టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?! | free publicity only tdp ? | Sakshi
Sakshi News home page

టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?!

Published Thu, Oct 8 2015 8:41 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM

టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?! - Sakshi

టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?!

నిబంధనలు ప్రతిపక్షాలకా?  
 ఓ వామపక్ష నేత ప్రశ్న  కంగుతిన్న కమిషనర్
 అన్ని బ్యానర్లు తొలగించాలని ఆదేశం

 
విజయవాడ సెంట్రల్ :  నగరంలో ఫ్రీ పబ్లిసిటీకి కళ్లెం వేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. నగరపాలక సంస్థ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిర్ణీత రుసుం చెల్లించిన తరువాతే ఫ్లెక్సీ రోడ్డుపై కనిపించాలి లేదంటే ఫైన్ పడుద్దంటూ ఈ ఏడాది మార్చిలో కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. అయితే ఈ నిబంధనలన్నీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. 

ఏ చిన్న కార్యక్రమం జరిగినా అధికారపార్టీ నేతలు ప్రధాన రహదారులు, జంక్షన్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఇందుకు ు టౌన్‌ప్లానింగ్‌కు ఒక్కరూపాయి కూడా చెల్లించడం లేదు. అయినా బ్యానర్లపై చెయ్యేసే ధైర్యాన్ని అధికారులు చేయడం లేదు. అదే ప్రతిపక్ష పార్టీలు, ప్రైవేటు కంపెనీల బ్యానర్లను నిమిషాల వ్యవధిలో తొలగించి ట్రాక్టర్లో వేసేస్తున్నారు.  బుధవారం నగరంలో వామపక్ష  పార్టీకి చెందిన బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. అదే ప్రదేశంలో ఉన్న టీడీపీ బ్యానర్ల జోలికి పోలేదు.

దీంతో ఆపార్టీ నాయకులకు నిబంధనలు ప్రతిపక్షాలకేనా అన్న డౌట్ వచ్చి కమిషనర్‌కు ఫోన్ చేశారు. అనుమతి లేని ఏ బ్యానర్ కనిపించడానికి వీల్లేదంటూ కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు క్లాస్ తీశారు. దీంతో వారు  ఆఘమేఘాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు  తొలగించారు.
 
నిబంధనలు గాలికి

 ఫ్లెక్సీలు బ్యానర్ల ప్రదర్శనకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదికూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే. అసిస్టెంట్ సిటీప్లానర్ -1 పరిధిలో 43 ప్రాంతాలను, ఏసీపీ -2 పరిధిలో 70 ప్రాంతాలను గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకునే వారు చదరపు మీటర్‌కు రోజుకు  రూ.10 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వచ్చిన తరువాత ఫ్లెక్సీ లేదా బ్యానర్ ఏర్పాటు చేయాలి.

ఒక్కరోజు గడువు పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులే స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు పెనాల్టీ విధిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఫైన్ చెల్లించాలి. దీనివల్ల కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో ఇది అమలు కావడం లేదు.
 
అంతా వాళ్లిష్టం

 నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిసిటీ విచ్చలవిడిగా మారింది. ప్రధాన కూడళ్లు, బందరు, ఏలూరు రోడ్లు, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర,రాష్ట్ర మంత్రుల పర్యటనల్ని పురస్కరించుకుని రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నేతల పర్యటనలు పూర్తయినా ఆ బ్యానర్లు అలానే ఉండిపోతున్నాయి. దీంతో నగర సుందరీకరణ దెబ్బతింటోంది.
 
మా పార్టీ బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. టీడీపీ బ్యానర్లు అలానే ఉంచేస్తున్నారు. నిబంధనలు అధికారపార్టీకి వర్తించవా సార్? కమిషనర్ జి.వీరపాండియన్‌కు ఓ వామపక్ష నేత ఫోన్‌లో ఫిర్యాదు.
   ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో కఠినంగా వ్యవహరించండి. అధికారపార్టీ,  విపక్షం అనే తేడా లేదు. నిబంధనలు పాటించకుంటే జరిమానా వసూలు చేయాల్సిందే.   
  -   టౌన్‌ప్లానింగ్ అధికారులతో కమిషనర్
 
క్రిమినల్ చర్యలు తీసుకుంటాం

అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. వాటిని తొలగించినందుకు అయిన మొత్తాన్ని వారి ద్వారానే  రికవరీ చేస్తామన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం నగరపాలక సంస్థ సిబ్బందికి కష్టంగా మారిందన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సొమ్ము చెల్లించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు.
 -మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement