ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం | governement is diverting central funds meant for farmers, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం

Published Tue, Mar 15 2016 1:39 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం - Sakshi

ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం

♦ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దమ్మిడీ కూడా ఇవ్వలేదు
♦ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించారు
♦ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తూర్పారబట్టిన వైఎస్ జగన్
♦ సర్కారు తీరుకు నిరసనగా ప్రతిపక్షం వాకౌట్  
 
 సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీ(ఇన్‌పుట్ సబ్సిడీ)ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయలేదని విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రకృతివైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు చెల్లించిన పరిహారం గురించి సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, కోరుముట్ల శ్రీనివాసులు, అనిల్‌కుమార్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి పుల్లారావు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో విపక్ష నేత జగన్ జోక్యం చేసుకొని మాట్లాడారు. ‘‘2013-14లో తుపాన్లు వచ్చినప్పుడు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆ ప్రాంతాలకు వెళ్లి.. పంట నష్టపోయిన రైతులను తాము అధికారంలోకి రాగానే ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

తీరా అధికారంలోకి వచ్చాక రూ.1,602 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి ఎగనామం పెట్టారు. 2014-15లో పెట్టుబడి రాయితీ కింద రూ.1,500 కోట్లకుపైగా కావాలని ప్రతిపాదనలు పంపిస్తే, మంత్రివర్గ సమావేశాల్లో పలు దఫాలుగా చర్చించి, దాన్ని తగ్గించేశారు. రూ.858 కోట్లు చెల్లించారని, ఇంకా రూ.79 కోట్లు చెల్లించాల్సి ఉందని మంత్రి చెప్పారు. 2015-16కు సంబం ధించిన రూ.1,021 కోట్ల నష్టపరిహారం చెల్లిం చాల్సి ఉందని, ఇప్పటివరకూ పైసా కూడా చెల్లించలేదని మంత్రి తెలిపారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మరి రైతుల పరిస్థితి ఏమిటి? 2014-15లో కేంద్రం 2 దఫాలుగా రూ.974 కోట్లు విడుదల చేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చింది కేవలం రూ.858 కోట్లే. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం కేంద్రం 50 శాతం నిధులిస్తే, మిగతా 50 శాతాన్ని రాష్ట్రం భరించాలి.

కానీ, బాబు ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన సొమ్మును కూడా పూర్తిగా రైతులకివ్వకుండా పక్కదారి పట్టించింది. ఇది నేను అంటున్న మాట కాదు. మంత్రే చెప్పారు. 2015-16లో కేంద్రం రూ.750 కోట్లు ఇచ్చిం దని మంత్రి చెప్పారు. కానీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం దమ్మిడీ కూడా ఇవ్వలేదు. కేంద్రం ఇచ్చిన సొమ్మును రైతులకు చెల్లించకుండా మళ్లిస్తున్నందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం’’ అని జగన్ పేర్కొన్నారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

 మాఫీ పొందిన కౌలు రైతులు ఎందరు?
 రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఉన్నాయని, మరో 16.25 లక్షల మంది కౌలు రైతులున్నారని మంత్రి పుల్లారావు చెప్పారు. కౌలు రైతులందరికీ రుణాలు ఇవ్వకపోవడం పట్ల విపక్ష నేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘20 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉంటే.. రుణాలు పొందిన కౌలు రైతుల సంఖ్య 95,299. రుణాలు ఇచ్చిందే చాలా తక్కువ మందికి. వారిలో ఎంత మందికి రుణాలు మాఫీ చేశారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. కౌలు రైతులు రూ.204 కోట్ల రుణం పొందారని, అందులో రూ.119.96 కోట్ల రుణాన్ని మాఫీ చేశామని మంత్రి సమాధానం ఇచ్చారు. కౌలు రైతులందరికీ బ్యాంకుల నుంచి రుణం ఇప్పించాలని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, రామారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ తదితరులు ప్రభుత్వాన్ని కోరారు.
 
 2జీ కంటే శ్రీకాకుళంలో పెద్ద కుంభకోణం: విష్ణుకుమార్ రాజు
 శ్రీకాకుళం జిల్లాల్లో జరుగుతున్న బీచ్‌శాండ్ స్కామ్.. బొగ్గు, 2జీ కుంభకోణాల కంటే పెద్దదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్‌రాజు ఆరోపించారు. అనుమతి లేని ప్రాంతంలో బీచ్‌శాండ్‌ను తవ్వుతున్నట్లు గనుల శాఖ అధికారులు తమకు చెప్పారని తెలిపారు. చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్‌ను కోరితే.. తాను చాలా చిన్నవాడినని, ఈ కుంభకోణం వెనక పెద్దమనుషులు ఉన్నారంటూ సమాధానం ఇచ్చారని వెల్లడించారు. ఆ ప్రాంతంలో ‘మోనోసైట్’ అనే ఖనిజం ఉందని, అంతర్జాతీయ మార్కెట్‌లో దాని విలువ రూ.12 వేల కోట్లు ఉంటుందన్నారు. ఇంత భారీ కుంభకోణం గురించి సభలో మాట్లాడుకుంటున్నప్పుడు, ముఖ్యమంత్రి సభలో లేకపోవడం దురదృష్టకరమని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement