మరికొంత చరిత్రలోకి...
చరిత్ర వరకు ఎంత వెనక్కి వెళితే, అంత ముందుకు వెళ్లినట్టు! ఆ అర్థంలో రాయలసీమ కథను మరింత ‘వెనక్కి’ నెడుతున్న పుస్తకం ఇది. ఇందులో, కందాళ శేషాచార్యులు(10 కథలు), విద్వాన్ విశ్వం(9కథలు), టి.అర్ముగం పిళ్ళె(3)తో పాటుగా గాడిచర్ల హరిసర్వోత్తమరావు, చింతా దీక్షితులు, యర్రగుంట నారపరెడ్డి, రావూరు చంగనార్య, పాణ్యం సంజీవశాస్త్రి, జి.రామకృష్ణ, కె.సభా సహా మరికొందరు పేరు తెలియని రచయితల కథలున్నాయి. ఇవన్నీ జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధన, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త పత్రికల్లో అచ్చయినవి!
పుస్తకానికి రాసిన ముందుమాటలో ప్రముఖ కథకుడు సింగమనేని నారాయణ ఇలా అంటున్నారు:
‘‘గురజాడ అప్పారావు ‘దిద్దుబాటు’ కంటే ముందుగానే తెలుగు కథ ప్రాణం పోసుకుందని ఇటీవలి పరిశోధనలు కొన్ని వెల్లడి చేస్తున్నాయి. ‘వివినమూర్తి ’ సంపాదకత్వంలో దిద్దుబాటు కంటే ముందే వచ్చిన 92 కథలు గల ఒక సంకలనాన్ని ‘దిద్దుబాటలు’ పేరుతో తానా ప్రచురించింది...
ఇక రాయలసీమ విషయానికొస్తే, రాయలసీమలో ఆధునిక కథ, చాలా ఆలస్యంగా ప్రారంభమైందనీ, చిత్తూరు జిల్లాకు చెందిన కె.సభా(1944), అనంతపురం జిల్లాకు చెందిన జి.రామకృష్ణ(1941) గార్లు రాయలసీమ కథకు ఆద్యులనీ, ఇంతకాలంగా మనం అనుకుంటూ వస్తున్నాము. అయితే ఈమధ్యకాలంలో లభించిన కొన్ని ఆధారాల వల్ల రాయలసీమ కథ, మరికొంత ముందే ప్రారంభమైనట్టు కొందరు పరిశోధకులు నిరూపిస్తున్నారు... ఇటీవలే తవ్వా వెంకటయ్య గారు ‘రాయలసీమ కథలు-తొలితరం’ పేరుతో 25 కథలతో ఒక సంకలనాన్ని ప్రచురించినారు. 1926-27 మధ్యకాలంలో ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ‘భారత కథానిధి’ అన్న పత్రికలో వచ్చిన కథలవన్నీ.
... అప్పిరెడ్డి మరికొంత ముందుకువెళ్లి 1882 నాటినుండి 1944 వరకు రాయలసీమ నుండి వెలువడిన 42 కథలతో ఈ సంకలనం తెస్తున్నారు. రాయలసీమ కథ పుట్టుక, పరిణామం గురించి, ఆ కథల వస్తురూప, భావజాలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తిగలవారికి ఈ సంకలనం మంచి హేండ్‌బుక్’’.
