ఆదిలాబాద్ టౌన్ : కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)లు డ్రాపౌట్ బాలికలకు చదువుల తల్లిగా మారాయి. గ్రామీణ నేపథ్యం, పేదరికం తదితర కారణాల వల్ల చదువుకు దూరమైన చిన్నారులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఉచిత బోధన, దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, సబ్బులు, నూనె కోసం డబ్బు ఇచ్చి విద్యాబోధన చేస్తున్నాయి. మధ్యలో చదువు మానేసిన, పేదరికంలో మగ్గుతున్న బాలికలు ఇక్కడ చదువుకోవచ్చు.
ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. పేదరికం కారణంగా చదువు మాన్పిద్దామనుకున్న తల్లిదండ్రులు కేజీబీవీల గురించి తెలుసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తున్నారు. కస్తూరిబాలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసిస్తూ తమ భవితకు బాట వేసుకున్నారు.
సౌకర్యాలు..
జిల్లాలో 52 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు లభిస్తాయి. వీటిలో చేరిన బాలికలకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, ఏడాదికి రెండు జతల దుస్తులు, బూట్లు, బెల్టులు, టై, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. ప్రతీ నెల సబ్బులు, తల నూనె కోసం డబ్బులు ఇస్తారు. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం, రోజూ కోడిగుడ్డు ఇస్తారు. ఆదివారం రోజు చికెన్ పెడుతున్నారు.
ఆడపిల్లలకు ఉచితంగా న్యాప్‌కిన్లు సరఫరా చేస్తారు. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎన్‌ఎం అందుబాటులో ఉంటుంది. ఇక చదువు సమయం చదువుదే. ప్రత్యేక తరగతులు ఉంటాయి. పదో తరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కంప్యూటర్ విద్య కూడా అందిస్తున్నారు.
మెనూ..
ప్రతీ రోజు ఉదయం పాలు, రాగిమాల్ట్, బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మ, పులిహోర, తడిఅటుకులు, కిచిడీ, మధ్యాహ్నం అన్నం, కూర, పెరుగు, కోడిగుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు, సాయంత్రం బిస్కెట్లు, ఉడకబెట్టిన శనగ, బొబ్బెర్లు, అటుకులు, బెల్లంపట్టి, రాత్రి భోజనంలో అన్నం, పెరుగు, కూర, సాంబార్ అందజేస్తారు. ఆదివారం బగారా రైస్, ఎగ్ కర్రి, కొత్త మెనూలో చికెన్ కూడా పెట్టనున్నారు.
డ్రాపౌట్ బాలికలకు వరం.. కేజీబీవీ
Published Fri, Jul 18 2014 1:34 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement