Free Teaching
-
ప్రతి నిరుద్యోగినీ...ఉద్యోగిగా
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -1, 2, 3, 4, వీఆర్ఓ, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 28న నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 28వ తేదీ ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్లరేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పిస్తామని, అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు లక్ష్మణ్ గారు తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు సెప్టెంబర్ 28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు సెప్టెంబర్ 30వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 62814 63267 నెంబర్‌ను సంప్రదించగలరు. -
డ్రాపౌట్ బాలికలకు వరం.. కేజీబీవీ
ఆదిలాబాద్ టౌన్ : కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)లు డ్రాపౌట్ బాలికలకు చదువుల తల్లిగా మారాయి. గ్రామీణ నేపథ్యం, పేదరికం తదితర కారణాల వల్ల చదువుకు దూరమైన చిన్నారులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఉచిత బోధన, దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, సబ్బులు, నూనె కోసం డబ్బు ఇచ్చి విద్యాబోధన చేస్తున్నాయి. మధ్యలో చదువు మానేసిన, పేదరికంలో మగ్గుతున్న బాలికలు ఇక్కడ చదువుకోవచ్చు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. పేదరికం కారణంగా చదువు మాన్పిద్దామనుకున్న తల్లిదండ్రులు కేజీబీవీల గురించి తెలుసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తున్నారు. కస్తూరిబాలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసిస్తూ తమ భవితకు బాట వేసుకున్నారు. సౌకర్యాలు.. జిల్లాలో 52 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు లభిస్తాయి. వీటిలో చేరిన బాలికలకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, ఏడాదికి రెండు జతల దుస్తులు, బూట్లు, బెల్టులు, టై, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. ప్రతీ నెల సబ్బులు, తల నూనె కోసం డబ్బులు ఇస్తారు. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం, రోజూ కోడిగుడ్డు ఇస్తారు. ఆదివారం రోజు చికెన్ పెడుతున్నారు. ఆడపిల్లలకు ఉచితంగా న్యాప్కిన్లు సరఫరా చేస్తారు. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎన్ఎం అందుబాటులో ఉంటుంది. ఇక చదువు సమయం చదువుదే. ప్రత్యేక తరగతులు ఉంటాయి. పదో తరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కంప్యూటర్ విద్య కూడా అందిస్తున్నారు. మెనూ.. ప్రతీ రోజు ఉదయం పాలు, రాగిమాల్ట్, బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మ, పులిహోర, తడిఅటుకులు, కిచిడీ, మధ్యాహ్నం అన్నం, కూర, పెరుగు, కోడిగుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు, సాయంత్రం బిస్కెట్లు, ఉడకబెట్టిన శనగ, బొబ్బెర్లు, అటుకులు, బెల్లంపట్టి, రాత్రి భోజనంలో అన్నం, పెరుగు, కూర, సాంబార్ అందజేస్తారు. ఆదివారం బగారా రైస్, ఎగ్ కర్రి, కొత్త మెనూలో చికెన్ కూడా పెట్టనున్నారు.