మొదటితరం రాయలసీమ కథలు(1882-1944); సంపాదకుడు: డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి
పేజీలు: 240; వెల: 200; ప్రతులకు: కోడిహళ్లి మురళీమోహన్, 9111, బ్లాక్ 9ఎ, జనప్రియ మహానగర్, మీర్పేట్, హైదరాబాద్-97; ఫోన్: 9701371256
కొత్త పుస్తకాలు
అనామిక డైరీ (అటా-నవ్య వీక్లీ సంయుక్త నిర్వహణలో ప్రథమ బహుమతి పొందిన నవల)
రచన: సలీం
పేజీలు: 208; వెల: 150
ప్రతులకు: విశాలాంధ్ర అన్ని బ్రాంచీలు
ఓ తల్లి ఆమె తనయ
రచన: డాక్టర్ కె.రామలక్ష్మి
పేజీలు: 398; వెల: 150
ప్రతులకు: డాక్టర్ రామలక్ష్మి నర్సింగ్ హోమ్, సుందరయ్య స్ట్రీట్, చిత్తూరు. ఫోన్: 08572-228885
చిరంజీవి సాహిత్య సమాలోచనం
రచన: శారదా శ్రీనివాసన్, ఎన్.లీలాకుమారి
పేజీలు: 256; వెల: 150
ప్రతులకు: విశాలాంధ్ర పబ్లిషర్స్, అబిడ్స్, హైదరాబాద్; ఫోన్: 040-24744580
మపాసా సలహా - రచనా విధానం
‘‘రచయిత లక్ష్యం కథ చెప్పటమూ, పాఠకులకు వినోదం కల్గించటమూ కాదు. లోకం కప్పుకున్న ముసుగుల్ని తీసి చూడగలగాలి రచయిత. రచన నిస్సందేహంగా వయ్యక్తికానుభవమే. వ్యక్తులు, పరిస్థితులు, సంఘటనలు అన్నీ రచయిత అర్థం చేసుకున్న కోణం నుండి మాత్రమే రాయగలడు. తనలో కలిగిన స్పందననే పాఠకులకూ కలుగజేయటానికి ప్రయత్నిస్తాడు. రచయిత చేసిన ప్రయత్నం పాఠకుడికి కనిపించకూడదు. అప్రయత్నంగా, సులభంగా కబుర్లు చెప్పినట్టుంటే కథ పండిందన్నమాట!
పాత్రలను ఎన్నుకోవటంలోనే రచనా ప్రయోజనం తెలిసిపోతుంది. సంఘటనల్ని మలిచిన క్రమంలోనే అతని లౌకికదృష్టి అవగాహన అవుతుంది. ప్రేమలు, ద్వేషాలు, ఆరాటాలు, పోరాటాలు పరస్పరం సంఘర్షించుకుంటాయి. సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలు అనుక్షణం ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి.
సెంటిమెంటల్, ఎమోషనల్ నాటకీయతతో, స్వీట్ నథింగ్స్తో ప్లాట్ తయారుచేయటం ఆత్మద్రోహమే. వాస్తవాలు తెలియజెప్పని రచనల వల్ల పాఠకులకు ఒరిగేదేమీ ఉండదు.
‘ఏం రాయాలి?’ అనేదానికన్నా ఏది రాయకూడదో తెలుసుకోవటం ముఖ్యం. నిత్యానుభవంలోనే ఉన్నా, మనం గమనించని విషయాలుంటాయి కొన్ని. వాటిని రచయిత పట్టుకోగలగాలి. కథకు విలక్షణత కలిగించేది ఈ సుగుణమే’’.
అనువాదం: ముక్తవరం పార్థసారథి
కాలాన్ని అధిగమిస్తూ...
ఆత్మపరిశోధన, కాలాన్వేషణ రెండు కళ్లుగా కవిత్వమై తపిస్తున్న కవి నిఖిలేశ్వర్. ‘కాలాన్ని అధిగమించి’లోనూ అదే కనిపిస్తుంది. నిరంతర సంభాషణ బయట ప్రపంచంతో కొనసాగిస్తూ క్రూర, దుష్ట వారసత్వాలను జయించేందుకు వాస్తవాలను వెలికితెచ్చే కవిత్వం రాసి రాశిపోశారు.
