ఎత్తికోతల పథకాలు
‘ఒక్క ఎకరానూ ఎండనివ్వం. సాగునీరు సమృద్ధిగా అందిస్తాం’ అంటూ కోతలు కోస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యం చేస్తోంది. ఫలితంగా ఏ ఎత్తిపోతల నుంచీ నిర్దేశించిన ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించలేని దుస్థితి నెలకొంది. దీంతో అన్నదాతలకు గుండెకోత తప్పడం లేదు. పొరుగు జిల్లాకు నీరు తరలించడం కోసం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి రూ.1300 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వం జిల్లాలోని పథకాలపై సీతకన్ను వేయడంపై నిరసన వ్యక్తమవుతోంది.
కొవ్వూరు : కాలం చెల్లిన విద్యుత్ మోటార్లు, పంపు సెట్లు, పూడిపోయిన కాలువలతో జిల్లాలోని ఎత్తిపోతల పథకాలు అస్తవ్యస్తంగా మారాయి. సామర్థ్యం మేరకు పనిచేయడం లేదు. సగం ఆయకట్టుకీ సాగునీరు అందించలేని దుస్థితిలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా గోదావరి నదితోపాటు వాగులు, కాలువలపై 28 ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటి ద్వారా 54,247 ఎకరాలకు సాగు నీరందించాల్సి ఉంది. అయితే ఈ పథకాలు మరమ్మతులకు గురయ్యాయి. సామర్థ్యం మేరకు
పనిచేయడం లేదు. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. నాలుగు దశాల క్రితం నిర్మించిన పథకాలకూ మరమ్మతులు చేయించడం లేదు.
నిధులు విడుదల చేసినా.. జాప్యం
రైతులు పోరుతుండడంతో ఎట్టకేలకు నాలుగు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఎనిమిది పథకాల మరమ్మతులకు రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయలేదు. తాళ్లపూడి మండలంలోని 5,800 ఎకరాలకు నీరందించే వేగేశ్వరపురం ఎత్తిపోతల ప«థకానికి గరిష్టంగా రూ.8.32 కోట్లు కేటాయించింది. ఈ పథకం పనులకు టెండర్ల ప్రక్రియ ఇంకా ఓ కొలిక్కి రాలేదు.750 ఎకరాలకు నీరందించే పోలవరం ప«థకానికి, అప్పారావు చానల్‌పై ఉన్న బ్రాహ్మణగూడెం పథకానికి రూ.25 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ఈ నిధులకుS సంబంధించి ఇంకా పరిపాలనా ఆమోదం రాలేదని అధికారులు చెబుతున్నారు. పెదతాడేపల్లి, ఆరుళ్ల పథకాలకు రూ.20 లక్షలతోనూ, నిడదవోలు పథకానికి రూ.25 లక్షలతోనూ మరమ్మతులు చేసేందుకు మాత్రం టెండర్లు పూర్తయినట్టు అధికారులు చెబుతున్నారు. బుట్టాయిగూడెం మండలంలో గాడిద బోరు–1,2 పథకాల మరమ్మతు పనులకు రూ.38 లక్షలు మంజూర య్యాయి. ఈ పనుల టెండర్ల ప్రక్రియ కూడా ఇంకా పూర్తి కాలేదు. టెండర్ల ప్రక్రియ అంతా హైదరాబాద్‌లో ఏపీఎస్ఐడీసీ సంస్థ చేపట్టడం వల్ల జాప్యం జరుగుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని పథకాల మూత
జిల్లాలో పోలవరం, తాళ్ళపూడి, కొవ్వూరు మండలాల్లో గోదావరి నది పొడవునా పది ఎత్తిపోతల పథకాలున్నాయి. వీటిల్లో పోలవరం ముంపు ప్రాంతంలో 1,050 ఎకరాలకు నీరందించే వాడపల్లి, చీడూరు, శివగిరి పథకాలు పూర్తిగా మూతపడ్డాయి. మరో వెయ్యి ఎకరాలకు నీరందించే తూటిగుంట, సింగన్నపల్లి అవసాన దశలో ఉన్నాయి. మిగిలిన ఐదు ప«థకాలు గూటాల, పైడిమెట్ట, వేగేశ్వరపురం, కుమారదేవం, కడెమ్మ ఎత్తిపోతల పథకాల ద్వారా 16,190 ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉండగా.. కేవలం 7వేల ఎకరాలకు నీరందుతోంది. అదే రబీ సాగులో అయితే 6,580 ఎకరాలకు మాత్రమే నీరు అందిస్తున్నారు. వీటిలో కుమారదేవం ఎత్తిపోతల పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.1.75 కోట్లతో ఆధునికీకరించారు. వేగేశ్వరపురం పథకం మోటార్లు, పంపులు పూర్తిగా దెబ్బతిన్నాయి. కాలువలు చాలా చోట్ల పూడుకుపోయాయి. నిధులు మంజూరైనా పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. పైడిమెట్ట ఎత్తిపోతల పథకం సబ్ పైపులైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే తప్ప పూర్తిస్థాయి ఆయకుట్టుకు నీరందని దుస్థితి.
ఆరికిరేవులను
విస్మరించిన ప్రభుత్వం
రూ.15.19 కోట్లతో 2006 మార్చి 20న ప్రారంభమైన ఈ పథకం నిర్మాణ పనులు ఈ ఏడాదిలో పూర్తికావాల్సి ఉంది. ఇప్పటికి తొంభై శాతం పనులు పూర్తయినా అసంపూర్తిగా ఉంది. దీనిని పూర్తి చేస్తే మూడు మండలాల పరిధిలో ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఈ పథకాన్ని మంజూరు చేశారు. ఆయన మృతి చెందే సమయానికి తొంభై శాతం పనులు పూర్తయ్యాయి. రైతుల అభ్యంతరాలతో పనులు పెండింగ్‌లో పడ్డాయి. అనంతరం వచ్చిన పాలకులు చొరవ చూపకపోవడంతో ఎనిమిదేళ్లుగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే రూ.12.5కోట్లు వెచ్చించినా పథకం నిరుపయోగంగా పడి ఉంది. ప్రధాన పైపులైన్ పనులు మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఈ పనులు పూర్తి చేసేందుకు గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ కోసం నిధులు మంజూరు చేసినా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
వేగేశ్వరపురం పనులు త్వరగా పూర్తిచేయాలి
వేగశ్వరపురం పథకం కింద సాగుచేస్తున్న రైతులు నీళ్లు అందక అవస్థలు పడుతున్నారు. ఈ పథకం మరమ్మతులకు నిధులు మంజూరు చేసినా టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు. దీనిని పూర్తిచేసి పనులు వెంటనే మొదలు పెట్టాలి. ఖరీఫ్ సీజన్ ముగిసిన Ðð ంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి.
–కైగాల రాంబాబు, వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షుడు
టెండర్ల ప్రక్రియ పూర్తికాలేదు
జిల్లాలో ఎనిమిది ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు నిధులు మంజూరయ్యాయి. మూడు పథకాలకు ఇటీవలే టెండర్లు పూర్తయ్యాయి. వేగేశ్వరపురం ప«థకం టెండర్ల ప్రక్రియ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మిగిలిన పథకాలూ టెండర్ల దశలో ఉన్నాయి. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించే అవకాశం ఉంది. –ఈ.పూర్ణచంద్రరావు, ఈఈ, ఏపీఎస్ఐడీసీ