Commissioner G. Virapandiyan
-
నీటి మీటర్లు వచ్చేస్తున్నాయ్
నిరంతర సరఫరా పేరుతో ఏర్పాట్లు త్వరలో కౌన్సిల్ ముందుకు నాడు వద్దన్నారు.. నేడు ముద్దంటున్నారు టీడీపీ డబుల్‌గేమ్ విజయవాడ సెంట్రల్ : నిరంతర నీటి సరఫరా ముసుగులో నీటి మీటర్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చైనా, జపాన్ బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన కమిషనర్ జి.వీరపాండియన్ నీటి సరఫరా, కుళాయిలకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలో నీటి సరఫరాకు వినియోగిస్తున్న టెక్నాలజీ, పంపింగ్ విధానం, బూస్టర్ల పనితీరు, వాటర్ పైప్‌లైన్ స్థితిగతుల్ని గురించి ఆయా దేశాల ప్రతినిధులబృందం అధ్యయనం చేసింది. జపాన్ బృందం విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్‌ను పరిశీలించింది. హంగేరీ రాయబార ప్రతినిధులు, బుడాపెస్ట్ వాటర్ వర్క్స్ సీఈవో జిజాసోమ్యీ నగరంలో పర్యటించారు. రా వాటర్ ఏవిధంగా సేకరిస్తున్నారు, ఫిల్టరైజేషన్, క్లోరినేషన్ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి నమూనాలను సేకరించారు. తమ సంస్థ తరఫున త్వరలో ప్రణాళికలు రూపొందించి అందజేస్తామన్నారు. సీన్ కట్ చేస్తే... నగరంలో కుళాయిలకు మీటర్లు బిగిస్తే తప్ప నిరంతర నీటి సరఫరా సాధ్యం కాదన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. 59 డివిజన్ల పరిధిలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, గృహ అవసరాల కేటగిరీలో 1,08,493, కమర్షియల్ కేటగిరీలో 8,716 కనెక్షన్లు ఉన్నాయి. నీటి సరఫరాకు రూ.32.40 కోట్లు ఖర్చవుతుండగా పన్నుల రూపంలో రూ.31 కోట్లు వసూలవుతున్నాయి. 1.65 ఎంఎల్డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటి సరఫరా చేస్తున్నామని, తలసరి ఒక్కో మనిషికి 150 లీటర్ల చొప్పున నీటిని అందిస్తున్నామన్నది అధికారుల లెక్క. నీటి వృథా ఎక్కువగా జరుగుతోందని, మీటర్ల ఏర్పాటుతో చెక్ పెట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. 24 గంటల నీటి సరఫరా విధానంలో పైపుల్లో నీళ్లు ఎప్పుడూ నిల్వ ఉంటాయి కాబట్టి నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు. అప్పుడలా.. ఇప్పుడిలా.. నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన ఎనిమిదేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. నిరంతర నీటి సరఫరా చేయాలంటే నీటి మీటర్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని అధికారులు సూచించారు. దీనిని కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సభ్యులు ప్రజలపై భారాలు మోపితే సహించేది లేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నాటి పాలకులు ఆ వెనక్కి తగ్గారు. నీటి మీటర్లను నాడు వద్దన్న టీడీపీనే నేడు అమలుకు పావులు కదుపుతోంది. భారాలపై భారాలు నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలనలో పన్నుల మోత మోగింది. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, కమిషనర్ జి.పండాదాస్లు డ్రైనేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడు శాతం చొప్పున పెంచేవిధంగా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచేశారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజలపై రూ.75 కోట్ల మేర పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. 2014లో ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానం ప్రకారం ఏడు శాతం చార్జీలు పెంచుతూ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆగస్టు 6న జరిగిన తొలి కౌన్సిల్లో ఏకగ్రీవంగావ్యతిరేకించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా నీటి మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నగరవాసులకు ఇబ్బందే... నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు తాగునీరు పూర్తిగా సరఫరా కావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 1,79,245 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇందులో 40 శాతం అద్దెదారులు ఉంటున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో నాలుగు పోర్షన్లు ఉంటే ఒక్కటే కుళాయి ఉంటుంది. మీటర్ ఏర్పాటు చేస్తే నీటి వినియోగపు లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశముంది. నగరంలో ప్రస్తుతం 69 రిజర్వాయర్లు ఉండగా 62 పనిచేస్తున్నాయి. నిరంతర నీటి సరఫరాలో భాగంగా మరో ఆరు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇస్తున్న 1.65 ఎంఎల్డీ నీటిని మాత్రమే 24 గంటలూ సరఫరా చేస్తారు. మీటర్లు అమరిస్తే బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది. -
టీడీపీకేనా ‘ఫ్రీ’ పబ్లిసిటీ?!
