పలుకు‘బడి’!
- జిల్లాలో 936 మంది వీవీల భర్తీ
- వీవీల కేటాయింపులో పైరవీలకు పెద్దపీట
- అవసరమున్న పాఠశాలలకు మొండిచేయి
- అవసరం లేకపోయినా నియామకం
- ముందుకు సాగని చదువులు
- ఆందోళనలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
విద్యా శాఖలో పారదర్శకత లోపించింది. పైరవీలకే పెద్దపీట వేశారు. ఉపాధ్యాయుల కొరత కారణంగా చదువులు సాగడం లేదు. ప్రత్యామ్నాయ చర్యలో భాగంగా విద్యా వలంటీర్ల నియామకానికి ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో 936 మంది వీవీలను నియమించుకున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. అవసరమున్న బడులకు కేటాయించకపోగా అవసరం లేని చోట వీవీలను నియమించడంతో బోధన సాగకపోగా అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదడ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- సంగారెడ్డి మున్సిపాలిటీ
జిల్లా వ్యాప్తంగా 3,228 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం డీఎస్సీ ద్వారా కాకుండా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా ఉపాధ్యాయులను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ ప్రక్రియ జాప్యం జరుగుతోండడంతో అత్యవసరంగా విద్యా వలంటీర్లను నియమించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ లెక్కన జిల్లాలో రెండు విడతల్లో నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 936 మంది వీవీలను నియమించుకున్నారు.
275 బడుల్లో సింగిల్ టీచర్లు...
జిల్లా వ్యాప్తంగా 275 ప్రాథమికోన్నత పాఠశాలలు ఒక టీచర్‌తోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఖాళీలతో సంబంధం లేకుండా రెండు విడతలుగా జిల్లాలో 936 విద్యా వలంటీర్ల నియామక ప్రక్రియను పూర్తి చేశారు. వాస్తవానికి అవసరమున్న పాఠశాలలకు విద్యా వలంటీర్లను ఇవ్వకుండా పలుకుబడి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పనిచేస్తున్న బడులకే అదనంగా వీవీలను మంజూరి చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి.
- పుల్‌కల్ మండలం మంతూర్ పాఠశాల ఒకటి నుంచి 8 తరగతులున్నాయి. ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారు. కనీసం ఇక్కడ ఒక వీవీని కూడా నియమించలేకపోయారు.
- ముద్దాయిపేట ప్రాథమిక పాఠశాలలో కేవలం 75 మంది విద్యార్థులకు ముగ్గురు టీచర్లు ఉన్నా అదనంగా ఓ వీవీని కేటాయించారు.
- మంతూర్‌లో ఉర్దూ మీడియంలో విద్యార్థులు చదువుకునేందుకు సిద్ధంగా ఉన్నా బోధించేందుకు టీచర్లు లేని కారణంగా తెలుగు మీడియంలోనే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
- పట్టణంలోని సంజీవ్‌నగర్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉన్నా అదనంగా వీవీని నియమించారు.
ఇలా జిల్లా వ్యాప్తంగా అవసరమున్న పాఠశాలలను వదిలి అవసరం లేని పాఠశాలలకు పైరవీల ద్వారా వీవీ పోస్టులను మంజూరు చేయించుకున్నారన్న ఆరోపణలున్నాయి.
936 మంది వీవీల నియామకం: డీఈఓ
జిల్లా వ్యాప్తంగా 936 మంది విద్యా వలంటీర్లను నియమించినట్టు డీఈఓ నజీమొద్దీన్ తెలిపారు. జిల్లాకు మొదటి విడతలో 695 మంది, రెండో విడతలో 203మందితోపాటు వికలాంగుల కోటా కింద 38 మంది వీవీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేశామన్నారు. 993మందికి గాను 935 మందిని నియమించడం జరిగిందన్నారు.