fund divertion
-
జెట్ ఎయిర్వేస్పై ఎస్ఎఫ్ఐవో దర్యాప్తు?
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్లో నిధుల మళ్లింపు, పెట్టుబడుల మాఫీ వంటి చర్యలపై తీవ్ర మోసాలకు సంబంధించి దర్యాప్తు విభాగం (ఎస్ఎఫ్ఐవో) విచారణకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ ఖాతాలను ప్రాథమికంగా పరిశీలించిన రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) ముంబై విభాగం... కంపెనీల చట్టం నిబంధనలు ఉల్లంఘించినట్టు, లెక్కల్లోని రాని పెట్టుబడులను గుర్తించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో ఈ కేసును ఎస్ఎఫ్ఐవో దర్యాప్తునకు నివేదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. ఆర్వోసీ ముంబై విభాగం జెట్ ఎయిర్వేస్ ఖాతాల తనిఖీకి సంబంధించి ఇప్పటికే కార్పొరేట్ శాఖకు నివేదిక కూడా సమర్పించింది. జెట్ ఎయిర్వేస్ పలు సబ్సిడరీలకు సంబంధించి మాఫీ చేసిన పెట్టుబడులపై ఎస్ఎఫ్ఐవో దృష్టి సారించనుంది. ఈ నిధులు ఎక్కడికి చేరాయన్నదీ ఆరా తీయనున్నట్టు అధికార వర్గాల సమాచారం. అప్పటి వరకు మంచి లాభాలు ప్రకటించి, ఉన్నట్టుండి 2018లో నష్టాలు ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందన్న అంశాన్ని గుర్తించేందుకు కంపెనీ యాజమాన్యాన్ని సైతం వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. అరవింద్ గుప్తా అనే ప్రజా వేగు ఇచ్చిన ఫిర్యాదులో... జెట్ ప్రమోటర్లు రూ.5,125 కోట్లను కంపెనీ ఖాతాల నుంచి కొల్లగొట్టే ప్రయత్నం చేసినట్టు పేర్కొన్నారు. ఆడిట్ కమిటీ సైతం నిధుల మళ్లింపును నిరోధించలేకపోయిందన్నారు. జెట్ ఎయిర్వేస్, జెట్‌లైట్ బ్రాండ్లు ప్రమోటర్లకు చెందిన కంపెనీలతో లావాదేవీలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే ఆర్వోసీ ముంబై విభాగం ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయగా, తదుపరి పూర్తి స్థాయి దర్యాప్తు కోసం ఎస్ఎఫ్ఐవో రంగంలోకి దిగనుంది. ఐసీఐసీఐ–వీడియోకాన్ రుణాల కేసులోనూ అక్రమాలను బయటపెట్టింది అరవింద్ గుప్తాయే కావడం గమనార్హం. వేలానికి జెట్ ఎయిర్వేస్ కార్యాలయం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో ఉన్న జెట్ ఎయిర్వేస్ కార్యాలయాన్ని వేలం వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ ప్రకటించింది. దీనికి రూ. 245 కోట్ల రిజర్వు ధర నిర్ణయించినట్లు, మే 15న ఈ–వేలం నిర్వహించనున్నట్లు బహిరంగ ప్రకటనలో వెల్లడించింది. 52,775 చ.అ. విస్తీర్ణం ఉన్న ఈ కార్యాలయం.. జెట్ ఎయిర్వేస్ గోద్రెజ్ బీకేసీ భవంతిలో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీకి జెట్ ఎయిర్వేస్ రూ. 414 80 కోట్ల మేర రుణాలు బాకీపడింది. ఇప్పటికే జెట్ యాజమాన్య బాధ్యతలను తమ చేతుల్లోకి తీసుకున్న రుణదాతలు.. కంపెనీలో వాటాల విక్రయానికి బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఎతిహాద్ ఎయిర్వేస్, టీపీజీ క్యాపిటల్, ఇండిగో పార్ట్నర్స్, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) సంస్థలు వాటాల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బిడ్డర్ల పూర్తి వివరాలు శుక్రవారం వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. -
మాల్యాకు మరో షాక్!
