పైసలు కొట్టు.. ఫ్లెక్సీ కట్టు!
అది కూడా ఒక్కరోజే లేదంటే ఫైన్ తప్పదు
కార్పొరేషన్ ఖజానాకు ఏటా రూ. 50 లక్షల ఆదాయం
కమిషనర్ నిర్ణయం
విజయవాడ సెంట్రల్ : పండుగలు, పెళ్లిరోజు, అభిమాన నేతకు జేజేలు.. సందర్భం ఏదైనా కానీ ఇకపై నగరంలో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కట్టడం కుదరదు. నగరపాలక సంస్థ ఎంపిక చేసిన ప్రదేశంలో నిర్ణీత రుసుం చెల్లించిన తరువాతే ఫ్లెక్సీ రోడ్డుపై కనిపించాలి. లేదంటే జరిమానా కట్టాల్సిందే. నగర సుందరీకరణ నేపథ్యంలో ఫ్రీ పబ్లిసిటీకి చెక్ పెట్టాలని కమిషనర్ జి.వీరపాండియన్ నిర్ణయించారు. దీనికోసం విధి విధానాలతో కూడిన ఆంక్షల్ని తెరపైకి తెచ్చారు. ఫ్లెక్సీలు, బ్యానర్లను ఒకరోజు మాత్రమే అనుమతి ఇస్తారు. అది కూడా టౌన్‌ప్లానింగ్ అధికారులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే కట్టాలి. అసిస్టెంట్ సిటీప్లానర్-1 పరిధిలో 43 ప్రాంతాలను, ఏసీపీ-2 పరిధిలో 70 ప్రాంతాలను గుర్తించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలనుకునేవారు చదరపు మీటరుకు రోజుకు రూ.10 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా టౌన్‌ప్లానింగ్ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. వారి నుంచి అనుమతి వచ్చిన తరువాత ఫ్లెక్సీ లేదా బ్యానర్ ఏర్పాటు చేయాలి. ఒక్కరోజు గడువు పూర్తయిన వెంటనే సంబంధిత వ్యక్తులే స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. లేదంటే టౌన్‌ప్లానింగ్ అధికారులు జరిమానా విధిస్తారు. ఎంపిక చేసినచోట కాకుండా వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసినా పైసలు చెల్లించాల్సిందే. తాజా నిబంధనల నేపథ్యంలో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.50 లక్షలు ఆదాయం వస్తుందని అంచనా.
ఇక కష్టమే..
నగరపాలక సంస్థ పరిధిలో పబ్లిసిటీ విచ్చలవిడిగా మారింది. ప్రధాన కూడళ్లు, బందరురోడ్డు, ఏలూరురోడ్డు, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర, రాష్ట్ర మంత్రుల పర్యటనల్ని పురస్కరించుకుని రోడ్లకు ఇరువైపులా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. నేతల పర్యటనలు పూర్తయినప్పటికీ ఆ బ్యానర్లు అలానే ఉండిపోతున్నాయి. అడ్డదిడ్డంగా ఏర్పాటు చేసే బ్యానర్ల వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడడమే కాక నగర సుందరీకరణ దెబ్బతింటోందన్న వాదనలు ఉన్నాయి. ఫ్లెక్సీ తొలగింపు విషయమై గత నెలలో వివాదం తలెత్తగా బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్‌ను కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
ఉచితానికి చెక్
ఇప్పటివరకు ఉచితంగా ఉన్న పబ్లిసిటీకి ధర నిర్ణయించడం ద్వారా కార్పొరేషన్‌కు ఆదాయం రాబట్టడంతో పాటు అనవసర ప్రచారానికి కళ్లెం వేసినట్లవుతుందని కమిషనర్ ఆలోచనగా తెలుస్తోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రతి అంశాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుంటున్న అధికారులు హోర్డింగ్‌ల లీజు ధరను ఈ ఏడాది రెట్టింపు చేశారు. నగరంలో సుమారు 3254 హోర్డింగ్‌లకు గాను ప్రైవేటు ఏజెన్సీ ఏడాదికి రూ.9 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఏడాది రూ.18 కోట్లు ధర నిర్ణయించి టెండర్ పిలిచారు.