కల్లోల కడలిలో.. పడవలోనే కాన్పు
వలస బతుకుల దుర్భర దైన్యానికి దర్పణం పట్టే ఉదంతమిది. వలసదారులతో కిక్కిరిసిన పడవలో ఓ నిండు గర్భిణి పురిటి నొప్పులు పడింది. ఆఫ్రికా నుంచి స్పెయిన్కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కొద్దిసేపట్లో స్పెయిన్ పాలనలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం కానరీ దీవులకు చేరతారనగా నొప్పులు ఎక్కువయ్యాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో పడవే ప్రసూతి గదిగా మారింది. చుట్టూ ఉత్కంఠగా వేచి చూస్తున్న వలసదారుల నడుమే పండంటి బాబు ఈ లోకంలోకి వచ్చాడు. తర్వాత పది నిమిషాలకే నేవీ బోటులో ఆ పడవను చుట్టుముట్టిన కోస్ట్ గార్డులు వలసదారుల మధ్యలో రక్తమయంగా కనిపించిన పసిగుడ్డును చూసి నిర్ఘాంతపోయారు. తల్లీబిడ్డలను హుటాహుటిన హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ క్షేమంగానే అన్నారు. వలస పడవలో నిస్త్రాణంగా పడి ఉన్న తల్లి పక్కన మరొకరి చేతిలో నవజాత శిశువును చూసిన క్షణాలను కోస్ట్ గార్డ్ సిబ్బంది కెమెరాలో బంధించారు. ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. క్రైస్తవులకు పర్వదినమైన ఎపిఫనీ రోజునే ఈ ఘటన జరగడం విశేషం. ఆ రోజున ప్రధానంగా బాలలకు బోలెడన్ని కానుకలివ్వడం సంప్రదాయం. అలాంటి పండుగ రోజున వలస దంపతులకు ఏకంగా బుల్లి బాబునే దేవుడు కానుకగా ఇచ్చాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్