సాక్షి, న్యూఢిల్లీ: వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు చెక్కేసిన వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సెబీ గట్టి షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మాల్యాపై నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్టాక్‌మార్కెట్లనుంచి మరో మూడేళ్ల పాటు నిషేధించింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌నుంచి అక్రమంగానిధులను మళ్లించిన ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే లిస్టింగ్ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగకుండా మరో ఐదేళ్లపాటు నిషేధించింది. మాల్యాతో పాటు కంపెనీ మాజీ అధికారులు అశోక్ కపూర్, పిఎ మురళిపై ఒకసంవత్సరం బ్యాన్ విధించింది. అక్రమ లావాదేవీల వ్యవహారంలో చర్యల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ పూర్తికాలపు సభ్యులు జీ మహాలింగం వెల్లడించారు. జనవరి 2017 లో తాత్కాలిక ఆర్డర్ ద్వారా, అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి మాల్యా, కపూర్, మురళి సహా యునైటెడ్ స్పిరిట్స్‌కు చెందిన ఆరుగురిపై మూడేళ్లపాటు నిషేధం విధించింది. మరోవైపు ఫార్ములా వన్ మోటార్ స్పోర్ట్ కంపెనీ ఫోర్స్ ఇండియా డైరెక్టర్ పదవికి మాల్యా రాజీనామా చేశారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, విచారణ నేపథ్యంలో కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా ‘ఫోర్సు ఇండియా’ డైరెక్టర్ పదవి చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మాల్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. -
ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం
♦ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దమ్మిడీ కూడా ఇవ్వలేదు ♦ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు ♦ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన వైఎస్ జగన్ ♦ సర్కారు తీరుకు నిరసనగా ప్రతిపక్షం వాకౌట్ సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ(ఇన్పుట్ సబ్సిడీ)ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయలేదని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకృతివైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు చెల్లించిన పరిహారం గురించి సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, కోరుముట్ల శ్రీనివాసులు, అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో విపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని మాట్లాడారు. ‘‘2013-14లో తుపాన్లు వచ్చినప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ ప్రాంతాలకు వెళ్లి.. పంట నష్టపోయిన రైతులను తాము అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక రూ.1,602 కోట్ల ఇన్పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టారు. 2014-15లో పెట్టుబడి రాయితీ కింద రూ.1,500 కోట్లకుపైగా కావాలని ప్రతిపాదనలు పంపిస్తే, మంత్రివర్గ సమావేశాల్లో పలు దఫాలుగా చర్చించి, దాన్ని తగ్గించేశారు. రూ.858 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.79 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి చెప్పారు. 2015-16కు సంబం ధించిన రూ.1,021 కోట్ల నష్టపరిహారం చెల్లిం చాల్సి ఉందని, ఇప్పటివరకూ పైసా కూడా చెల్లించలేదని మంత్రి తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మరి రైతుల పరిస్థితి ఏమిటి? 2014-15లో కేంద్రం 2 దఫాలుగా రూ.974 కోట్లు విడుదల చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.858 కోట్లే. ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రం 50 శాతం నిధులిస్తే, మిగతా 50 శాతాన్ని రాష్ట్రం భరించాలి. కానీ, బాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన సొమ్మును కూడా పూర్తిగా రైతులకివ్వకుండా పక్కదారి పట్టించింది. ఇది నేను అంటున్న మాట కాదు. మంత్రే చెప్పారు. 2015-16లో కేంద్రం రూ.750 కోట్లు ఇచ్చిం దని మంత్రి చెప్పారు. కానీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం దమ్మిడీ కూడా ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన సొమ్మును రైతులకు చెల్లించకుండా మళ్లిస్తున్నందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ అని జగన్ పేర్కొన్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మాఫీ పొందిన కౌలు రైతులు ఎందరు? రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉన్నాయని, మరో 16.25 లక్షల మంది కౌలు రైతులున్నారని మంత్రి పుల్లారావు చెప్పారు. కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వకపోవడం పట్ల విపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘20 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉంటే.. రుణాలు పొందిన కౌలు రైతుల సంఖ్య 95,299. రుణాలు ఇచ్చిందే చాలా తక్కువ మందికి. వారిలో ఎంత మందికి రుణాలు మాఫీ చేశారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. కౌలు రైతులు రూ.204 కోట్ల రుణం పొందారని, అందులో రూ.119.96 కోట్ల రుణాన్ని మాఫీ చేశామని మంత్రి సమాధానం ఇచ్చారు. కౌలు రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణం ఇప్పించాలని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు. 2జీ కంటే శ్రీకాకుళంలో పెద్ద కుంభకోణం: విష్ణుకుమార్ రాజు శ్రీకాకుళం జిల్లాల్లో జరుగుతున్న బీచ్‌శాండ్ స్కామ్.. బొగ్గు, 2జీ కుంభకోణాల కంటే పెద్దదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. అనుమతి లేని ప్రాంతంలో బీచ్‌శాండ్‌ను తవ్వుతున్నట్లు గనుల శాఖ అధికారులు తమకు చెప్పారని తెలిపారు. చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కోరితే.. తాను చాలా చిన్నవాడినని, ఈ కుంభకోణం వెనక పెద్దమనుషులు ఉన్నారంటూ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ‘మోనోసైట్’ అనే ఖనిజం ఉందని, అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందన్నారు. ఇంత భారీ కుంభకోణం గురించి సభలో మాట్లాడుకుంటున్నప్పుడు, ముఖ్యమంత్రి సభలో లేకపోవడం దురదృష్టకరమని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.