‘ఇసుజు’కు రాయితీల పంట!
* పెట్టుబడికి మించి వ్యాట్ రాయితీ
* కోతలు లేకుండా విద్యుత్ సరఫరా
* ఎస్‌ఐపీసీతో సంబంధం లేకుండానే ఉత్తర్వులు
* వెల్లువెత్తుతున్న విమర్శలు
సాక్షి, హైదరాబాద్: ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘ఇసుజు’కి ప్రభుత్వం రాయితీల పంట పండించింది. రాష్ట్ర పారిశ్రామిక విధానంలోని నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా భారీ ఎత్తున రాయితీలు కల్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఇసుజు కంపెనీ ముందుకువచ్చిన విషయం తెలిసిందే. ఆ కంపెనీకి రాయితీలు కల్పించే విషయంలో ప్రభుత్వం నిబంధనలకు నీళ్లొదిలందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకారం సాధారణంగా కంపెనీ పెట్టుబడిలో 50 శాతం మాత్రమే విలువ ఆధారిత పన్ను(వ్యాట్) రాయితీగా ఇస్తారు. అయితే, ఇసుజుకు ఏకంగా పెట్టుబడి కన్నా 135 శాతం వ్యాట్ రాయితీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దాంతోపాటు 30 ఏళ్ల పాటు 100 శాతం నికర వ్యాట్ రాయితీ ఇవ్వాలని, అంతేకాకుండా 5 శాతం ఇన్పుట్ వ్యాట్ రాయితీని కూడా 30 ఏళ్లపాటు కల్పించాలని నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ)తో సంబంధం లేకుండా నేరుగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్ చంద్ర ఉత్తర్వులు జారీచేశారు. అయితే, కంపెనీ ఉద్యోగాల్లో 80 శాతం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారికి కల్పిస్తేనే రాయితీలకు అర్హత ఉంటుందని ప్రభుత్వం నిబంధన విధించింది.
ఇసుజుకు ప్రభుత్వం ఇచ్చిన మరికొన్ని వరాలు
కంపెనీ వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన తరువాత అంటే 31 డిసెంబర్ 2014 నుంచి ఏడాదిలో 365 రోజులూ నిరాటంకంగా విద్యుత్ సరఫరా ప్రతి 3 నెలలకోసారి పారిశ్రామిక విధానం ప్రకారం ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, సేల్స్ డ్యూటీ తదితర రాయితీల చెల్లింపు మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు అనుమతి స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, మార్ట్గేజ్ డ్యూటీలకు 100 శాతం మినహాయింపు ఐదేళ్ల పాటు 2 వేల మందికి ఒక్కోక్కరికి 10 వేల చొప్పున శిక్షణ ఖర్చు కింద కంపెనీకి చెల్లింపు శ్రీసిటీకి వెలుపల కూడా కేవలం రోడ్లు, నీటి సరఫరానే కాకుండా ఇతర మౌలిక సదుపాయాల కల్పన పన్ను విధానంలో భవిష్యత్తులో మార్పులు వచ్చినప్పటికీ ఈ రాయితీలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడం గమనార్హం.
నేరుగా పని కానిచ్చారు!
ఏదైనా పరిశ్రమలకు ఏ మేర రాయితీ ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించేందుకు రాష్ట్రంలో ఒక విధానం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్న వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లతో కలిపి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) ఉంటుంది. సీఎం నేతృత్వం లోని వివిధ శాఖల మంత్రులు, అధికారులతో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు(ఎస్ఐపీబీ) ఉంటుంది.
పరిశ్రమలు కోరుతున్న రాయితీ లేమిటి? రాష్ట్ర పారిశ్రామిక విధానం ఏం చెబుతోంది? కంపెనీ కోరిన రాయితీలివ్వవచ్చా? అనే అంశాల్ని ఎస్ఐపీసీ పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఎస్ఐపీసీ నిర్ణయాలపై ఎస్ఐపీబీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే, ఏ పరిశ్రమకు రాయితీలు ఇవ్వాలన్నా తొలుత ఎస్ఐపీసీలో చర్చించాల్సి ఉంటుంది. అనంతరమే ఎస్ఐపీబీ పరిశీలనకు వస్తుంది. అయితే, ఇసుజు విషయంలో ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది.
ఎస్ఐపీసీలో చర్చించకుండానే... నేరుగా ఎస్ఐపీబీలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేశారు. అనేక ఇతర పరిశ్రమల అభ్యర్థనలు పెండింగ్‌లో ఉండగా, పారిశ్రామిక విధాన నిబంధనలను పట్టించుకోకుండా ఇసుజుకు భారీగా రాయితీలు కల్పించడాన్ని పారిశ్రామిక వర్గాలు విమర్శిస్తున్నాయి.