ఆదర్శరైతుల తొలగింపు?
మహబూబ్‌నగర్ వ్యవసాయం:
ప్రభుత్వం రాష్ట్రంలోని ఆదర్శరైతులను తొలగించేందుకు పూనుకున్నట్లు ప్రచారం ఊపందుకోవడంతో ఆదర్శరైతుల్లో మళ్లీ కలవరం మొదలైంది. వీరి తొ లగింపునకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండుమూడు రోజుల్లో వెలువడనున్నట్లు తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలాఉండగా, నెలరోజుల క్రితం తొలగింపు ఊహాగానాలు ఊపందుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆదర్శరైతులు మూకుమ్మడిగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ముందు ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొంది ఆందోళన విరమించారు. మరోసారి వారు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న ఆదర్శరైతులు నేడు(సోమవారం)ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని పూనుకున్నారు. ఇలా జిల్లాలో పనిచేస్తున్న 2747 మంది ఆదర్శరైతులు పరిస్థితి సంకటస్థితిలోకి వెళ్లింది.
2007లో నియమితులైన వీరికి ప్రభుత్వం నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. ఇలా నెలకు రూ.27.47లక్షల చొప్పున ఏడాదికి రూ.3.29కోట్లు చెల్లిస్తోంది. ఇదిలాఉండగా, ఏడాది నుంచి తమకు వేతనం ఆదర్శరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘ఆద ర్శ రైతులను కక్షపూరితంగా తొలగింపునకు పూనుకుంటోంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సోమవారం నుండి ఏడీఏ కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించాం. అలాగే 25న ‘చలో హైదారాబాద్’కు పిలుపునిచ్చారు.’ అని ఆదర్శరైతు సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం స్పందనను బట్టి ఆందోళనను ఉధృతం చేస్తామని వెల్లడించారు.