ఫుల్ ట్యాంక్ వద్దు..
సాక్షి,సిటీ బ్యూరో: మండుతున్న పెట్రో ధరలకు తోడు పెరుగుతున్న ఎండలకు వాహనాల్లో ఇంధనం ఆవిరైపోతోంది. హైదరాబాద్ మహా నగరంలో గత వారం రోజులుగా ఉష్ణోగ్రత తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఉష్ణతాపం వాహనాల్లోని ఇంధనంపై ప్రభావం చూపుతోంది. ద్విచక్ర వాహనంలో లీటర్ పెట్రోల్ ఏ మూలకు సరిపోవడం లేదు. ఎండల్లో పార్కింగ్ లేదా ప్రయాణాలతో వాహనాల్లో ఇంధనం ఆవిరై గాలిలో కలుస్తోంది. దీంతో వాహనాల మైలేజీ కూడా తగ్గిపోతోంది. ఉదయం ఆరు గంటల నుంచి బాణుడు నిప్పులు చెరుగుతుండటంతో వాహనాలు వేడెక్కుతున్నాయి. ట్యాంకుల్లో ఇంధనం వేడెక్కి అవిరై గాలిలో కలుస్తోంది.
20 శాతంపైనే ..
గ్రేటర్ పరిధిలో ప్రతి రోజు సగటు వినియోగంలో 20 శాతం పైగా పెట్రో, డీజిల్ ఉష్ణతాపానికి ఆవిరై గాలిలో కలుస్తున్నట్లు అంచనా. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ నేపథ్యంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకుల ద్వారా ప్రతి రోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది. ప్రతిరోజు ధరల సవరణలతో పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులు అవసరాలకు మించి వాహనాల్లో పెట్రోల్, డీజిల్‌ను పోయించుకుంటున్నారు. దీంతో వాహనాల ట్యాంకులు వేడెక్కి ఇంధనం ఆవిరైపోతుంది.
ఫుల్ ట్యాంక్ వద్దు..
ప్రధాన ఆయిల్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల నిల్వల పట్ల వాహనదారులకు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాహనాల ట్యాంక్‌లో సగం వరకే ఇంధనం నింపాలని సూచిస్తున్నాయి. ఫుల్ ట్యాంక్ చేస్తే ప్రమాదమని, గతంలో ట్యాంక్ నిండుగా నింపటం వల్ల ప్రమాదాలు సంభవించినట్లు బోర్డుల ను ప్రదర్శిస్తున్నాయి. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.