టార్గెట్ రూ.800 కోట్లు!
- జంట జిల్లాల్లో క్రమబద్ధీకరణపైనే ఆశలన్నీ..
- ఈ నెలాఖరులోగా దరఖాస్తుల పరిశీలన పూర్తికి ఆదేశాలు
- వచ్చే నెల 15 నుంచి పట్టాల పంపిణీకి సన్నాహాలు
సాక్షి. సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉచిత పట్టాల పంపిణీ పూర్తి చేసిన రెవెన్యూ యంత్రాంగం.. ఇక సొమ్ము చెల్లించే కేటగిరి, జీఓ మార్పిడి దరఖాస్తులపై దృష్టిసారించింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ ద్వారా రూ.800 కోట్ల ఆదాయం రాబట్టవచ్చునని రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. జీవో 59 ప్రకారం ఈ కేటగిరికి చెందిన దరఖాస్తులు స్వీకరించినప్పడే...మార్కెట్ విలువలో 10 శాతం మూలధనం వాటా కింద ప్రాథమికంగా రూ.80 కోట్ల ఆదాయం వచ్చింది.
ఈ ప్రక్రియలో భాగంగా మిగిలిన వాయిదా పద్ధతులతో వచ్చే సొమ్ముకు తోడు మార్పిడి దరఖాస్తుల క్రమబద్ధీకరణ ద్వారా అధిక ఆదాయం రావచ్చునని భావిస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రక్రియ వేగవంతం చేయటం ద్వారా వచ్చే నెల 15 నుంచి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు.
కొత్తగా చెక్ మెమో
జీవో నెంబరు 59కి సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను సవరిస్తూ దరఖాస్తుల పరిశీలన నిమిత్తం కొత్త చెక్ మెమోను తాజాగా జారీచేశారు.ఈ చెక్ మెమోలో దరఖాస్తుదారుడు, కుటుంబ సభ్యుల వివరాలతో పాటు భూమి, నిర్మాణంపై ఎక్కువ అంశాలను పొందుపర్చారు. క్రమబద్ధీకరణ కోరుతున్న భూమి నలువైపులా ఫోటోలు, తప్పనిసరిగా సేకరించాల్సి ఉంటుంది. దరఖాస్తులో పేర్కొన్న భూమిలో నిర్మాణం ఉన్న విస్తీర్ణం, ఖాళీజాగా వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి. సదరు భూమి యూఎల్సీ పరిధిలోనిదా, అభ్యంతర కరమైనదా లేదా అభ్యంతరం లేనిదా.. అన్న విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాల్సింది.
ఒకేసారి చెల్లిస్తే ఐదు శాతం రాయితీ
ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా దరఖాస్తుదారు ఒకేసారి సొమ్ము చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. పరిశీలన అనంతరం పూర్తి సొమ్మును చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీడ్లను అందజేస్తారు. వాయిదాల పద్ధతిన సక్రమంగా చెల్లిస్తున్నవారికి మాత్రం ఎండార్స్మెంట్ పత్రాలను అందజేస్తారు.
మార్పిడి దరఖాస్తులపైనే...
ప్రభుత్వ ప్రాధాన్యతల్లో భాగంగా రెవెన్యూ శాఖ దృష్టంతా ఉచితం నుంచి సొమ్ము చెల్లించే కేటగిరికి మార్పిడి చేసిన దరఖాస్తులపైన్నే సారిస్తున్నది. ఉచిత క్రమబద్ధీకరణ ప్రక్రియలో భాగంగా 125 చదరపు గజాల ఆక్రమిత స్థలంలో ఇళ్ళు నిర్మించుకున్న వారు 2.11 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇందులో 99,850 మందికి మాత్రమే సర్కారు పట్టాలు పంపిణీ చేసింది. మిగిలిన దరఖాస్తులను పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం ఉచితం(జీవో 58) నుంచి 13,543 దరఖాస్తులను సొమ్ము చెల్లించే( జీవో 59) కేటగిరికి మార్పిడి చేసింది. వీరందరికి జీవో 59 ప్రకారం వాయిదా పద్ధతిలో సొమ్ము చెల్లించాలని రెవెన్యూ శాఖ నోటీసులు జారీ చేస్తున్నది.