చవక ఎల్ఈడీ టీవీ.. రేటెంతో తెలుసా?
న్యూఢిల్లీ : రూ.251కే ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చిన రింగింగ్ బెల్స్ సంస్థ, చౌకగా ఎల్ ఈడీని మార్కెట్లోకి తీసుకొస్తామని మరో సంచలన ప్రకటనతో దుమ్మురేపింది. 251 రూపాయలకు ఫోన్ ఇస్తామన్నవాళ్లు ఇక టీవీని మరెంత తక్కువ ధరకు ఇస్తారోనని ఆసక్తిగా ఎదురుచూసిన కస్టమర్లకు మాత్రం షాకే ఎదురైంది. దాదాపు రూ.10 వేలకు 31.5 అంగుళాల హెచ్ డీ ఎల్ఈడీ టీవీని ఇవ్వనున్నట్లు రింగింగ్ బెల్స్ ప్రకటించింది. దీంతో టీవీ కూడా చౌకగా వస్తుందని ఆశపడిన వినియోగదారులు ఒక్కసారిగా షాకయ్యారు.
ఈ టీవీతో పాటు నాలుగు ఫీచర్ ఫోన్లను, రెండు స్మార్ట్ ఫోన్లను, మూడు పవర్ బ్యాంకులను ఢిల్లీ ఈవెంట్ లో రింగింగ్ బెల్స్ ఆవిష్కరించింది. ఎల్ఈడీ టీవీ ధర రూ.9,900గాను, నాలు ఫీచర్ ఫోన్లు హిట్ - రూ.699, కింగ్ - రూ.899, బాస్ - రూ.999, రాజా -రూ.1099కు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటించింది. సొగసైన 3జీ, 4జీ స్మార్ట్ ఫోన్లను రూ.3,999, రూ.4,999 ధరలకు మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు ఆ కంపెనీ తెలిపింది.
ఎన్నో వాయిదాల అనంతరం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఫ్రీడమ్ స్మార్ట్ ఫోన్లు శుక్రవారం నుంచి వినియోగదారులకు అందుతాయని కూడా రింగింగ్ బెల్స్ తెలిపింది. మొదటి దశగా 5,000 ఫోన్లను కంపెనీ డెలివరీ చేయనుంది. డెలివరీ చార్జీల కింద వినియోగదారులు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది.
మరోవైపు ఒక్కో ఫ్రీడమ్ ఫోన్ పై వస్తున్న రూ.930 నష్టంతో పాటు.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్ ఫోన్లను మరిన్ని తయారీ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆ కంపెనీ ఆశ్రయించిందట. ఏకంగా రూ.50 వేల కోట్లను సహాయంగా అందించాలని ఆ కంపెనీ కోరినట్టు తెలుస్తోంది. నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరుతూ జూన్ 28నే ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ కంపెనీ లేఖ రాసిందని సమాచారం. ఒక్కో స్మార్ట్ ఫోన్ తయారీపై రూ.930 నష్టాన్ని కంపెనీ భరించిందని రింగింగ్ బెల్స్ సీఈవో మోహిత్ గోయల్ తెలిపారు. మొత్తం ఈ ఫోన్ తయారీకి రూ.1180 ఖర్చు అయినట్టు పేర్కొన్నారు. రూ.700-800లను యాప్ డెవలపర్లు, ప్రకటనల రెవెన్యూల నుంచి రికవరీ చేసుకున్నామని చెప్పారు. తర్వాత రూ. 251 (క్యాష్ ఆన్ డెలివరీ)లకు ఫోన్ అమ్ముతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఒక్కో ఫోన్ పై రూ.180 నుంచి రూ.270 వరకు నష్టాలు వస్తాయని బావిస్తున్నట్టు గోయిల్ పేర్కొన్నారు.