బాబు బావకి కూడా మాఫీ కాలేదు | even chandra babu's brother in law did not get loan waiver, says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

బాబు బావకి కూడా మాఫీ కాలేదు

Published Wed, Mar 9 2016 10:34 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

బాబు బావకి కూడా మాఫీ కాలేదు - Sakshi

బాబు బావకి కూడా మాఫీ కాలేదు

  • రూ. 87,612 కోట్ల రుణాలుంటే, రెండేళ్లలో 7,400 కోట్లు ఇస్తారా
  • రుణమాఫీపై మంత్రి సమాధానానికి నిరసన
  • వైఎస్ జగన్ సహా వైఎస్ఆర్‌సీపీ సభ్యుల వాకౌట్

  • హైదరాబాద్
    సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావకే రుణమాఫీ కాలేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా వైఎస్ఆర్‌సీపీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి రుణమాఫీపై అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంపై ఆయన మండిపడ్డారు. ''మంత్రిగారు చెప్పే మాటలు వింటే.. ఇన్ని అబద్ధాలు చెప్పే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎన్నికల సమయంలో పంట రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామన్నారు. ఆ రోజు ఏ టీవీ చూసినా, ఏ గోడలు చూసినా, ఫ్లెక్సీలు చూసినా ఇవే హామీలు. కనపడవేమోనని ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టారు. చంద్రబాబు ఏ పబ్లిక్ మీటింగులో మాట్లాడినా ఇవే మాటలు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేనాటికి రాష్ట్రంలో 87,612 కోట్ల రూపాయల రైతు రుణాలున్నాయి. అప్పుడు ఎన్నికల్లో ఇవన్నీ మాఫీ చేస్తామన్న మాట చెప్పి నమ్మించారు. అవి కట్టొద్దంటే రైతులు రుణాలు కట్టడం ఆపేశారు. వారికి అప్పటివరకు లక్షలోపు రుణాలకు వడ్డీలేకుండా వచ్చేది. లక్ష నుంచి మూడు లక్షల వరకు ఉన్న రుణాలకు పావలా వడ్డీయే కట్టాల్సి వచ్చేది. కానీ వాళ్లు అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో అపరాధ వడ్డీ కింద 14-18 శాతం వసూలు చేస్తున్నారు. వడ్డీలు మాత్రమే 24వేల కోట్లు కట్టారు. రెండేళ్లు కలిపి రూ. 7400 కోట్లు ఇచ్చామని మంత్రి చెబుతున్నారు. అంటే వడ్డీలలో మూడో వంతు కూడా సరిపోదు. ఏ స్థాయిలో ఉందంటే, బాబుగారి బావకు కూడా రుణ మాఫీ కాలేదు'' అని ఆయన చెప్పారు.

    రుణమాఫీ అంశంపై ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇచ్చిన సమాధానానికి వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని విపక్ష సభ్యులు వాకౌట్ చేస్తామని ప్రకటించారు. అయితే ఆ సమయంలో ప్రశ్నకు సంబంధించిన వివరాలను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతుండగా.. దానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అభ్యంతరం తెలిపారు. వాకౌట్ చేస్తున్నట్లు మాత్రమే ప్రకటించాలని, దాని మీద సుదీర్ఘంగా మాట్లాడేందుకు వీల్లేదని చెప్పారు. కనీసం ప్రశ్న అయినా అర్థం కావాలి కదా అని వైఎస్ జగన్ కోరినా, దానికి స్పీకర్ ఆమోదం తెలపలేదు. దాంతో చివరకు.. ''ఎన్నికలకు ముందు అబద్ధాలు చెప్పి, ఆ తర్వాత మోసం చేసి, వాళ్ల ఆత్మహత్యలకు కారణమైనందుకు నిరసన తెలుపుతూ ఈ ప్రశ్నకు మేం వాకౌట్ చేస్తున్నాం'' అని ప్రకటించి, ప్రతిపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement