జియో ఫ్రీ-ఆఫర్లపై విచారణ ఆ రోజే
ముంబై : రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లను కొనసాగించడానికి ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్ టెలికాం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసింది. ఈ కేసు విచారణను టెలికాం ట్రిబ్యూనల్(టీడీశాట్) ఆగస్టు 18న చేపట్టనున్నట్టు తెలిపింది. 90 రోజులకు మించి ఉచిత ఆఫర్లు కొనసాగించడానికి ట్రాయ్, రిలయన్స్ జియోకు అనుమతించింది. కానీ, జియో తీసుకొచ్చిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూఇయర్ ఆఫర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భారతీ ఎయిర్టెల్, ఐడియాలు ఆరోపించాయి. ప్రస్తుతం ఆ ఆఫర్ల గడువు ముగిసిపోయింది. ఈ ఆఫర్ల కొనసాగించుకోవడానికి జియోకు ట్రాయ్ ఇచ్చిన ఆర్డర్‌కు వ్యతిరేకంగా టెలికాం దిగ్గజాలు టెలికాం ట్రిబ్యూనల్‌లో ఫిర్యాదు చేశాయి.
నేడు ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే రిలయన్స్ జియో ఇచ్చిన సమాధానానికి తమ స్పందన తెలియజేయడానికి కొంత సమయం కావాలని టెలికాం దిగ్గజాలు కోరాయి. ఈ నేపథ్యంలో టీడీశాట్ ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 18న చేపట్టనున్నట్టు పేర్కొంది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ఉచిత వాయిస్, డేటా ప్లాన్లతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ ఏడాది మార్చి వరకు ఉచిత ఆఫర్లు కొనసాగిస్తూ ఉంది. 90 రోజుల మించి ఈ ఉచిత ఆఫర్లు కొనసాగించడంపై టెలికాం దిగ్గజాలు మండిపడ్డాయి. అయితే దీనికి టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా అనుమతి ఇవ్వడంతో, భారతీ ఎయిర్టెల్, ఐడియాలు టెలికాం ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించాయి. కాగ, ఏప్రిల్ 1 నుంచి జియో టారిఫ్ ప్లాన్లను అమలుచేస్తోంది.