నిరంతర సరఫరా పేరుతో ఏర్పాట్లు
త్వరలో కౌన్సిల్ ముందుకు
నాడు వద్దన్నారు.. నేడు ముద్దంటున్నారు
టీడీపీ డబుల్‌గేమ్
విజయవాడ సెంట్రల్ : నిరంతర నీటి సరఫరా ముసుగులో నీటి మీటర్ల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. చైనా, జపాన్ బృందాలతో వేర్వేరుగా భేటీ అయిన కమిషనర్ జి.వీరపాండియన్ నీటి సరఫరా, కుళాయిలకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా కోరినట్లు విశ్వసనీయ సమాచారం. నగరంలో నీటి సరఫరాకు వినియోగిస్తున్న టెక్నాలజీ, పంపింగ్ విధానం, బూస్టర్ల పనితీరు, వాటర్ పైప్‌లైన్ స్థితిగతుల్ని గురించి ఆయా దేశాల ప్రతినిధులబృందం అధ్యయనం చేసింది. జపాన్ బృందం విద్యాధరపురం హెడ్ వాటర్ వర్క్స్‌ను పరిశీలించింది. హంగేరీ రాయబార ప్రతినిధులు, బుడాపెస్ట్ వాటర్ వర్క్స్ సీఈవో జిజాసోమ్యీ నగరంలో పర్యటించారు. రా వాటర్ ఏవిధంగా సేకరిస్తున్నారు, ఫిల్టరైజేషన్, క్లోరినేషన్ తదితర వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి నమూనాలను సేకరించారు. తమ సంస్థ తరఫున త్వరలో ప్రణాళికలు రూపొందించి అందజేస్తామన్నారు.
సీన్ కట్ చేస్తే...
నగరంలో కుళాయిలకు మీటర్లు బిగిస్తే తప్ప నిరంతర నీటి సరఫరా సాధ్యం కాదన్న నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు తెలుస్తోంది. 59 డివిజన్ల పరిధిలో 1,17,209 కుళాయి కనెక్షన్లు ఉండగా, గృహ అవసరాల కేటగిరీలో 1,08,493, కమర్షియల్ కేటగిరీలో 8,716 కనెక్షన్లు ఉన్నాయి. నీటి సరఫరాకు రూ.32.40 కోట్లు ఖర్చవుతుండగా పన్నుల రూపంలో రూ.31 కోట్లు వసూలవుతున్నాయి. 1.65 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్ పర్ డే) నీటి సరఫరా చేస్తున్నామని, తలసరి ఒక్కో మనిషికి 150 లీటర్ల చొప్పున నీటిని అందిస్తున్నామన్నది అధికారుల లెక్క. నీటి వృథా ఎక్కువగా జరుగుతోందని, మీటర్ల ఏర్పాటుతో చెక్ పెట్టొచ్చని అధికారులు చెబుతున్నారు. 24 గంటల నీటి సరఫరా విధానంలో పైపుల్లో నీళ్లు ఎప్పుడూ నిల్వ ఉంటాయి కాబట్టి నీటి కాలుష్యాన్ని అరికట్టవచ్చని పేర్కొంటున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
నీటి మీటర్ల ఏర్పాటు ప్రతిపాదన ఎనిమిదేళ్ల క్రితమే తెరపైకి వచ్చింది. నిరంతర నీటి సరఫరా చేయాలంటే నీటి మీటర్ల ఏర్పాటు తప్పనిసరి చేయాలని అధికారులు సూచించారు. దీనిని కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ సభ్యులు ప్రజలపై భారాలు మోపితే సహించేది లేదంటూ పెద్ద ఎత్తున ఉద్యమించారు. అన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో నాటి పాలకులు ఆ వెనక్కి తగ్గారు. నీటి మీటర్లను నాడు వద్దన్న టీడీపీనే నేడు అమలుకు పావులు కదుపుతోంది.
భారాలపై భారాలు
నగరపాలక సంస్థలో ప్రత్యేక అధికారుల పాలనలో పన్నుల మోత మోగింది. 2013 మార్చిలో స్పెషల్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, కమిషనర్ జి.పండాదాస్‌లు డ్రైనేజీ, వాటర్ చార్జీలను 400 శాతం పెంచుతూ తీర్మానం చేశారు. ఏటా ఏడు శాతం చొప్పున పెంచేవిధంగా అందులో పేర్కొన్నారు. చెత్త, బిల్డింగ్ ఫీజులు, యూజర్ చార్జీలను అనూహ్యంగా పెంచేశారు. మూడున్నరేళ్ల స్పెషల్ ఆఫీసర్ల పాలనలో ప్రజలపై రూ.75 కోట్ల మేర పన్ను భారాలు పడ్డాయి. తాము అధికారంలోకి వస్తే వీటన్నింటినీ రద్దు చేస్తామని అప్పట్లో టీడీపీ నేతలు ప్రజలకు వాగ్దానం చేశారు. 2014లో ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానం ప్రకారం ఏడు శాతం చార్జీలు పెంచుతూ అధికారులు నోటీసులు ఇవ్వగా, ఆగస్టు 6న జరిగిన తొలి కౌన్సిల్‌లో ఏకగ్రీవంగావ్యతిరేకించి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. అయినా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరో ఏడు శాతం పెంచుతూ అధికారులు నోటీసులు ఇచ్చారు. తాజాగా నీటి మీటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
నగరవాసులకు ఇబ్బందే...
నగర జనాభా 12 లక్షలకు చేరింది. శివారు, కొండ ప్రాంతాలకు తాగునీరు పూర్తిగా సరఫరా కావట్లేదు. కొన్ని ప్రాంతాల్లో జరిగే నీటి వృథాను దృష్టిలో పెట్టుకొని మీటర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎంతవరకు సమంజసమన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం నగరంలో 1,79,245 అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఇందులో 40 శాతం అద్దెదారులు ఉంటున్నారు. ఉదాహరణకు ఒక ఇంట్లో నాలుగు పోర్షన్లు ఉంటే ఒక్కటే కుళాయి ఉంటుంది. మీటర్ ఏర్పాటు చేస్తే నీటి వినియోగపు లెక్కల్లో తేడాలు వచ్చే అవకాశముంది.
నగరంలో ప్రస్తుతం 69 రిజర్వాయర్లు ఉండగా 62 పనిచేస్తున్నాయి. నిరంతర నీటి సరఫరాలో భాగంగా మరో ఆరు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇస్తున్న 1.65 ఎంఎల్‌డీ నీటిని మాత్రమే 24 గంటలూ సరఫరా చేస్తారు. మీటర్లు అమరిస్తే బిల్లు పెరిగే అవకాశం ఉంటుంది.
నీటి మీటర్లు వచ్చేస్తున్నాయ్
Published Tue, Dec 1 2015 12:59 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement