అవును.. ప్రధాని సావధానంగా విన్నారు: వైఎస్ జగన్ | Narendra Modi heard our words on special status, says YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అవును.. ప్రధాని సావధానంగా విన్నారు: వైఎస్ జగన్

Published Mon, May 15 2017 8:06 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

Narendra Modi heard our words on special status, says YS Jagan Mohan Reddy

రైతుల సమస్యలపై అసెంబ్లీని స్తంభింపజేస్తామని వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్‌సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద ప్రధానమంత్రిని కలవకపోతే అమెరికా అధ్యక్షుడిని కలుస్తామా అని ప్రశ్నించారు. తాను ఎప్పుడో ఫిబ్రవరిలో ప్రధానికి రాసిన లేఖకు అప్పుడే అక్కడినుంచి సమాధానం కూడా వచ్చిందని, దాన్ని ఇప్పుడు రాసినట్లుగా ఆంధ్రజ్యోతి ప్రచురించిందని, వాళ్లకు అది ఏ అధికారి నుంచి వచ్చిందో వాళ్లనే అడగాలని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి ప్రధాని చాలా సావధానంగా విన్నారని, ఆయన హోదా ఇస్తారనే ఆశ తమకు ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కూడా తాము హోదానే ప్రధాన అంశం చేస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

  • జీఎస్టీ బిల్లుకు సంబంధించి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న బిల్లు ఒక ఫార్మాలిటీ
  • కేంద్రం ఇదివరకే నాలుగు బిల్లులు ప్రవేశపెట్టి, ఆమోదించిన నేపథ్యంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి అన్నీ కేంద్రం చేసింది.
  • రాష్ట్రానికి సంబంధించిన జీఎస్టీని రాష్ట్రాలకు పంపడం ఒక ఫార్మాలిటీ
  • జీఎస్టీకి ఎవరూ వ్యతిరేకం కాదు. దానివల్ల మంచి జరుగుతుంది, పన్నుల మీద పన్నులు పడే పరిస్థితి ఉండదు కాబట్టి రేట్లు తగ్గుతాయనే ఆశ ప్రతి సామాన్యుడిలోను ఉన్న నేపథ్యంలో అందరూ దీన్ని స్వాగతిస్తున్నారు
  • వైఎస్ఆర్‌సీపీ తరఫున కేంద్రంలో ఈ బిల్లుకు మద్దతిచ్చాం, రాష్ట్రంలో కూడా మద్దతివ్వడంలో ఎలాంటి అనుమానం లేదు
  • ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోడానికి బిల్లు పెడుతున్నారు గానీ, రైతు ఆదాయాన్ని గురించి ఆలోచన చేయడం లేదు
  • గిట్టుబాటు, మద్దతుధరలు లేక ఏ పంట చూసినా అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉండటంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు
  • ఉల్లి కిలో రూపాయికి, రెండు రూపాయలకు అమ్ముకుంటున్నారు
  • గత సంవత్సరం 25-30కి అమ్మారు
  • కంది 8వేలు-8500 ఉంటే ఇప్పుడు మూడు, నాలుగు వేలకు కూడా కొనట్లేదు
  • పెసర గతంలో ఆరువేలు ఉంటే ఇప్పుడు  నాలుగువేలు పలుకుతోంది
  • మినుము గతంలో 12 వేలు అయితే ఇప్పుడు ఆరువేలు ఉంది
  • మిర్చి గత సంవత్సరం 12-14వేలు పలికితే ఇప్పుడు 800-4000 మధ్య అమ్ముకోవాల్సిన అధ్వానమైన పరిస్థితి ఉంది
  • పసుపు గత ఏడాది 9వేలు అమ్మితే ఈ ఏడాది 4000-4500 దాటడం లేదు
  • టన్ను మామిడి గత సంవత్సరం 45 వేలు పలికితే ఇప్పుడు 7వేలకు అమ్ముతున్నారు
  • కానీ రైతు కొనాల్సిన పశుగ్రాసం మాత్రం ఎకరా పదివేల రూపాయలు ఉంది.
  • ఒక గేదెకు ఒక ఎకరా కావాలి.. ఎండు గడ్డి రేటు ఎకరా పదివేలు
  • గత సంవత్సరం ఇది 5వేలు. చంద్రబాబు సీఎం అయ్యేనాటికి 2, 3 వేలు మాత్రమే ఉండేది
  • పరిస్థితి ఇంత దారుణంగా ఉండి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతామన్నారు
  • మేం 3వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెడతాం అనగానే రైతులను మోసం చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు.. పూర్తిగా రుణాల మాఫీ చేస్తాను, బ్యాంకుల్లో బంగారం ఇంటికి తెస్తానని ఏ రకంగా మోసపూరిత మాటలుచెప్పాడో, వాటినే కొనసాగిస్తూ ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు
  • మొన్న మిర్చి ధరల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడే.. రైతు పరిస్థితి మారకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం అని చెప్పాం, ఇప్పుడూ అదే చెబుతున్నాం
  • రైతు పరిస్థితిని పట్టించుకోని చంద్రబాబుకు బుద్ధి వచ్చేందుకు రైతులకు తోడుగా నిలబడతాం
  • రైతు పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మార్కెట్లో దళారులు దారుణంగా ఉన్నారు
  • ఎవరైనా హెరిటేజ్ షాపుకు వెళ్లి మిర్చి కొనాలంటే 200 గ్రాముల ప్యాకెట్ 50 రూపాయలు. అంటే క్వింటాలు దాదాపు 25వేల రూపాయలు ఉంది.
  • కానీ రైతు దగ్గరకు వచ్చేసరికి 2వేల నుంచి 4 వేల మధ్యలో ఉంది
  • రైతు నుంచి వ్యాపారి వరకు పోయేసరికి ఇంత తేడా కనిపిస్తోంది
  • చంద్రబాబు రైతుల సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటే.. హెరిటేజ్‌లో తన లాభాలు తగ్గుతాయని
  • హెరిటేజ్‌లో ఎక్కువ ధరలకు కొనాల్సి ఉంటుందని ఇంత దారుణంగా చంద్రబాబు దగ్గర నుంచి దళారులు, వ్యాపారులు రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు
  • 92 లక్షల క్వింటాళ్లు పండాయి కాబట్టి కనీసం 50 లక్షల క్వింటాళ్లు కొంటేనే మార్కెట్లో పోటీ వస్తుంది, వ్యాపారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేస్తారు
  • కేంద్రం కాస్తో కూస్తో ముందుకొచ్చి 5వేలు క్వింటాలుకు ఇస్తామని ముందుకొచ్చింది.. సంతోషం
  • కేంద్రం నుంచి అంత వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి.. మరో 3వేలు జతచేసి కనీసం 8వేలకు అయినా కొనుగోలు చేస్తే రైతులకు కనీసం ఖర్చులు వస్తాయి
  • ఎకరాకు రైతుకు లక్షా 30 వేల నుంచి లక్షా 60 వేల వరకు ఖర్చవుతుంది
  • ఎకరాకు 13-15 క్వింటాళ్లు కూడా రాలేదు, రైతులు ఎలా బతుకుతారు?
  • మిర్చి, ఉల్లి, మామిడి, టమోటా.. ఏ పంట చూసినా రైతులు బతికే పరిస్థితి లేదు
  • ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అందిన సహాయం కేవలం 2 కోట్లు.. చంద్రబాబు సిగ్గుతో తల దించుకోవాలి
  • ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు అన్నిరకాలుగా అండగా నిలిచేందుకు, చంద్రబాబు ఇంత దారుణంగా పాలన చేస్తున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలిచే దిశగా అడుగులు వేస్తూ, అసెంబ్లీని స్తంభింపజేస్తామని చెబుతున్నాం
  • 5వేల కోట్లతో స్థిరీకరణ నిధి పెట్టాల్సిందే, గిట్టుబాటు ధరలకు పంటలను కొనాల్సిందేనని అల్టిమేటం ఇస్తున్నాం


వ్యవస్థలను చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారు...

  • ఫిబ్రవరి 17న ప్రధానికి లేఖ రాశాను.. దాన్ని కరుణాకర రెడ్డి కూడా చూపించారు
  • చంద్రబాబు తన అధికారంతో ఒకవైపు ప్రతిపక్షమే ఉండకూడదన్న దుర్బుద్ధితో నిస్సిగ్గుగా తన దగ్గర ఉన్న అధికారంతో వ్యవస్థలను మేనేజ్ చేస్తుంటే.. అధికారులను ప్రలోభపెట్టి, వాళ్లతో తప్పులు చేయిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
  • రాజ్యాంగ పరిధిలో ఉన్నాం.. ట్రంప్‌కో, అమెరికా గవర్నర్‌కో చేయలేం కదా, ప్రధానికే ఫిర్యాదు చేస్తాం
  • అధికారులు ఇలా చేస్తున్నారు, వాళ్లకు చంద్రబాబు నుంచి సూచనలు వస్తున్నాయి, వీళ్లు చేస్తున్న వేధింపుల మీద లోతుగా దర్యాప్తు చేయాలని ప్రధానమంత్రికే కాదు.. సీవీసీకి, అందరికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాం
  • ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి, ఆ బెయిల్‌ను రద్దు చేయాలని మళ్లీ కోర్టుకు పోవడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదు
  • తప్పు చేశాడని రుజువు కాకుండా జైల్లో పెట్టడమే తప్పు, రాజ్యాంగం ప్రకారం 3 నెలల్లోపు విడుదల చేయాలి
  • కానీ చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కై కేసులు పెట్టారు.. అక్కడి నుంచి కేసులు నడిపించేవరకు కూడా అంతా వాళ్లే
  • అప్పుడు చంద్రబాబు ఫోన్లలోనే అధికారులతో నడిపించారు, వాళ్లు మీడియాకు సెలెక్టివ్ లీకులు ఇచ్చారు
  • ఎంతవరకు చెప్పాలి, ఏ రకంగా చెడ్డపేరు రావాలని చూశారు
  • దర్యాప్తు అధికారులు ఇలా చేయకూడదు గానీ, వాళ్లతో ఈయన చేయించారు
  • అప్పుడు అలా చేశారు, ఇప్పుడు మళ్లీ తనకున్న మంత్రిని కేంద్రంలో కూర్చోబెట్టుకుని ఆయనతోను, చంద్రబాబుకు సపోర్ట్ చేస్తున్న మంత్రులను ఉపయోగించుకుని ఇదే కార్యక్రమం చేస్తున్నారు
  • టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాజీ సీఎస్ ఏదో చెబితే, నేను ప్రభావితం చేశానని, బెయిల్ రద్దు చేయాలని అన్నారు.
  • ఇలాంటి వ్యక్తి ఇంత దారుణంగా చేస్తున్నాడు.. ఎవరు ఎవరితో టచ్‌లో ఉన్నారు, ఎవరి దగ్గరకు వెళ్తున్నారు, ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారో అన్నింటి మీదా దర్యాప్తు చేయాలని లెటర్లు రాయడం ప్రజాస్వామ్యంలో్ తప్పదు
  • అవతలివాడు కొడుతున్నా కొట్టించుకుంటే ఎవడూ బతకడు


బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లేఖ తీసుకెళ్లి ఇస్తాడా?

  • చంద్రబాబు మీడియాను ఎంతలా మేనేజ్ చేస్తారంటే.. చివరకు ఒక మీడియా హౌస్ న్యాయం తరఫున మాట్లాడాల్సింది పోయి.. జరగనిది జరిగినట్లుగా కుకప్ చేసింది
  • నేను ఫిబ్రవరి 17న లేఖ రాస్తే, వాళ్ల దగ్గర నుంచి సమాధానం కూడా వచ్చింది.
  • మే 10న నేను ప్రధానమంత్రిని కలిశాను
  • బుద్ధి ఉన్నవాడెవడైనా పాత లెటర్ తీసుకెళ్లి ఇస్తాడా..
  • నేను మే 10న ఇచ్చిన లేఖను పక్కన పెట్టి, ఫిబ్రవరి 17న నేను రాసిన లేఖను ప్రస్తావించారు.
  • మొదటి పేజీ చూపిస్తే తేదీ చూపించాల్సి వస్తుందని చివర పేజీ వేశారు
  • ఇదే లేఖ పెట్టి మీడియా అబద్ధాలు చెబుతుంటే ఈ వ్యవస్థలో ఎవరైనా బతకగలరా?
  • ప్రతిపక్ష నాయకుడిగా ప్రధనమంత్రిని కలిసి సమస్యలు చెప్పడం తప్పా?


ప్రధానితో హోదా సహా అన్ని విషయాలూ మాట్లాడాం

  • గంట సేపు మాట్లాడితే సహజంగానే అన్నీ మాట్లాడతాం
  • ప్రత్యేక హోదా అంశం మీదే 10-15 నిమిషాలు చెప్పి ఉంటాం
  • నిజమా జగన్.. మరి 4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు అని ప్రధాని అన్నారంటే ఈయన ఏ రకంగా మిస్‌లీడ్ చేశారో అర్థమవుతుంది.
  • అగ్రిగోల్డ్ గురించి మాట్లాడాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు చంద్రబాబు కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చాయన్నాను
  • మిర్చి రైతుల అవస్థల గురించి కూడా మోదీతో ప్రస్తావించాను
  • సహజంగా రాజకీయాలు కూడా మాట్లాడతాం
  • చంద్రబాబు ఎలా దోచుకుంటున్నాడు, అవినీతిలో ఏపీని నెంబర్ 1 అని ఎలా చెప్పారు, కాగ్ నివేదిక చంద్రబాబు మీద ఆరోపణలను ధ్రువీకరిస్తూ ఎలా నివేదిక ఇచ్చింది, రాజధాని కేంద్రంగా చంద్రబాబు చేస్తున్న స్కాంలు ఏంటి.. అన్నింటి మీదా కూలంకషంగా చెప్పాం
  • చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఎలా చేస్తున్నాడో అన్నీ చెప్పాను
  • కానీ చంద్రబాబుకు ఉన్నట్టుండి మోదీ అంటరాని వాడు అయిపోయారు
  • మోదీ జగన్‌కు ఎందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని అడుగుతున్నారు
  • ప్రతిపక్ష నాయకుడికి మోదీ అపాయింట్‌మెంట్ ఇవ్వడం తప్పా, ప్రతిపక్ష నేత సమస్యలు చెప్పడం తప్పా?
  • నువ్వు మోదీ దగ్గరకు వెళ్లి ప్రత్యేక హోదా గురించి ఎప్పుడు మాట్లాడావు, ఎప్పుడు ఒత్తిడి తెచ్చావు.. ఏరోజూ చెప్పలేదు
  • పైగా నువ్వు చెయ్యవు, ఎవరైనా చేస్తే వాళ్లమీద అభాండాలు వేయడం
  • నేను మోదీని కలవడం తప్పన్నట్లు, ఆయనకు విషయాలు చెప్పడం, ఆయన వినడం అన్నీ తప్పన్నట్లు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది
  • ఏ ఈడీ అధికారి నుంచి ఆంధ్రజ్యోతికి ఆ లేఖ వచ్చిందో వాళ్లనే అడగండి
  • సోషల్ మీడియా పోస్టింగులకు సంబంధించి ఒక వ్యక్తిని 14 రోజులు జైల్లో పెట్టారు
  • నిజంగా మీరు చేస్తున్నది కరెక్టేనా?
  • వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారంటే.. కేసులు పెట్టడం దగ్గర నుంచి లోపల వేసేవరకు
  • ఎన్నికలకు ముందు నా గురించి ఎంత దారుణంగా నైతిక విలువలు మర్చిపోయి పోస్టింగులు చేయించారు
  • నక్కను పెట్టి, దాని ముఖానికి నా ఫొటో తగిలిస్తే తప్పు కాదా
  • జగన్‌ను ప్రేమించేవాళ్లు కూడా కడుపు మండి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్లను బెదిరించి కేసులు పెడుతున్నారు
  • వ్యవస్థలను ఇంత దారుణంగా మేనేజ్‌ చేసేవాళ్లు సీఎం పదవిలో కూర్చోడానికి అర్హుడు కాడు


నా షెడ్యూల్ ఇదీ.. మరి బాబు ఎక్కడికెళ్లారు?

  • నాకైతే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాత్రి ఫోన్ వచ్చింది, పొద్దున్నే రమ్మన్నారు
  • ఉదయం 6.30 విమానానికి బయల్దేరి వెళ్లాం, అది సాంకేతిక సమస్య కావడంతో 7.30కి వేరే విమానంలోకి మారాం
  • అక్కడకు వెళ్లేసరికి సుమారు 10 అయ్యింది, వెంటనే ప్రెస్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఉందని చెప్పాం
  • ఫ్రెషప్ అయ్యి వెంటనే ప్రధాని వద్దకు వెళ్లాం, ఆయనకు ఇచ్చిన అర్జీ సహా అన్నీ మీడియాకు చూపించాం.. అన్నీ పారదర్శకంగా చేశాం
  • చంద్రబాబు 2-3 గంటలకు వచ్చి, 11 గంటల వరకు ఎవరికీ కనపడలేదు
  • ఆయన ఈ మధ్య సమయంలో ఎక్కడకు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?
  • ఎవరు చీకట్లో చిదంబరాన్ని కలిశారు, ఎవరు కాంగ్రెస్‌తో కలిసి నా మీద కేసులు పెట్టారు, ఎవరు విప్ జారీచేసి మరీ కిరణ్ సర్కారును కాపాడారు?
  • బీజేపీ ప్రభుత్వంలో తనవాళ్లను మంత్రులుగా పెడతాడు, ఇక్కడ ఆయన రహస్యంగా తిరుగుతాడు, ఎవరిని కలిశాడో కూడా చెప్పడు



కడుపు మండినవాళ్లే మెయిల్ పెట్టి ఉంటారు

  • అమెరికా గవర్నర్, అమెరికా అధ్యక్షుడు మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించినవాళ్లా?
  • వాళ్లకు రాస్తే మాకు పార్టీపరంగా ఏమొస్తుంది? ఆ మెయిల్స్ మేం పెట్టలేదు.. కడుపు మండినవాడు ఎవడో పెట్టి ఉంటాడు
  • గోదావరి పుష్కరాల్లో షూటింగ్ కోసం 27 మందిని చంపేశాడు.. ఆ కేసులో జైలుకు వెళ్లాల్సిన చంద్రబాబు బయట తిరుగుతూనే ఉన్నాడు. ఆ గోదావరి జిల్లాల వాళ్లకు ఎవరికో కడుపు మండే ఉంటుంది
  • తమిళనాడుకు చెందిన 29 మంది కార్మికులను స్మగ్లర్లు అన్న పేరుతో పిట్టల్ని కాల్చినట్లు టపటపా కాల్చేశారు.. దాంతో తమిళనాడులో పెద్ద ఎత్తున గొడవ జరిగింది. వాళ్ల కుటుంబాలలో ఎవరికో కడుపు మండే ఉంటుంది
  • ఓటుకు కోట్ల కేసులో నల్లధనం ఇస్తూ ఆడియో, వీడియోటేపుల్లో దొరికిపోయినా ఆయనను అరెస్టు చేయలేదంటే, రాజీనామా చేయలేదంటే ఎవరికైనా కడుపు మండదా?
  • బయటకొచ్చి నీ అంత సత్య హరిశ్చంద్రుడు ఎవరూ లేరన్నట్లు కబుర్లు చెబుతారు
  • ఇవన్నీ చూసి ఎవరికో కడుపు మండి ఈ మెయిల్ పెడతారు.. దానిమీద వాళ్లకు ఖాళీ ఉంటే చదివి తీసుకోవాలనుకుంటే చర్య తీసుకుంటారు
  • దాన్ని ఈయనేదో కుట్ర అని బాధపడిపోతారు.. తప్పు చేసినందుకు కాకుండా, వాటిని ఎత్తి చూపించినందుకు ఎక్కువ బాధపడతారు
  • కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందుకే నామీద కేసులు పెట్టారని ఆయనే ఒప్పుకున్నారు. కానీ ఆయన సగమే చెప్పారు. తాను కూడా ఆ కేసులో ఉన్నానని కూడా చెప్పి ఉండాల్సింది


ప్రధాని హోదా ఇస్తారన్న ఆశ ఉంది..

  • హోదా అనే విషయం మీద ప్రధానమంత్రికి కనీసం 10 నిమిషాల సేపు చెప్పాను. ఆయన చాలా సానుకూలంగా విన్నారు. నిజంగా ఇంత సానుకూలంగా ఆయన విన్న తర్వాత..
  • మోదీ పేరు చిరస్థాయిగా నిలబడిపోవాలి. ఆయన గురించి భవిష్యత్తులో గొప్పగా మాట్లాడాలంటే, ప్రత్యేక హోదా విషయంలో ఆలోచించాలి.. పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చారు, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో్ను, బెంగళూరుతో కూడిన కర్ణాటకతోను, చెన్నైతో కూడిన తమిళనాడుతోను పోటీ పడలేమని చెప్పాం
  • ఆదాయ పన్ను కట్టాల్సిన పని లేదంటే, ఎక్సైజ్ డ్యూటీ అక్కర్లేదంటే ఎవరైనా వస్తారు, మీరు కూడా తిరుపతిలో మాటిచ్చారు, మాట తప్పొద్దని రిక్వెస్ట్ చేశాం
  • మాకు ఆశ ఉంది.. చేయగల కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది ప్రధానికే
  • పోరాటం చేసేటపుడు మూడు రకాల వ్యూహాలు ఉండాలి.. అవి దౌత్యం, లౌక్యం, పోరాటం
  • అన్నిరకాలుగా చేస్తేనే మన ప్రత్యేక హోదా పోగొట్టుకోకుండా ఉంటాం
  • నిజంగా ఆయన మనసు కరిగి అది జరిగితే రాష్ట్రానికి మంచి జరుగుతుంది.. కాస్త సమయం ఇద్దాం, మంచి జరుగుతుందని ఆశిద్దాం
  • రాజీనామాలు చేయించడం చిన్న విషయం. ఒకసారి చేసిన తర్వాత ఇక ప్రత్యేక హోదా గురించి అడగగలిగింది ఎవరు?
  • కనీసం పార్లమెంటులో ఉన్నారు కాబట్టి అడుగుతారు, రాజ్యసభలో కూడా విజయసాయిరెడ్డి పట్టుబట్టారు
  • ఆ వ్యక్తి అక్కడ ఉంటేనే బిల్లు వస్తుంది, చర్చ జరుగుతుంది
  • మోదీ గారికి చెప్పాం కాబట్టి ఆయన కాస్తో కూస్తో మంచి చేస్తారని ఆశిద్దాం
  • పార్లమెంటులో ప్రైవేటు మెంబర్ బిల్లు మీద చర్చ కూడా ఆయన దృష్టికి వెళ్లచ్చు
  • ఈరోజు కాకపోతే ఆరు నెలల తర్వాత రాజీనామాలు చేయిస్తాం.. ఒత్తిడి చేయకుండా ఊరికే ఏ ఆలోచనా, దౌత్యం, లౌక్యం లేకుండా రాజీనామా చేస్తే మనకే నష్టం
  • ప్రత్యేక హోదా గురించి ఆరాటపడేది, సిన్సియర్‌గా పోరాటం చేసేది ఒక్క జగనే అని గర్వంగా చెప్పగలను
  • ఎన్నికల్లో కూడా దీన్ని ఇష్యూ చేస్తాం.. అది ఇచ్చేవారికి మా మద్దతు ఉంటుందని ఇప్పుడే చెబుతున్నాం

ఫిబ్రవరి 17న ప్రధానికి వైఎస్ జగన్ రాసిన లేఖ అసలు ప్రతి ఇదీ..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement