యుద్ధ వీరుడికి జాతి ఘన నివాళి
► శ్రద్ధాంజలి ఘటించిన రాష్ట్రపతి, ప్రధాని, రక్షణ మంత్రి
► నేడు అధికారిక లాంఛనాలతో ఢిల్లీలో అంత్యక్రియలు
► విమాన విన్యాసాలతో నివాళి అర్పిస్తాం: నిర్మల
న్యూఢిల్లీ: 1965 భారత్–పాకిస్తాన్ యుద్ధ వీరుడు, మార్షల్ ఆఫ్ ఎయిర్ఫోర్స్ అర్జన్ సింగ్(98)కు ఆదివారం దేశం ఘనంగా నివాళులర్పించింది. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను సోమవారం నిర్వహించనుంది. వాయుసేనలో ఫైవ్ స్టార్ ర్యాంక్ పొందిన ఏకైక వ్యక్తి, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత అర్జన్ సింగ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి శనివారం మరణించడం తెలిసిందే.
అర్జన్ సింగ్ గౌరవార్థం సోమవారం ఢిల్లీలోని వివిధ కార్యాలయాల్లో ఉన్న జాతీయ జెండాలను అవనతం చేయనున్నారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ వీకే సింగ్ తదితరులు అర్జన్ సింగ్ భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
గుజరాత్ పర్యటన నుంచి ఢిల్లీకి తిరిగొచ్చిన వెంటనే మోదీ నేరుగా అర్జన్ సింగ్ నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అర్జన్ భౌతిక కాయానికి సైనికులు తుపాకులతో వందనాన్ని సమర్పిస్తారనీ, అనంతరం ఢిల్లీలోని బ్రార్ స్క్వేర్లో ఉన్న శ్మశానానికి భౌతిక కాయాన్ని తీసుకెళ్తారని నిర్మల చెప్పారు. వాతావరణం అనుకూలిస్తే వాయుసేన యుద్ధ విమానాలతో విన్యాసాలు కూడా చేయించి అర్జన్ సింగ్కు నివాళి ఘటిస్తామన్నారు.
ధైర్యవంతుడైన సైనికుడిని కోల్పోయాం
అర్జన్ సింగ్కు నివాళిగా ప్రధాని మోదీ గుజరాత్లో మాట్లాడుతూ ‘దేశం ఒక ధైర్యవంతుడైన సైనికుడిని కోల్పోయింది. 98 ఏళ్ల వయసులోనూ యూనిఫాం వేసుకునేవారు. సాధారణంగా చక్రాల కుర్చీని ఉపయోగించే అర్జన్ సింగ్ నన్ను చూసినప్పుడు మాత్రం లేచి నిలబడేవారు. నిల్చోవద్దని నేను ఆయనను ఎన్నోసార్లు కోరాను. కానీ క్రమశిక్షణను ఆయన ఎన్నడూ మర్చిపోలేదు. జాతి అర్జన్ సింగ్ను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
రాబోయే తరాలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు’ అని మోదీ అన్నారు. త్రివిధ దళాధిపతులు మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, అడ్మిరల్ సునీల్ లాంబ, జనరల్ బిపిన్ రావత్లతోపాటు మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కూడా అర్జన్ సింగ్కు శ్రద్ధాంజలి ఘటించారు. సినీ నటి మందిరా బేడీ సహా అర్జన్ సింగ్ బంధువులంతా ఇప్పటికే ఆయన ఇంటికి చేరుకోగా, కుమారుడు అరవింద్ సింగ్ అమెరికా నుంచి ఆదివారం రాత్రికి వచ్చే అవకాశం ఉంది.
ఫ్లైట్ క్యాడెట్తో ప్రారంభించి..
1938లో ఫ్లైట్ క్యాడెట్ (విమానాల నిర్వహణపై శిక్షణలో ఉన్న విద్యార్థి)గా భారత వాయుసేనలో చేరిన అర్జన్ సింగ్ కొన్ని సంవత్సరాల్లోనే అనేక పదోన్నతులు పొంది వాయుసేనలోనే మరెవ్వరికీ సాధ్యం కాని మార్షల్ ఆఫ్ ఎయిర్ఫోర్స్ స్థాయికి వెళ్లారు. 1939లో పైలట్ ఆఫీసర్, 1941లో ఫ్లయింగ్ ఆఫీసర్, 1943లో స్క్వాడ్రన్ లీడర్, 1947లో వింగ్ కమాండర్, 1948లో గ్రూప్ కెప్టెన్ అయ్యారు.
1960లో ఎయిర్ వైస్ మార్షల్, 1963లో వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, 1964లో చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, 1966లో ఎయిర్ చీఫ్ మార్షల్గా పదోన్నతులు పొందారు. 1970లో వాయుసేన నుంచి పదవీ విరమణ పొందారు. అనంతరం 2002 గణతంత్ర దినోత్స వం రోజున మార్షల్ ఆఫ్ ద ఎయిర్ఫోర్స్గా గౌరవాన్ని అందుకున్నారు. ప్రభుత్వం ఆయనకు పద్మ విభూషణ్, జనరల్ సర్వీస్ మెడల్, సమర్ సేవా స్టార్, సైన్య సేవా పతకం, రక్షా పతకం, భారత సేవా పతకం సహా పలు పురస్కారాలను ప్రదానం చేసింది.