దోచుకోవడానికే పనులు!
-
అవసరం లేని కాలువకు పనులు
-
అస్తవ్యస్తంగా తవ్వకాలు
-
లెవెల్స్ లేవంటున్న స్థానికులు
-
రూ.3.20 లక్షలతో నీరు–చెట్టు కింద నిధులు మంజూరు
నీరు–చెట్టు.. తెలుగు తమ్ముళ్లు, అధికారులు దోచుకోనే పథకంగా మారింది. అవసరం లేకపోయిన నిధులు మంజూరు చేసి పనులు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. అయినా చేసే పనుల్లో ఎక్కడా నాణ్యత.. సవ్యత ఉండటం లేదు. నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు చెరువు వరవ కాలువ పనులను ఇష్టారాజ్యంగా చేస్తుండటంతో కాలువ అస్తవ్యస్తంగా తయారవుతుంది. తత్ఫలితంగా భవిష్యత్‌లో నీటి ప్రవాహానికి ఇబ్బందికరంగా మారే ప్రమాదంతో పాటు కాలువ పరివాహక ప్రాంతం మునకకు గురయ్యే అవకాశం ఉంది.
పొదలకూరు : ఇరిగేషన్ అధికారులు నిర్లక్ష్యం, తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. నీరు–చెట్టు పథకం కింద పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వాస్తవంగా అవసరం లేని కాలువ తవ్వకం పనులను చేపట్టి అధికార పార్టీ నాయకులకు అప్పనంగా దోచుకుంటున్నారు. రెవెన్యూ కార్యాలయానికి సమీపంలో డొంకదారి వద్దనున్న పొదలకూరు చెరువు వరవ కాలువ తవ్వకం పనులు, పట్టణం నడిబొడ్డున వెళుతున్న మరో వరవ కాలువ పూడిక తొలగింపు పనులకు ఇరిగేషన్ అధికారులు నీరు–చెట్టు పథకం కింద రూ.3.20 లక్షలను మంజూరు చేశారు. ఈ పనులను నామినేషన్ కింద కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ముందుగా డొంక వద్ద నున్న వరవ కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఈ కాలువ వెడల్పు, లోతు అస్తవ్యస్తంగా ఉంది. కాలువపై ఆక్రమణలు చోటు చేసుకోవడం వల్ల లెవెల్స్ తీయకుండానే పనులు చేపడుతున్నందున నీరు చెరువులోకి సక్రమంగా చేరే అవకాశం లేదంటున్నారు. ఇందువల్ల వర్షాకాలంలో ఆ ప్రాంత నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ప్రారంభంలో 3.30 మీటర్ల వెడల్పు, 100 మీటర్ల పొడవు తీశారు. అక్కడి నుంచి మరో 50 మీటర్ల పొడవున 1.50 మీటర్ల వెడల్పున కాలువను తీశారు. ఆక్రమణలు చోటు చేసుకున్న ప్రాంతంలో కూలీలను ఏర్పాటు చేసి నామ మాత్రంగా కాలువ పూడిక పనులను చేపడుతున్నారు. ఫలితంగా వర్షపు నీరు లెవల్స్ లేని కాలువ ద్వారా సక్రమంగా చెరువులోకి వెళ్లకుండా కాలువలోనే నిల్వ చేరే అవకాశం ఉంది. వర్షాకాలంలో కాలువ పరివాహక ప్రాంతంలోకి వరద నీరు ఉప్పొంగే అవకాశం ఉంది. ఫ్లడ్ క్యాచ్‌మెంట్ కింద కాలువ లోతు అడుగు లేదా 1.5 అడుగు లోతు సరిపోతుందని ఆ ప్రాంత నివాసితులు చెబుతున్నారు. ఎవరికీ ఉపయోగం లేని కాలువ పనులను ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే పనులు చేపడుతున్న కాంట్రాక్టర్ తమకు ఆక్రమణలతో సంబంధం లేదని ఇరిగేషన్ అధికారులు రూపొందించిన అంచనాల ప్రకారం పనులను పూర్తి చేస్తున్నట్లు చెబుతున్నాడు. పట్టణంలోని మరో వరవ కాలువ పూడిక పనులు సైతం ఇదే తరహాలో పూడిక పనులు చేపడుతున్నారు. కాలువ పనుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఇరిగేషన్ ఏఈ కరిముల్లా అందుబాటులోకి రాలేదు.
కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : రాధాకృష్ణారెడ్డి, విశ్రాంత అటవీశాఖ అధికారి, పొదలకూరు
తమ ఇళ్ల ముందు ఉపయోగం లేని కాలువ పనులు చేపట్టారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం. కాలువకు లెవెల్స్ తీయకుండా పనులు చేపట్టడం వల్ల వర్షాకాలంలో ఈ ప్రాంత నివాసితులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 100 మీటర్ల కాలువ వెడల్పుగా, మరో 50 మీటర్లు కాలువ సన్నగా పూడిక పనులు చేపట్టడం వల్ల వర్షపు నీరు సక్రమంగా చెరువుకు చేరే అవకావం ఉండదు. ఇరిగేషన్ అధికారులు వచ్చి పరిశీలించనే లేదు.