కార్పొరేషన్ స్కూళ్లలో సర్దుబాట
తొలి విడత హైస్కూళ్లలో..
ప్రధానోపాధ్యాయులతో కమిటీ
ఉపాధ్యాయుల కొరతపై ప్రభుత్వం దృష్టికి
విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలల్లో సర్దు‘బాట’కు కమిషనర్ జి.వీరపాండియన్ శ్రీకారం చుట్టారు. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి సక్రమంగా అమలయ్యేలా చర్యలు చేపట్టారు. తొలి విడతగా హైస్కూళ్లలో క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులతో కమిటీ వేశారు. వారి సూచనల ప్రకారం విద్యాశాఖాధికారులు ఫైల్ సిద్ధం చేశారు. ఒకట్రెండు రోజుల్లో అంతర్గతంగా బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం 400 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. నగరపాలక సంస్థ పరిధిలో 28 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆరు స్కూళ్లలో 18 మంది ఉపాధ్యాయులు అదనంగా ఉండగా, ఐదు పాఠశాలల్లో 38 మంది ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా చోట్ల విద్యాప్రమాణాలు కుంటుపడుతున్నాయి.
వేధిస్తున్న కొరత
సర్దుబాటలో 18 మంది ఉపాధ్యాయుల్ని అవసరమైన స్కూళ్లకు బదిలీ చేసేందుకు ఫైల్ సిద్ధం చేశారు. మరో 20 మంది ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంటుంది. జేడీఈటీ, ఏకేటీపీ, ఎస్‌టీవీఆర్ స్కూళ్లలో ప్రధానంగా ఉపాధ్యాయుల కొరత ఉంది. 28 పాఠశాలలకుగాను 18 మంది తెలుగు పండిట్లు మాత్రమే పనిచేస్తున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్లే హైస్కూళ్లలో తెలుగు పాఠాలు బోధిస్తున్నారు. మ్యాథ్స్, పీఎస్ సబ్జెక్ట్స్‌లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. 18 సక్సెస్ స్కూళ్లలో నాలుగు ఉపాధ్యాయ పోస్టుల్ని అదనంగా మంజూరుచేయాల్సి ఉంది. హైస్కూళ్లలో 2,356 మంది విద్యనభ్యసిస్తుండగా ఆ స్థాయిలో ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. దీనిపై ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలుమార్లు ఆందోళన చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో సర్దుబాట అనంతరం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు సమాచారం.