‘హైకోర్టు’ వ్యాజ్యాలపై విచారణ వాయిదా
ప్రతివాది అభ్యర్థనను అంగీకరించిన సుప్రీం ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలు, ఘటనలపై దాఖలైన రిట్ పిటిషన్, కోర్టు ధిక్కార వ్యాజ్యంపై విచారణను సుప్రీం కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. ఈ రెండు వ్యాజ్యాలపై సోమవారం తుది విచారణ జరగాల్సివుండగా, ప్రతివాదుల తరఫు న్యాయవాది సమయం కోరడంతో కోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
హైకోర్టు ఆవరణలో జరిగిన ఘటనలు, జేఏసీ న్యాయవాదుల తీరుపై హైదరాబాద్కు చెందిన న్యాయవాది పి.వి.కృష్ణయ్య వేసిన రిట్ పిటిషన్, అలాగే హైకోర్టు కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సహా పలువురు నేతలపై మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ వేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం జస్టిస్ జి.ఎస్.సింఘ్వీ, జస్టిస్ వి.గోపాలగౌడతో కూడిన ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా కృష్ణయ్య పిటిషన్లోని ప్రతివాదుల తరఫు న్యాయవాది తమ వాదనలకు ఆరు వారాల సమయం కావాలని కోర్టును అభ్యర్థించారు. అంత సమయం ఇవ్వలేమంటూ జస్టిస్ సింఘ్వీ కేవలం 4 వారాల గడువును మంజూరు చేశారు. తదుపరి విచారణను వాయిదా వేశారు.