జీ–మెయిల్స్ హ్యాక్ చేసి ఇలా దోచేస్తున్నారు
సాక్షి, సిటీబ్యూరో: ఎన్ఆర్ఐల జీ–మెయిల్ ఖాతాలను హ్యాక్ చేసి వారి ఈ మెయిల్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును నైజీరియన్లు కాజేస్తున్నారని సైబరాబాద్ ఈస్ట్ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు. గత వారం రోజు ల్లో సైబరాబాద్‌లో చాలా జీ–మెయిల్ హ్యాకింగ్ కేసులు నమోదయ్యాయని, వీటిలో ఎక్కువ అమెరికాలో ఉంటున్న వారివే ఉన్నాయన్నారు.
ఇలా కొల్లగొడతారు: నైజీరియన్లు తాము హ్యాక్ చేసిన ఎన్ఆర్ఐల జీ–మెయిల్లోని కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారిని ఎంపిక చేసుకుంటారు. వారికి హ్యాక్ చేసిన జీ– మెయిల్ నుంచే.. ‘‘సాంకేతిక కారణాల వల్ల మీ బ్యాంక్ అకౌంట్ సీజ్ కావడంతో ఏటీఎం నుంచి డబ్బు డ్రా చేయలేకపోతున్నాం. మీ నెట్ బ్యాంక్ అకౌంట్ నంబర్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ డబ్బు డ్రా చేసుకుంటాం’’... అని మెయిల్ పంపుతారు. ఆ జీ–మెయిల్ అకౌంట్ తమవారిదేనని నమ్మిన స్నేహితులు, బంధువులు ఆ వివరాలు మెయిల్లో షేర్ చేస్తున్నారు. నైజీరియన్లు ఆ వివరాలతో సదరు బ్యాంక్ అకౌంట్లలోని డబ్బును తమ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు.
చివరకు ఎన్ఆర్ఐ ఫోన్ చేస్తే కానీ ఆ డబ్బు నైజీరియన్లు కొ ట్టేశారని తెలియడం లేదు. అందుకే ఈ సైబర్ నేరగాళ్ల పట్ల నగరవాసు లు జాగ్రత్తగా ఉండాలని,జీ–మెయిల్లో ఎవరికీ బ్యాంక్ ఖాతా వివరా లు ఇవ్వొద్దని సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఒకవేళ మెయిల్లో బ్యాంక్ అకౌంట్ వివరాలు తెలియజేయమని ఎన్ఆర్ఐలు అడిగితే.. వారితో నేరుగా ఫోన్లో మాట్లాడితే మంచిదన్నారు. బ్యాంక్ అ కౌంట్ వివరాలు అడుగుతూ అగంతకులు మెయిల్ చేసినట్టు అనుమా నం వస్తే సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని మహేష్ భగవత్ కోరారు.