funds wasted
-
ప్రజాధనం రోడ్డు పాలు
ఒంగోలు సిటీ:ఒంగోలు నగర శివారు అభివృద్ధిలో వేగం పుంజుకుంది. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న మార్గాల వెంట రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం వయా పోలీసు శిక్షణా కళాశాల మార్గంలో విపరీతమైన ట్రాఫిక్ పెరగిపోయింది. ఇక్కడి మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధి చేయడానికి అంచనాలను తయారు చేశారు. ఎన్నికలకు ముందుగా నగరపాలక సంస్థలో నిధులు ఉండడంతో ఈ మార్గంలోని మట్టిరోడ్డును తారురోడ్డుగా అభివృద్ధికి చేయడానికి నిర్ణయించారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా శిక్షణ కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులతో పాటు బాణాసంచా గోదాములు, మామిడిపాలెంకు వెళ్లే వారితో రద్దీగా మారింది. రోడ్డు వేయడం అనివార్యమైంది ఎన్నికలు కొద్ది వారాల్లోనే వస్తాయనంగా ఈ రోడ్డు పనికి హడావుడిగా టెండర్లను వేసి పనులు మొదలు పెట్టారు. అనతి కాలంలోనే రోడ్డు పని పూర్తయిందనిపించారు. రోడ్డు వేసిన కొద్ది రోజుల వరకు నిగనిగలాడింది. ఆ తర్వాత ఎండలు మొదలయ్యాయి. ఎండ వేడికి నెర్రెలు బారింది. రోడ్డుమార్గంలో అంతా పగుళ్లు వచ్చేశాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు వాహనాలు, ద్విచక్రవాహనాలు వెళ్లినా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ద్విచక్ర వాహనం నెర్రెబారిన రోడ్డులో వెళ్లాలంటే ప్రమాదాలను తప్పించుకొని మరీ వెళ్లాల్సిందే. నిత్యం ప్రమాదాలకు హేతువుగా ఈ రోడ్డు మారింది. రూ. కోటిపైనే నెర్రెపాలు.. జాతీయ రహదారి అభివృద్ధి పనులకు సుమారు రూ.కోటిపైనే నిధులను వెచ్చించారు. వేసిన రోడ్డు వేసినట్టే దెబ్బతింది. ప్రజల డబ్బు మొత్తం వృథా అయింది. సుమారు నాలుగున్నర కిలోమీటర్ల పొడవునా ఈ రోడ్డును నిర్మించారు. మట్టి రోడ్డుపై ముందు వెట్మిక్స్ వేసి రోడ్డును అభివృద్ధి చేశారు. మట్టిరోడ్డుపై ఒక పొర వెట్మిక్స్ వేసి ఆ తర్వాత రెండు పొరలు తారు రోడ్డు వేశారు. ఈ ప్రాంతం చౌడునేల. మెతక స్వభావంతో ఉంటుంది. ఇక్కడ రోడ్డు వేయడానికి సాంకేతికంగా కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని పటిష్ట పరిచి ఆ తర్వాత రోడ్డు అభివృద్ధి పనులు చేయాలి. రోడ్డు ప్రతిపాదించిన సమయానికి సమయం అంతగా లేదు. అందుబాటులో నిధులు ఉన్నాయి. ఇంకేం వెంటనే తారు పరిచి రోడ్డు వేస్తే పోలా అనుకున్నారేమో చకచకా పనులు కానిచ్చేశారు. కొద్ది రోజులకే బయటపడిన డొల్లతనం.. రోడ్డు వేసిన కొద్ది రోజులకే ఎండ వేడికి తారు మెతకబడి తారు బయటకు వచ్చింది. తారు ఉష్ణోగ్రతల దెబ్బకి బురబురలాడి పనిలోని డొల్లతనాన్ని బయటవేసింది. ఎక్కడిక్కడే రోడ్డు బద్దలుగా విరిగింది. రోడ్డు మార్గంలో పలు చోట్ల నెర్రెబారింది. ఈ ప్రాంతంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. మట్టి రోడ్డు ఉన్నప్పుడు దర్జాగా వాహనాలు వచ్చేవి. ఇప్పుడు వాహనాలు రావాలంటే ఎక్కడ బండి పడిపోతుందోనని భయపడుతున్నారు. రోడ్డు పనిలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఎక్కడ నాణ్యతలను పాటించలేదు. కాంట్రాక్టర్కు లాభం చేకూర్చడానికి, అధికారులు తమ పర్సంటేజీలను దండుకొనేందుకే తూతూ మంత్రంగానే రోడ్డు పనిని కానిచ్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజులకు కనుమరుగు.. రానున్న కొద్దిరోజులకే రోడ్డు కనుమరుగయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. ఎండ వేడికే నెర్రెబారిన రోడ్డు కాస్త చినుకులు పడ్డాయంటే ఇక రోడ్డు తారు లేచి పోవడం ఖాయమంటున్నారు. తేలికపాటి వర్షం కురిసినా రోడ్డుపై తారు లేచిపోతుందని అంటున్నారు. వర్షాకాలం మొదలయ్యేలోగానే రూ. కోటి రోడ్డు కన్పించకుండా పోతుందన్న వ్యాఖ్యానాలు స్థానికుల నుంచి నెలకున్నాయి. జాతీయ రహదారి నుంచి మామిడిపాలెం మార్గంలో వేసిన రోడ్డు పనిలో నాణ్యత విషయంలో అడుగడుగునా లోపాలే ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు కల్పించుకొని విచారిస్తేనే రోడ్డు నాణ్యత విషయంలోని డొల్లతనం బయటపడుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
దోచుకోవడానికే పనులు!
అవసరం లేని కాలువకు పనులు అస్తవ్యస్తంగా తవ్వకాలు లెవెల్స్ లేవంటున్న స్థానికులు రూ.3.20 లక్షలతో నీరు–చెట్టు కింద నిధులు మంజూరు నీరు–చెట్టు.. తెలుగు తమ్ముళ్లు, అధికారులు దోచుకోనే పథకంగా మారింది. అవసరం లేకపోయిన నిధులు మంజూరు చేసి పనులు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అయినా చేసే పనుల్లో ఎక్కడా నాణ్యత.. సవ్యత ఉండటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు చెరువు వరవ కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో కాలువ అస్తవ్యస్తంగా తయారవుతుంది. తత్ఫలితంగా భవిష్యత్లో నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదంతో పాటు కాలువ పరివాహక ప్రాంతం మునకకు గురయ్యే అవకాశం ఉంది. పొదలకూరు : ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం, తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నీరు–చెట్టు పథకం కింద పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాస్తవంగా అవసరం లేని కాలువ తవ్వకం పనులను చేపట్టి అధికార పార్టీ నాయకులకు అప్పనంగా దోచుకుంటున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో డొంకదారి వద్దనున్న పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకం పనులు, పట్టణం నడిబొడ్డున వెళుతున్న మరో వరవ కాలువ పూడిక తొలగింపు పనులకు ఇరిగేషన్ అధికారులు నీరు–చెట్టు పథకం కింద రూ.3.20 లక్షలను మంజూరు చేశారు. ఈ పనులను నామినేషన్ కింద కాంట్రాక్టర్కు అప్పగించారు. ముందుగా డొంక వద్ద నున్న వరవ కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఈ కాలువ వెడల్పు, లోతు అస్తవ్యస్తంగా ఉంది. కాలువపై ఆక్రమణలు చోటు చేసుకోవడం వల్ల లెవెల్స్ తీయకుండానే పనులు చేపడుతున్నందున నీరు చెరువులోకి సక్రమంగా చేరే అవకాశం లేదంటున్నారు. ఇందువల్ల వర్షాకాలంలో ఆ ప్రాంత నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ప్రారంభంలో 3.30 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల పొడవు తీశారు. అక్కడి నుంచి మరో 50 మీటర్ల పొడవున 1.50 మీటర్ల వెడల్పున కాలువను తీశారు. ఆక్రమణలు చోటు చేసుకున్న ప్రాంతంలో కూలీలను ఏర్పాటు చేసి నామ మాత్రంగా కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఫలితంగా వర్షపు నీరు లెవల్స్ లేని కాలువ ద్వారా సక్రమంగా చెరువులోకి వెళ్లకుండా కాలువలోనే నిల్వ చేరే అవకాశం ఉంది. వర్షాకాలంలో కాలువ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు ఉప్పొంగే అవకాశం ఉంది. ఫ్లడ్ క్యాచ్మెంట్ కింద కాలువ లోతు అడుగు లేదా 1.5 అడుగు లోతు సరిపోతుందని ఆ ప్రాంత నివాసితులు చెబుతున్నారు. ఎవరికీ ఉపయోగం లేని కాలువ పనులను ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ తమకు ఆక్రమణలతో సంబంధం లేదని ఇరిగేషన్ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం పనులను పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నాడు. పట్టణంలోని మరో వరవ కాలువ పూడిక పనులు సైతం ఇదే తరహాలో పూడిక పనులు చేపడుతున్నారు. కాలువ పనుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఇరిగేషన్ ఏఈ కరిముల్లా అందుబాటులోకి రాలేదు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం : రాధాకృష్ణారెడ్డి, విశ్రాంత అటవీశాఖ అధికారి, పొదలకూరు తమ ఇళ్ల ముందు ఉపయోగం లేని కాలువ పనులు చేపట్టారని కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. కాలువకు లెవెల్స్ తీయకుండా పనులు చేపట్టడం వల్ల వర్షాకాలంలో ఈ ప్రాంత నివాసితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 మీటర్ల కాలువ వెడల్పుగా, మరో 50 మీటర్లు కాలువ సన్నగా పూడిక పనులు చేపట్టడం వల్ల వర్షపు నీరు సక్రమంగా చెరువుకు చేరే అవకావం ఉండదు. ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించనే లేదు.