ఎఫ్‌వైయూపీ రద్దు
నాలుగు రోజుల ఎడతెగని అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. యూజీసీ ఆదేశాల మేరకు మూడేళ్ల కోర్సులోనే ప్రవేశ ప్రక్రియ చేపడతామని ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) ప్రకటించింది. దీంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బీటెక్ విద్యార్థులు మాత్రం శుక్రవారం కూడా నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఇక ప్రవేశాలు మూడేళ్ల డిగ్రీ కోర్సులోనే
సాక్షి, న్యూఢిల్లీ : నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుపై నెలకొన్న వివాదం సమసిపోయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేర కు ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దుచేసింది. గతంలో బోధించిన మూడేళ్ల డిగ్రీ కోర్సు ప్రకారమే ప్రవేశాలు జరపనున్నట్లు ప్రకటి ంచింది. యూనివర్సిటీ కిందనున్న కళాశాలలన్నింటిలో ప్రవేశ ప్రక్రియను ప్రారంభించాలని డీయూ వైస్‌చాన్స్‌లర్ దినేశ్‌సింగ్... ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. యూజీసీ ఆదేశాల మేరకు యూనివర్సిటీ నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంను రద్దు చేయాలని నిర్ణయించామని దినేశ్‌సింగ్ ప్రకటించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలు 2012-13 విద్యాసంవత్సరంలో పాటించిన ప్రక్రి య ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని ఆయన సూచించారు. యూజీసీ, డీయూల మధ్య నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంపై వివాదం కారణంగా అడ్మిషన్ ప్రక్రియపై నెలకొన్న అనిశ్చితి వీసీ తాజా ప్రకటనతో తొలగిపోయింది.
విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దినేశ్ ప్రకటించారు. డీయూ పరిధిలోని 64 కళాశాలల్లో 54 వేల సీట్ల కోసం 2.7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో అడ్మిషన్ ప్రక్రియ సోమవారం మొదలవుతుందని భావిస్తున్నారు. అడ్మిషన్ ప్రక్రి య ఇప్పటికే వారం రోజులు ఆలస్యమైంది.
నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేస్తూ డీయూ తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. నాలుగేళ్ల కోర్సును వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు జరుపుతున్న విద్యార్థి సంఘాలు సంబరాలు జరుపుకున్నాయి. కాగా నాలుగేళ్ల డిగ్రీ కోర్సును రద్దు చేయడంతో పాత పదధతి ప్రకారం అడ్మిషన్ ప్రకియను నిర్వహించే మార్గాలను చర్చించడం కోసం డీయూ కాలేజీల ప్రిన్సిపాల్స్ దినేశ్‌సింగ్‌ను కలిశారు. అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహిం చేందుకు తగు సూచనలకోసం 12 కాలేజీల ప్రిన్సిపాల్స్‌తో కమిటీని నియమించారు.