kasturba gandhi balika vidyalayas
-
కస్తూర్బాల్లో ఇంటర్
తిర్యాణి(ఆసిఫాబాద్): కస్తూర్బాగాంధీ విద్యాలయాలు నిరుపేద విద్యార్థినులకు వరంగా మారనున్నాయి. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియెట్ చదవలేని వారి కోసం ప్రభుత్వం ఇంటర్ విద్యను అందుబాటులోకి తేవాలని నిర్ణయిం చింది. దీంతో ఈ సంవత్సరం పదో తరగతిచదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధిస్తే కస్తూర్బావిద్యాలయాల్లోనే చదువుకునే అవకాశం కల్పించనుంది. దీంతో విద్యార్థినుల్లో ఆశలు చిగు రిస్తున్నాయి. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థినులు చదువు మధ్యలో మానేయ్యకుండా ఉండడానికి ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలు ఏర్పాటు చేసింది. ప్రతీ మండలంలో ఈ విద్యాలయాలు ఉన్నాయి. 6 నుంచి 10వ తరగతి వరకు ఉచిత వసతితో విద్యను అందిస్తున్నాయి. ప్రతీ సంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాలు కూడ ఆశించిన విధంగా వస్తున్నాయి. దీంతో పేద విద్యార్థినులు మేలు పొందుతున్నారు. కానీ పదో తరగతి తర్వాత విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన బోధన ఇంటర్ వరకు లేకపోవడంతో చాల మంది విద్యార్థినులు పదో తరగతితోనే చదువు ముగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ కాలేజీలు ఉన్నా హాస్టల్ వసతి లేక అనేక మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. మరో కారణమేమిటంటే పదో తరగతి తర్వాత ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడంతో వారి చదువు మధ్యలోనే ఆగిపోతోంది. ఈ మేరకు విద్యావేత్తలు, అధికారులు ఆలోచన చేసి కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశపెడితే డ్రాపౌట్లను తగ్గించవచ్చనే ఆలోచనకు వచ్చారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రారంభించడానికి కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలతో ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యకు అనుకూలంగా ఉన్న కేజీబీవీ పాఠశాలల వివరాలు సేకరించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 15 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయి. అందులో 2,325 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. కొత్తగా పెంచికల్‌పేట, చింతలమానెçపల్లి, లింగాపూర్‌లలో 2017 జూలైలో కేజీబీవీ పాఠశాలలను ప్రారంభించారు. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం 6,7 తరగతుల్లో విద్యాబోధన ఇంగ్లిష్ మీడియంలో కొనసాగుతోంది. కాగా వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యను కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లలోని కేజీబీవీలలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కేజీబీవీల్లో మౌలిక వసతులు కల్పించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా కొత్తగా ఏర్పాటు చేసిన కస్తూర్బాల్లో 6,7 తరగతుల విద్యార్థులు 325 పోను పాత పాఠశాలల్లో చదువుకునే 2100 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. డ్రాపౌట్లకు చెక్.. జిల్లాలో చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు వ్యవ సాయం, వ్యవసాయ కూలీపై ఆధారపడి జీవించేవారే. దీంతో అధిక కుటుంబాలు ఇంటర్ చదివించే స్థోమత లేక మధ్యలో చదువు మాన్పిస్తున్నారు. ఇంటర్ విద్యను కేజీబీవీల్లో ప్రవేశపెడితే విద్యార్థుల తల్లిదండ్రులకు వారి పిల్లలను చదివించడానికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. దీంతో డ్రాపౌట్లను కూడా తగ్గించవచ్చని విద్యాశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. పేద విద్యార్థినులకు వరం కేజీబీవీల్లో ఇంటర్ విద్య ప్రవేశపెడితే పేద విద్యార్థినులకు హాస్టల్ వసతితో కూడిన విద్య లభిస్తుంది. దీంతో వారికి ఉన్నత చదువులు చదవడానికి అవకాశం కలుగుతుంది. ఇంటర్ తర్వాత కేజీబీవీల్లో డిగ్రీ కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌లోని కేజీబీవీలలో ఇంటర్మీడియెట్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. – ఎన్.శంకర్, కేజీబీవీల జిలా ప్రత్యేకాధికారి -
డ్రాపౌట్ బాలికలకు వరం.. కేజీబీవీ
ఆదిలాబాద్ టౌన్ : కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)లు డ్రాపౌట్ బాలికలకు చదువుల తల్లిగా మారాయి. గ్రామీణ నేపథ్యం, పేదరికం తదితర కారణాల వల్ల చదువుకు దూరమైన చిన్నారులను అక్కున చేర్చుకుంటున్నాయి. ఉచిత బోధన, దుస్తులు, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, సబ్బులు, నూనె కోసం డబ్బు ఇచ్చి విద్యాబోధన చేస్తున్నాయి. మధ్యలో చదువు మానేసిన, పేదరికంలో మగ్గుతున్న బాలికలు ఇక్కడ చదువుకోవచ్చు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతోపాటు వారి ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. పేదరికం కారణంగా చదువు మాన్పిద్దామనుకున్న తల్లిదండ్రులు కేజీబీవీల గురించి తెలుసుకుని తమ పిల్లలను ఇక్కడ చేర్పిస్తున్నారు. కస్తూరిబాలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత విద్యనభ్యసిస్తూ తమ భవితకు బాట వేసుకున్నారు. సౌకర్యాలు.. జిల్లాలో 52 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు ఉన్నాయి. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలు లభిస్తాయి. వీటిలో చేరిన బాలికలకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, ఏడాదికి రెండు జతల దుస్తులు, బూట్లు, బెల్టులు, టై, దుప్పట్లు, ట్రంకు పెట్టెలు ఉచితంగా అందజేస్తారు. ప్రతీ నెల సబ్బులు, తల నూనె కోసం డబ్బులు ఇస్తారు. ఉదయం పాలు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం, రాత్రి భోజనం, రోజూ కోడిగుడ్డు ఇస్తారు. ఆదివారం రోజు చికెన్ పెడుతున్నారు. ఆడపిల్లలకు ఉచితంగా న్యాప్కిన్లు సరఫరా చేస్తారు. ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎన్ఎం అందుబాటులో ఉంటుంది. ఇక చదువు సమయం చదువుదే. ప్రత్యేక తరగతులు ఉంటాయి. పదో తరగతి విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. కంప్యూటర్ విద్య కూడా అందిస్తున్నారు. మెనూ.. ప్రతీ రోజు ఉదయం పాలు, రాగిమాల్ట్, బ్రేక్‌ఫాస్ట్‌లో ఉప్మ, పులిహోర, తడిఅటుకులు, కిచిడీ, మధ్యాహ్నం అన్నం, కూర, పెరుగు, కోడిగుడ్డు, ఆకుకూరలు, కూరగాయలు, సాయంత్రం బిస్కెట్లు, ఉడకబెట్టిన శనగ, బొబ్బెర్లు, అటుకులు, బెల్లంపట్టి, రాత్రి భోజనంలో అన్నం, పెరుగు, కూర, సాంబార్ అందజేస్తారు. ఆదివారం బగారా రైస్, ఎగ్ కర్రి, కొత్త మెనూలో చికెన్ కూడా పెట్టనున్నారు.