నిబంధనలు ప్రతిపక్షాలకా? ఓ వామపక్ష నేత ప్రశ్న కంగుతిన్న కమిషనర్ అన్ని బ్యానర్లు తొలగించాలని ఆదేశం విజయవాడ సెంట్రల్ : నగరంలో ఫ్రీ పబ్లిసిటీకి కళ్లెం వేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలకు టౌన్‌ప్లానింగ్ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. నగరపాలక సంస్థ ఎంపిక చేసిన ప్రదేశాల్లో మాత్రమే నిర్ణీత రుసుం చెల్లించిన తరువాతే ఫ్లెక్సీ రోడ్డుపై కనిపించాలి లేదంటే ఫైన్ పడుద్దంటూ ఈ ఏడాది మార్చిలో కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించారు. అయితే ఈ నిబంధనలన్నీ ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా అధికారపార్టీ నేతలు ప్రధాన రహదారులు, జంక్షన్లలో విచ్చలవిడిగా ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. ఇందుకు ు టౌన్‌ప్లానింగ్‌కు ఒక్కరూపాయి కూడా చెల్లించడం లేదు. అయినా బ్యానర్లపై చెయ్యేసే ధైర్యాన్ని అధికారులు చేయడం లేదు. అదే ప్రతిపక్ష పార్టీలు, ప్రైవేటు కంపెనీల బ్యానర్లను నిమిషాల వ్యవధిలో తొలగించి ట్రాక్టర్లో వేసేస్తున్నారు. బుధవారం నగరంలో వామపక్ష పార్టీకి చెందిన బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగించారు. అదే ప్రదేశంలో ఉన్న టీడీపీ బ్యానర్ల జోలికి పోలేదు. దీంతో ఆపార్టీ నాయకులకు నిబంధనలు ప్రతిపక్షాలకేనా అన్న డౌట్ వచ్చి కమిషనర్‌కు ఫోన్ చేశారు. అనుమతి లేని ఏ బ్యానర్ కనిపించడానికి వీల్లేదంటూ కమిషనర్ టౌన్‌ప్లానింగ్ అధికారులకు క్లాస్ తీశారు. దీంతో వారు ఆఘమేఘాలపై బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించారు. నిబంధనలు గాలికి ఫ్లెక్సీలు బ్యానర్ల ప్రదర్శనకు ఒక్కరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు. అదికూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే. అసిస్టెంట్ సిటీప్లానర్ -1 పరిధిలో 43 ప్రాంతాలను, ఏసీపీ -2 పరిధిలో 70 ప్రాంతాలను గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకునే వారు చదరపు మీటర్‌కు రోజుకు రూ.10 చొప్పున చెల్లించాలి. ఇందుకోసం ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వచ్చిన తరువాత ఫ్లెక్సీ లేదా బ్యానర్ ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు గడువు పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులే స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు పెనాల్టీ విధిస్తారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ఫైన్ చెల్లించాలి. దీనివల్ల కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల ఆదాయం వస్తుందని అంచనా. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆచరణలో ఇది అమలు కావడం లేదు. అంతా వాళ్లిష్టం నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిసిటీ విచ్చలవిడిగా మారింది. ప్రధాన కూడళ్లు, బందరు, ఏలూరు రోడ్లు, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర,రాష్ట్ర మంత్రుల పర్యటనల్ని పురస్కరించుకుని రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నేతల పర్యటనలు పూర్తయినా ఆ బ్యానర్లు అలానే ఉండిపోతున్నాయి. దీంతో నగర సుందరీకరణ దెబ్బతింటోంది. మా పార్టీ బ్యానర్లను టౌన్‌ప్లానింగ్ అధికారులు తొలగిస్తున్నారు. టీడీపీ బ్యానర్లు అలానే ఉంచేస్తున్నారు. నిబంధనలు అధికారపార్టీకి వర్తించవా సార్? కమిషనర్ జి.వీరపాండియన్‌కు ఓ వామపక్ష నేత ఫోన్లో ఫిర్యాదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరు. వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్ల విషయంలో కఠినంగా వ్యవహరించండి. అధికారపార్టీ, విపక్షం అనే తేడా లేదు. నిబంధనలు పాటించకుంటే జరిమానా వసూలు చేయాల్సిందే. - టౌన్‌ప్లానింగ్ అధికారులతో కమిషనర్ క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అనుమతి లేకుండా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ జి.వీరపాండియన్ హెచ్చరించారు. వాటిని తొలగించినందుకు అయిన మొత్తాన్ని వారి ద్వారానే రికవరీ చేస్తామన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లు తొలగించడం నగరపాలక సంస్థ సిబ్బందికి కష్టంగా మారిందన్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే సొమ్ము చెల్లించి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సూచించారు. -మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ -
గలీజులపై డేగకన్ను
