free publicity
-
టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?!
నిబంధనలు ప్రతిపక్షాలకా? ఓ వామపక్ష నేత ప్రశ్న కంగుతిన్న కమిషనర్ అన్ని బ్యానర్లు తొలగించాలని ఆదేశం విజయవాడ సెంట్రల్ : నగరంలో ఫ్రీ పబ్లిసిటీకి కళ్లెం వేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. నగరపాలక సంస్థ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిర్ణీత రుసుం చెల్లించిన తరువాతే ఫ్లెక్సీ రోడ్డుపై కనిపించాలి లేదంటే ఫైన్ పడుద్దంటూ ఈ ఏడాది మార్చిలో కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. అయితే ఈ నిబంధనలన్నీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అధికారపార్టీ నేతలు ప్రధాన రహదారులు, జంక్షన్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఇందుకు ు టౌన్‌ప్లానింగ్‌కు ఒక్కరూపాయి కూడా చెల్లించడం లేదు. అయినా బ్యానర్లపై చెయ్యేసే ధైర్యాన్ని అధికారులు చేయడం లేదు. అదే ప్రతిపక్ష పార్టీలు, ప్రైవేటు కంపెనీల బ్యానర్లను నిమిషాల వ్యవధిలో తొలగించి ట్రాక్టర్లో వేసేస్తున్నారు. బుధవారం నగరంలో వామపక్ష పార్టీకి చెందిన బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. అదే ప్రదేశంలో ఉన్న టీడీపీ బ్యానర్ల జోలికి పోలేదు. దీంతో ఆపార్టీ నాయకులకు నిబంధనలు ప్రతిపక్షాలకేనా అన్న డౌట్ వచ్చి కమిషనర్‌కు ఫోన్ చేశారు. అనుమతి లేని ఏ బ్యానర్ కనిపించడానికి వీల్లేదంటూ కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు క్లాస్ తీశారు. దీంతో వారు ఆఘమేఘాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించారు. నిబంధనలు గాలికి ఫ్లెక్సీలు బ్యానర్ల ప్రదర్శనకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదికూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే. అసిస్టెంట్ సిటీప్లానర్ -1 పరిధిలో 43 ప్రాంతాలను, ఏసీపీ -2 పరిధిలో 70 ప్రాంతాలను గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకునే వారు చదరపు మీటర్‌కు రోజుకు రూ.10 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వచ్చిన తరువాత ఫ్లెక్సీ లేదా బ్యానర్ ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు గడువు పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులే స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు పెనాల్టీ విధిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఫైన్ చెల్లించాలి. దీనివల్ల కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో ఇది అమలు కావడం లేదు. అంతా వాళ్లిష్టం నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిసిటీ విచ్చలవిడిగా మారింది. ప్రధాన కూడళ్లు, బందరు, ఏలూరు రోడ్లు, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర,రాష్ట్ర మంత్రుల పర్యటనల్ని పురస్కరించుకుని రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నేతల పర్యటనలు పూర్తయినా ఆ బ్యానర్లు అలానే ఉండిపోతున్నాయి. దీంతో నగర సుందరీకరణ దెబ్బతింటోంది. మా పార్టీ బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. టీడీపీ బ్యానర్లు అలానే ఉంచేస్తున్నారు. నిబంధనలు అధికారపార్టీకి వర్తించవా సార్? కమిషనర్ జి.వీరపాండియన్‌కు ఓ వామపక్ష నేత ఫోన్లో ఫిర్యాదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో కఠినంగా వ్యవహరించండి. అధికారపార్టీ, విపక్షం అనే తేడా లేదు. నిబంధనలు పాటించకుంటే జరిమానా వసూలు చేయాల్సిందే. - టౌన్‌ప్లానింగ్ అధికారులతో కమిషనర్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. వాటిని తొలగించినందుకు అయిన మొత్తాన్ని వారి ద్వారానే రికవరీ చేస్తామన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం నగరపాలక సంస్థ సిబ్బందికి కష్టంగా మారిందన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సొమ్ము చెల్లించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. -మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ -
పైసలు కొట్టు.. ఫ్లెక్సీ కట్టు!
అది కూడా ఒక్కరోజే లేదంటే ఫైన్ తప్పదు కార్పొరేషన్ ఖజానాకు ఏటా రూ. 50 లక్షల ఆదాయం కమిషనర్ నిర్ణయం విజయవాడ సెంట్రల్ : పండుగలు, పెళ్లిరోజు, అభిమాన నేతకు జేజేలు.. సందర్భం ఏదైనా కానీ ఇకపై నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కట్టడం కుదరదు. నగరపాలక సంస్థ ఎంపిక చేసిన ప్రదేశంలో నిర్ణీత రుసుం చెల్లించిన తరువాతే ఫ్లెక్సీ రోడ్డుపై కనిపించాలి. లేదంటే జరిమానా కట్టాల్సిందే. నగర సుందరీకరణ నేపథ్యంలో ఫ్రీ పబ్లిసిటీకి చెక్ పెట్టాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. దీనికోసం విధి విధానాలతో కూడిన ఆంక్షల్ని తెరపైకి తెచ్చారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను ఒకరోజు మాత్రమే అనుమతి ఇస్తారు. అది కూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే కట్టాలి. అసిస్టెంట్ సిటీప్లానర్-1 పరిధిలో 43 ప్రాంతాలను, ఏసీపీ-2 పరిధిలో 70 ప్రాంతాలను గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకునేవారు చదరపు మీటరుకు రోజుకు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వచ్చిన తరువాత ఫ్లెక్సీ లేదా బ్యానర్ ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు గడువు పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులే స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు జరిమానా విధిస్తారు. ఎంపిక చేసినచోట కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా పైసలు చెల్లించాల్సిందే. తాజా నిబంధనల నేపథ్యంలో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.50 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా. ఇక కష్టమే.. నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిసిటీ విచ్చలవిడిగా మారింది. ప్రధాన కూడళ్లు, బందరురోడ్డు, ఏలూరురోడ్డు, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనల్ని పురస్కరించుకుని రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నేతల పర్యటనలు పూర్తయినప్పటికీ ఆ బ్యానర్లు అలానే ఉండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసే బ్యానర్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడమే కాక నగర సుందరీకరణ దెబ్బతింటోందన్న వాదనలు ఉన్నాయి. ఫ్లెక్సీ తొలగింపు విషయమై గత నెలలో వివాదం తలెత్తగా బిల్డింగ్ ఇన్స్పెక్టర్ను కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఉచితానికి చెక్ ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పబ్లిసిటీకి ధర నిర్ణయించడం ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం రాబట్టడంతో పాటు అనవసర ప్రచారానికి కళ్లెం వేసినట్లవుతుందని కమిషనర్ ఆలోచనగా తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రతి అంశాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటున్న అధికారులు హోర్డింగ్‌ల లీజు ధరను ఈ ఏడాది రెట్టింపు చేశారు. నగరంలో సుమారు 3254 హోర్డింగ్‌లకు గాను ప్రైవేటు ఏజెన్సీ ఏడాదికి రూ.9 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది రూ.18 కోట్లు ధర నిర్ణయించి టెండర్ పిలిచారు. -
సానియాకు ఫ్రీ పబ్లిసిటీ
బ్రాండ్ అంబాసిడర్ .. నిన్నమొన్నటి వరకూ ఓ మామూలు పదం. కానీ ఇప్పుడది అందరికీ విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. కోటి రూపాయలు ఇచ్చి మరీ ఒకరేమో రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే, మరొకరేమో ఆ బ్రాండ్ అంబాసిడర్‌తో ఆ రాష్ట్రానికి కూడా ఇరవై కోట్ల విలువైన ఫ్రీ పబ్లిసిటీ చేశారు. విషయానికి వస్తే టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిపోయింది. సానియాను తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం పెను దుమారం రేపింది. జాతీయ రాజకీయాల్లో గత రెండు రోజులుగా వాడి, వేడి కామెంట్స్ దూసుకొచ్చాయి. జాతీయ మీడియాలోనూ హాట్ డిబేట్‌కు దారి తీసింది. ముంబైలో పుట్టి పాకిస్థాన్ కోడలైన సానియాను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎలా నియమిస్తారంటూ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలపై దీనిపై స్పందించిన సానియా తన తాత ముత్తాతలు హైదరాబాదీలే స్పష్టం చేసింది. తన జాతీయతను ఎన్నిసార్లు నిరూపించుకోవాలంటూ టీవీ ఛానళ్లలో కంటతడి పెట్టి, కాసేపు ముక్కు కూడా చీదేసింది. మరోవైపు సానియాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అందుకోసం ఆమెకు కోటి ఇవ్వటం మాత్రం సరికాదని హైదరాబాదీవాసులే ఓ జాతీయ ఛానల్ లైవ్‌లో అభిప్రాయపడ్డారు. ఆ డబ్బును తెలంగాణ సర్కార్ ప్రజా సమస్యల పరిష్కారానికి ఇస్తే బాగుండేదని అన్నారు. బీజేపీ వ్యాఖ్యలతో అటు సానియాతో పాటు ఇటు తెలంగాణకు కూడా కావలసినంత ప్రచారం లభించినట్లు అయింది. దాంటో కోటి పోతే పోయింది.... ఇరవై కోట్ల విలువైన ప్రచారం లభించిందని టీఆర్ఎస్ నేతలు ఖుషీగా ఉన్నట్లు సమాచారం. ఇక తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా నియామకంతో ....అందుకు పోటీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఓ బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని డిమాండ్ తలెత్తింది. అందుకోసం పలువురు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కరణం మల్లీశ్వరి, కోనేరు హంపి, చేతన్ ఆనంద్, వీవీఎస్ లక్ష్మణ్ తదితర క్రీడాకారులు మనకీ ఉన్నారంటూ గుర్తు చేస్తున్నారు. మరోవైపు సినీరంగానికి చెందిన వ్యక్తిని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తే బాగుంటుందని చెబుతున్నారు. మరి ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ ఎవరిని వరిస్తుందో చూడాలి.