నష్టాలోనే టెస్లా భవిష్యత్ ఆశలు
అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా మోటార్స్ కంపెనీ వరుసగా 13వ త్రైమాసికం కూడా నష్టాలనే మూటకట్టుకుంది. తన వెహికిల్స్, బ్యాటరీ ఫ్యాక్టరీస్‌పై ఎక్కువగా ఖర్చు చేయడంతో ఊహించిన దానికంటే అధికంగానే నష్టాలను నమోదుచేసినట్టు కంపెనీ వెల్లడించింది. సిలీకాన్ వ్యాలీకి చెందిన ఈ కంపెనీ రెండో త్రైమాసికంలో నికర నష్టాలు 293.2 మిలియన్ డాలర్లుగా నమోదుచేసినట్టు కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ పేర్కొన్నారు. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ నష్టాలు 184.2 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే మొత్తం రెవెన్యూలు టెస్లా పెంచుకుంది. రెవెన్యూలను 33 శాతం పెంచుకుని 1.27 బిలియన్లగా నమోదుచేసింది. సెకండ్ ఆఫ్‌లో స్థూల మార్జిన్లు 2-3 శాతం పెంచుకుంటామని టెస్లా చెప్పింది. కంపెనీ నష్టాలను మూటకట్టుకున్నప్పటికీ, భవిష్యత్తులో టార్గెట్లను కంపెనీ భారీగానే పెట్టేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా తన స్టోర్లు ఓపెన్ చేసే ప్లాన్‌లో ఉన్నట్టు పేర్కొంది. మూడేళ్లలో వాహనాల ఉత్పత్తిని పది రెట్లు పెంచుకుంటామని, సోలార్ ప్యానెల్ ఇన్స్టాలర్ సోలార్ సిటీ కార్పొరేషన్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 2016 సెకండ్ ఆఫ్‌లో 50వేల కొత్త మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను డెలివరీ చేసేందుకు పూనుకుంటున్నట్టు కంపెనీ సీఈవో ఎలెన్ మస్క్ చెప్పారు. త్వరలోనే రాబోతున్న మోడల్ 3 సెడాన్ కోసం ప్రీపేర్ అవుతున్నామని, 2.25 బిలియన్ మూలధన వ్యయాన్ని భరించేందుకు సిద్దంగా ఉన్నట్టు స్పష్టంచేశారు.
ఒకవేళ కంపెనీ నిర్దేశించుకున్న ఉత్పత్తిని, డెలివరీ లక్ష్యాలను చేధిస్తే, నాన్-గ్యాప్ లాభాల్లో తాము గ్రేట్ చాన్స్‌ను కొట్టేసినట్టేనని చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ జాసన్ వీలర్ మార్కెట్ విశ్లేషకుల కాన్ఫరెన్స్‌లో తెలిపారు. 2013లో మొదటిసారి టెస్లా త్రైమాసిక లాభాలను టెస్లా నమోదుచేసింది. వరుసగా రెండో ఏడాది కూడా వెహికిల్ డెలివరీ టార్గెట్ ను కోల్పోయినట్టు గత నెలలలో కంపెనీ వెల్లడించింది. దీంతో ప్రస్తుతం నిర్దేశించుకున్న కంపెనీ వార్షిక టార్గెట్‌ను టెస్లా చేరుకుంటుందా అని విశ్లేషకులు సందేహం వ్యక్తంచేస్తున్నారు. టెస్లా రెండో క్వార్టర్లో కేవలం 14,402 వెహికిల్స్ ను మాత్రమే డెలివరీ చేసింది. నిర్దేశించుకున్న 17వేల టార్గెట్ కంటే కూడా ఇవి తక్కువగానే నమోదయ్యాయి.