♦ నీటితీరువా, రిజర్వు సొమ్ము స్వాహా
♦ శేకూరులో రూ.1.57 కోట్లకు లెక్కలే లేవు
♦ దొంగ సంతకాలు, రశీదులతో జమాఖర్చులు
♦ {పశ్నించిన రైతులకు నీటి సరఫరా బంద్
సాక్షి ప్రతినిధి, గుంటూరు : ఎత్తిపోతల పథకాల నిధులు స్వాహా అవుతున్నాయి. ఈ పథకాల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న కొత్త కమిటీలు దొంగ సంతకాలు, వేలిముద్రలతో గుట్టు చప్పుడు కాకుండా నిధులను చప్పరిస్తున్నాయి. రాష్ట్ర ఇరిగేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్, సహకార శాఖ, పోలీస్ శాఖలు ఈ నిధుల స్వాహాను కొంత వరకు గుర్తించినా, చర్యలు తీసుకునే అధికారాలు లేక ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయి. టీడీపీ రైతులే కమిటీల్లో సభ్యులుగా ఉండటంతో ఏ అధికారి వారి అక్రమాలను నిలువరించే ప్రయత్నం చేయడం లేదు. రేషన్‌షాపులు, అంగన్‌వాడీలు, భోజన పథకం ఏజెన్సీలను పొందిన తెలుగు తమ్ముళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను పొంది, రైతుల నుంచి వసూలు చేసిన నీటితీరువా, రిజర్వు నిధులను స్వాహా చేస్తున్నారు.
రాష్ట్ర ఇరిగేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాలువ చివరి భూములకు, మెట్ట భూములకు సాగునీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సాగర్ కాలువ చివరి రైతులకు, కృష్ణానదీ పరివాహక ప్రాంతాల్లోని మెట్టభూములకు సాగునీటిని అందించేందుకు 330 ఎత్తిపోతల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఆయకట్టు పరిధిలోని రైతులు కమిటీలుగా ఏర్పడి పదేళ్లుగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సానుభూతిపరులు, గ్రామాల్లోని రైతులు కమిటీలకు చైర్మన్‌లయ్యారు. పథకాల నిర్వహణ, మరమ్మతులకు అందుబాటులో ఉన్న నిధులను దొంగ సంతకాలు, వేలి ముద్రలతో స్వాహా చేస్తున్నారు.
రూ.1.57 కోట్లకు సరైన లెక్కలు లేవు...
పొన్నూరు నియోజకవర్గం శేకూరు గ్రామంలోని శ్రీకృష్ణ ఎత్తిపోతల పథకం నిధులను అక్కడి కమిటీ సభ్యులు స్వాహా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కమిటీ సభ్యుల అక్రమాలపై అక్కడి రైతులు జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్పీ, ఇరిగేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఈ కమిటీ లెక్కలను ఆడిట్ చేసే కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. 1996 నుంచి 2014-15 వరకు పథకం పరిధిలోని రైతుల నుంచి నీటితీరు వాగా వసూలు చేసిన రూ.1.57 కోట్లకు సరైన లెక్కలు లేవని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
రైతుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని స్వాహా చేసి సొంత ఆస్తులు పెంచుకున్నారని, విధివిధానాలను పూర్తిగా విస్మరించారని, ప్రతీ సంవత్సరం కమిటీ జమా ఖర్చులను ఆడిట్ చేయడం లేదని, మూడు నెలలకు ఒకసారి సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం లేదని, వీటిపై విచారణ జరపాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. లెక్కలు అడిగిన రైతులకు నీటిని సరఫరా చేయబోమంటూ బెదిరిస్తున్నారని, దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.
ఈ విషయమై ఇరిగేషన్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నరసింహంను ‘సాక్షి ప్రతినిధి’ వివరణ కోరగా, నిధుల స్వాహాపై ఆ గ్రామానికి చెందిన కొందరు రైతులు మార్చినెలలో ఫిర్యాదు చేశారని చెప్పారు. ఆ ఫిర్యాదులోని వివరాలపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌కు, సహకార శాఖ రిజిస్ట్రార్‌కు లేఖ రాసినట్టు చెప్పారు. ఉన్నతాధికారులెవరూ స్పందించక పోవడానికి కారణం ఆ కమిటీ తెలుగుదేశం పార్టీకి చెందిన రైతులతో కూడినదేనని, వారి ఒత్తిడి మేరకు విచారణ బుట్టదాఖలైనట్టు తెలు స్తోంది.
నిధులు ఎత్తిపోత
Published Wed, May 27 2015 12:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement