'ఈ బడ్జెట్ లోనైనా న్యాయం చేస్తారా?'
'ఈ బడ్జెట్ లోనైనా న్యాయం చేస్తారా?'
Published Wed, Mar 9 2016 10:52 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
హైదరాబాద్: ఏపీలో రుణమాఫీ కోసం రూ.4300 కోట్లు గత బడ్జెట్ లో కేటాయిస్తే ఇప్పడు ఏ ఒక్కరికి రుణమాఫీ కాని పరిస్థితి కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా ఆయన రుణమాఫీపై మాట్లాడారు. ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం ఈ రోజు వరకు రూ. 5 వేల కోట్ల పైగా రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. కేంద్రం నుంచి నిధులు రావడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందని కానీ అమిత్ షా మాత్రం లక్షా 50 వేల కోట్లు ఏపీకి నిధులు ఇచ్చామంటున్నారని ఆయన తెలిపారు.
బంగారు రుణాలు ఇంతవరకూ చెల్లించలేదని రుణం తీసుకున్నవారికి బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయని గుర్తు చేశారు. నోటీసులు జారీ చేయడంపై ప్రభుత్వం బ్యాంకర్లను నిందిస్తూ తప్పించుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతు నష్టపోతున్నాడని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా రైతన్నకు న్యాయం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. రుణమాఫీ కాకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
మరో ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి మాట్లాడుతూ 'ఇంటి ముందు బ్యాంకర్లు వచ్చి కూర్చున్నారని అర్థరాత్రి ఓ రైతు ఫోన్ చేశాడు. పండుగ పూట కూడా ఇంట్లో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందాడు. ఇప్పడికైనా దయ ఉంచి రైతు రుణాలను మాఫీ చేయండి. రుణమాఫీ చేసి రైతుల పల్లెల్లో రైతులు ఉండేలా చూడండి' అని అన్నారు.
Advertisement
Advertisement