ఓటర్లకు అల్పాహారం, ఐస్క్రీమ్
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు. '56 దుకాణ్' దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం, ఐస్క్రీమ్లు అందించారు.నగరంలోని 56 దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్, దేవాస్, ఉజ్జయిని, మందసౌర్, రత్లాం, ధార్, ఖర్గోన్, ఖాండ్వాతో సహా ఎనిమిది పార్లమెంటు స్థానాలలో నాలుగో దశలో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది."ఇండోర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఓటింగ్లో కూడా మేము ప్రత్యేకంగా నిలుస్తాం. ఓటర్లకు ఉచితంగా అల్పాహారం అందించాం. తద్వారా వారు త్వరగా బయటకు వచ్చి ఓటు వేయవచ్చు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా, జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందిస్తున్నాం" అని 56 దుకాణ్లోని షాప్ యజమాని శ్యామ్లాల్ శర్మ చెప్పారు. ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం అని ఆయన అన్నారు.