‘గ్రహాంతరాలవైపు/ దూసుకెళ్లే రోదసి జ్ఞానం’ ఒకవైపు, ‘ఇదే నేలపై మన సహోదరులంతా/ కాసిన్ని నీళ్ల కోసం/ అంగుళం జాగా కోసం/ పరస్పరం గొంతులు కోసుకునే/ సంస్కృతి’ మరోవైపు, ఇందులో కూరుకుపోయిన క్రూర వాస్తవాలను జయించగలిగే సత్యాన్నిచ్చే శక్తి కోసం ‘ఈ కాలాన్ని అధిగమిస్తూనే ఉండాలి’ అంటాడు కవి. ‘అధికారం అక్రమార్జన/ పీకలు తెగ్గోస్తున్నప్పుడు/ అంతర్ఘోషను నిర్దాక్షిణ్యంగా/ హత్యచేస్తున్న’ సందర్భాల్ని లోతుగా చర్చిస్తాడు. ఇందులో మొత్తం 70 కవితలున్నాయి. వీనిలో 14 కవి ఉత్తర అమెరికాలో ఉన్నప్పుడు రాసినవి. వీటిని ‘పశ్చిమాకాశాన’ పేరుతో ఇందులో చేర్చారు.
కాలాన్ని అధిగమించడమంటే కాలస్పృహతో జీవితంలో అడుగులు వేయడమే. దార్శనిక దృష్టితో ముందుకు సాగడమే. కవి స్వీయ జీవితాన్వేషణ మేళవింపుతో ఈ కవిత్వాన్ని వో తాత్విక దృక్పథంతో పోరాట గరిమతో పూర్తిచేశారు.
కొండ్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి
కాలాన్ని అధిగమించి (కవిత్వం)
రచన: నిఖిలేశ్వర్; వెల: 100
ప్రతులకు: కవి (ఫోన్: 9177881201), ముఖ్య పుస్తక కేంద్రాలు
అనువాద కవిత
పర్వతాల నడుమ...
నువ్వు అడుగుతావు-
ఈ పచ్చని పర్వతాల్లో
ఎందుకు జీవిస్తున్నావని...
నేను జవాబు చెప్పలేను.
నవ్వుతాను.
నేను పూర్తిగా
ప్రశాంతంగా వున్నాను.
పీచ్ వికసించి
ప్రవాహం మీద
వడిగా కొట్టుకుపోతుంది.
ఈ ప్రపంచానికి ఆవల
అనేక ప్రపంచాలున్నాయి.
చీనా మూలం:
లి బొ (701-762)
ఆంగ్లం నుండి అనుసృజన: పి.శ్రీనివాస్ గౌడ్
ఫోన్: 9949429449
ఈవెంట్
‘కథాకచ్చీరు’ ఆధ్వర్యంలో నేడు సా. 5:30కి బిర్లా ప్లానెటోరియం పక్కనున్న గ్రంథాలయంలో జరిగే సమావేశంలో ప్రపంచ ప్రసిద్ధ కథల గురించి ఆడెపు లక్ష్మీపతి ప్రసంగిస్తారు. వివరాలకు:9885420027
‘సివి సమగ్ర రచనలు-సమాలోచన’ వచ్చే ఆదివారం(28 జూన్) ఉ.10-సా.7 వరకు ‘వేదిక’ కళ్యాణమండపం, విజయవాడలో జరగనుంది. సి.ఉమామహేశ్వరరావు కన్వీనర్‌గా వ్యవహరించే ఈ కార్యక్రమంలో తెలకపల్లి రవి, పాటూరు రామయ్య, వకుళాభరణం రామకృష్ణ, కంచ ఐలయ్య, కడియాల రామమోహనరాయ్, కత్తి పద్మారావు, మల్లేపల్లి లక్ష్మయ్య, బి.వి.రాఘవులు, లవణం, ఖాదర్ మొహిద్దీన్, సీహెచ్ శివారెడ్డి, కె.ఎస్.లక్ష్మణరావు, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కొత్తపల్లి రవిబాబు, ఎన్.అంజయ్య పాల్గొంటారు. వివరాలకు: 9951540671
పోస్ట్
దీర్ఘ కవితలు మినహా...
మీ అభిప్రాయాలూ,
రచనలూ పంపవలసిన
మా చిరునామా:
సాహిత్యం, సాక్షి తెలుగు దినపత్రిక,
6-3-249/1, రోడ్ నం.1,
బంజారాహిల్స్, హైదరాబాద్-34;
ఫోన్: 040-23256000
sakshisahityam@gmail.com