బోరు బావురు !
ఇష్టారాజ్యంగా తవ్వకం
60 శాతం మంచినీటి బోర్లు ఫెయిల్
అయినా కొత్త బోర్లు మంజూరు
పర్సెంటేజీల కోసమే అధికారుల కక్కుర్తి
జిల్లా తాగునీటి కోసం రూ.32.91 కోట్లు
పాతబకాయిలకే రూ.7.41 కోట్లు
బోర్లు వేసిన వారానికే ఎండిపోతున్న వైనం
చిత్తూరు: జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు సద్వినియోగం కావడం లేదు. నీటి ఎద్దడిని వ్యాపారంగా చేసుకున్న కొందరు అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు వచ్చిన నిధులు బొక్కుతున్నారు. అధికారులు సైతం తాగునీటి సమస్య పరిష్కారానికి శాశ్వత ప్రణాళికల గురించి ఆలోచించడం మాని నేతలు ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారు. నేతలు అడిగిందే తడవు కొత్త బోరు బావులు మంజూరు చేస్తున్నారు. కొందరు పర్సెంటేజీల కోసమే అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రాబోయే వేసవి నిధులను సైతం బొక్కేందుకు అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కలిసి వ్యూహం రచించినట్లు సమాచారం.
కొత్త బోర్లకు ప్రతిపాదనలు..
జిల్లాలోని కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబళ్లపల్లి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల పరిధిలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వేసవి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం జిల్లాకు ఎన్ఆర్డబ్ల్యూ కింద రూ.8 కోట్ల13 లక్షల 45 వేలు, గ్రామీణ నీటిసరఫరా విపత్తుల నిర్వహణ కింద మరో రూ.24.78 కోట్లు మంజూరు చేసింది. ఇందులో తాగునీటి సరఫరా పాత బకాయిలకు రూ.7.41 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన నిధులను తాగునీటి సమస్య పరిష్కారానికి ఖర్చుచేయాల్సి ఉంది. అధికారులు తాజాగా పలమనేరు, మదనపల్లి, పుంగనూరు, పీలేదు, చిత్తూరు ప్రాంతాల్లో 350 కొత్త బోర్లకు ప్రతిపాదనలు పంపారు. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు ప్రజల నీటి సమస్య తీర్చడం సంగతి దేవుడెరుగు బోరు బావుల పేరుతో నిధులు బొక్కేందుకు సిద్ధమయ్యారు.
వెయ్యి అడుగులు వేసినా పడని నీళ్లు..
కరువు ప్రాంతాల్లో తాగునీటి కోసం తవ్వుతున్న బోరు బావులలో 60 శాతానికి పైగా బోర్లలో నీళ్లు పడడం లేదు. అక్టోబర్లో కుప్పం, తంబళ్లపల్లి నియోజకవర్గాలలోనే 229 బోర్లు మంజూరు కాగా, 177 బోర్లు డ్రిల్లింగ్ చేశారు. అయితే 60 శాతం బోర్లలో నీళ్లు పడలేదు. వేయి అడుగుల లోతు వేస్తుండడంతో ఒక్కో బోరుకు లక్షల రూపాయలకు ఖర్చువుతున్నాయి. బోరు బావుల్లో నీళ్లు పడడం లేదని తెలిసినా అధికారులు పర్సెంటేజీల కోసమే కొత్తబోర్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా జియాలజిస్టులు పరిశీలించిన తరువాతనే బోర్లు వేయాలి. తాగునీటి సరఫరా శాఖలో జియాలజిస్టులు లేరు. భూగర్భ జలవనరుల శాఖలో ఉన్న జియాలజిస్టులనూ వాడుకోలేదు. స్థానిక నేతల మెప్పు కోసం ఎక్కడంటే అక్కడ బోర్ల తవ్వకం చేపట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులే పేర్కొంటున్నారు.