అంబేద్కర్ ఆలోచనా విధానాలు అనుసరణీయం
కవాడిగూడ, న్యూస్‌లైన్ : అంబేద్కర్ ఆలోచనా విధానాలు అందరికీ అనుసరణీయమని, పేదవారి అభ్యున్నతికి ఆయన భావజాలం మార్గదర్శకంగా నిలుస్తుందని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. 2012 టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా విభాగం ఆధ్వర్యంలో ఆదివా రం లోయర్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ భవన్లో అంబేద్కర్ స్కాలర్షిప్లు అందించారు. ముఖ్య అతిథులుగా ప్రవీణ్‌కుమార్, ఆధార్ కేంద్రాల అడిషనల్ డెరైక్టర్ జనరల్ పీఎస్ఎన్ మూర్తి, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ దయాసాగర్‌లు హాజరయ్యారు.
దళిత, బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక త్యాగాలు చేసి వారికి ఒక గమ్యాన్ని చూపించిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేద్కర్ అని వారు కొనియాడారు. జీవితంలో క్రమశిక్షణతో బతకటం కార్ల్‌మార్క్స్, ప్లేటో, అంబేద్కర్ల నుంచి నేర్చుకోవాలని సూచించారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అన్వయిస్తే సమాజంలో మార్పు తథ్యమన్నారు. ఫ్రెండ్స్ ఫర్ ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ ఇండియా చాప్టర్ ఉపాధ్యక్షుడు డాక్టర్ సిద్ధోజీరావు, ప్రధాన కార్యదర్శి జయవర్ధన్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు తదితర ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు సుమారు రూ.6 లక్షల నగదు చెక్కులు అందజేశారు.