యనున్న దారిలో అడ్డగించి ఇబ్బందిపెట్టినట్టు సమాచారం.
చురుకుగా విచారణ
విద్యార్థిని మృతిపై విచారణ చురుగ్గా సాగుతోంది. పూడ్చిపెట్టిన బాలిక మృతదేహాన్ని గురువారం వెలికి తీయించారు. తహశీల్దారు కృష్ణమోహన్, సీఐ రవికుమార్, ఎస్‌ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శవపంచనామా జరిపించారు. జిల్లా కేంద్రాస్పత్రికి చెందిన వైద్యాధికారులు రాజ్యలక్షి తదితరులు మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న సమక్షంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు మాల్యాడ గ్రామంలోని శ్మశానవాటికలో పంచనామా తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టమ్ నివేదిక ఇంకా అందాల్సి ఉంది.
గ్రామపెద్దలను విచారించిన డీఎస్పీ
మల్యాడ గ్రామ సర్పంచ్‌తో పాటు మాజీసర్పంచ్, మరికొంతమంది పెద్దలను ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ కృష్ణప్రసన్న వేర్వేరుగా విచారణ చేశారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తరువాత సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారని వినిపిస్తున్న ఆరోపణలపై ప్రశ్నించారు.