- వెయ్యికి పైగా షాపులు దళారుల చేతుల్లో - కార్పొరేషన్‌కి రూ.10 కోట్లపైనే ఆదాయం వచ్చే అవకాశం - సర్వే నిర్వహిస్తున్న ప్రత్యేక బృందాలు విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లతో వ్యాపారం చేస్తున్న బిజినెస్ మేన్ల ఆగడాలపై కమిషనర్ జి.వీరపాండియన్ డేగకన్ను వేశారు. గ‘లీజు’ల భరతం పట్టేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 12 ప్రత్యేకబృందాలను రంగంలోకి దించారు. 1000కి పైగా షాపులు సబ్ లీజుల్లో ఉన్నట్లు ఎస్టేట్స్ అధికారులు గుర్తించారు. వీరినుంచి మ్యూటేషన్ (పేరు మార్పు) చార్జీలు వసూలు చేస్తే రూ.10 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. ఏ షాపు ఎవరి ఆధీనంలో ఉంటుందనే దానిపై నివేదిక రూపొందించే పనిలో ఎస్టేట్స్ అధికారులు తలమునకలయ్యారు. ఆదాయానికి గండి కార్పొరేషన్‌కు చెందిన 69 షాపింగ్ కాంప్లెక్సులలో 3,396 షాపులు ఉన్నాయి. రైతుబజార్లు, మీ-సేవా కేంద్రాలకు 17 కాంప్లెక్సులను కేటాయించారు. మిగిలినవన్నీ ఎస్టేట్స్ ఆధీనంలోనే నడుస్తున్నాయి. కింది సిబ్బంది చేతివాటం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్పొరేషన్ షాపులతో బ్రోకర్లు బిజినెస్ చేస్తున్నారు. కొందరు రాజకీయ నేతలు బినామీ పేర్లతో షాపుల్ని దక్కించుకున్నారు. దీంతో నగరపాలక సంస్థ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. అతి తక్కువ అద్దెకు షాపుల్ని కైవసం చేసుకొని అంతకు మూడింతల అద్దెకు సబ్ లీజుకు ఇస్తున్నారన్నది బహిరంగ రహస్యం. నిబంధనల ప్రకారం షాపులను సబ్లీజుకు ఇవ్వకూడదు. ఇద్దరు కలిసి వ్యాపారం చేసేందుకు షాపు తీసుకొని అనివార్య కారణాల వల్ల ఒకరు తప్పుకొందామనుకుంటే మ్యూటేషన్ చార్జీలు కార్పొరేషన్‌కు చెల్లించాల్సి ఉంటుంది. 30 నెలల అద్దెను మ్యూటేషన్ కింద చెల్లిస్తేనే పేరు మార్పు చేస్తారు. ఇందుకు పూర్తి విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్‌లో సబ్‌లీజుల దందా కొనసాగుతోంది. దీంతో వీటి క్రమబద్ధీకరణపై కమిషనర్ దృష్టి సారించారు. గతంతో పోలిస్తే పేరు మార్పు కోసం స్టాండింగ్ కమిటీకి వచ్చిన దరఖాస్తులు ఐదే కావటం, ఈ సంఖ్య గతంతో పోలిస్తే చాలా స్వల్పంగా ఉండటంతో షాపింగ్ కాంప్లెక్స్‌ల లీజుల్లో ఏదో తేడా జరుగుతోందని మేయర్ కోనేరు శ్రీధర్ కమిషనర్‌కు సూచించారు. ఆయన పరిశీలనలో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
కార్పొరేషన్ స్కూళ్లలో సర్దుబాట
తొలి విడత హైస్కూళ్లలో.. ప్రధానోపాధ్యాయులతో కమిటీ ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం దృష్టికి విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో సర్దు‘బాట’కు కమిషనర్ జి.వీరపాండియన్ శ్రీకారం చుట్టారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. తొలి విడతగా హైస్కూళ్లలో క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులతో కమిటీ వేశారు. వారి సూచనల ప్రకారం విద్యాశాఖాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అంతర్గతంగా బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం 400 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. నగరపాలక సంస్థ పరిధిలో 28 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆరు స్కూళ్లలో 18 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉండగా, ఐదు పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా చోట్ల విద్యాప్రమాణాలు కుంటుపడుతున్నాయి. వేధిస్తున్న కొరత సర్దుబాటలో 18 మంది ఉపాధ్యాయుల్ని అవసరమైన స్కూళ్లకు బదిలీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. మరో 20 మంది ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంటుంది. జేడీఈటీ, ఏకేటీపీ, ఎస్టీవీఆర్ స్కూళ్లలో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత ఉంది. 28 పాఠశాలలకుగాను 18 మంది తెలుగు పండిట్లు మాత్రమే పనిచేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లే హైస్కూళ్లలో తెలుగు పాఠాలు బోధిస్తున్నారు. మ్యాథ్స్, పీఎస్ సబ్జెక్ట్స్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 18 సక్సెస్ స్కూళ్లలో నాలుగు ఉపాధ్యాయ పోస్టుల్ని అదనంగా మంజూరుచేయాల్సి ఉంది. హైస్కూళ్లలో 2,356 మంది విద్యనభ్యసిస్తుండగా ఆ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సర్దుబాట అనంతరం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం.