మృగాడికి సంకెళ్లు
14 మందిపై అత్యాచారం
లక్షలాది రూపాయల ఆభరణాలు స్వాధీనం
గదగ్ :గదగ్, హావేరి, ధారవాడ జిల్లాల్లో పలు చోట్ల 14 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వికృత కాముకుడు హావేరి జిల్లా సవణూరు తాలూకా కలివాళ గ్రామానికి చెందిన పకీరప్ప కాడణ్ణను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కు నెట్టినట్లు గదగ్ జిల్లా ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
నిందితుడు మహిళల వంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు మొబైల్ ఫోన్లను చోరీ చేశాడన్నారు. అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి వారి నుంచి లక్షలాది రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలతో పాటు 31 మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.
గదగ్ సమీపంలోని బింకదకట్టి వద్ద గత డిసెంబర్ నెలలో ఓ మహిళను బైక్‌పై తీసుకెళ్లిన పకీరప్ప ఆమెపై అత్యాచారానికి పాల్పడి, ఆమె ఆభరణాలను దోచుకొని పరారయ్యాడు. ఈ ఘటనపై గదగ్ గ్రామీణ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసును సవాల్‌గా స్వీకరించిన రూరల్ పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇతనికి సహకరించిన కలివాళ గ్రామానికి చెందిన బసవరాజ గదిగెన్నవర్, గదగ్ జిల్లా ముండరగి తాలూకా రామేనహళ్లికి చెందిన ఆశా కార్యకర్త మహాదేవి బేవినమరద్లను కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 2 బైక్‌లు, రూ.19 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, రూ.21 వేలు విలువ చేసే వెండి ఆభరణాలు, 31 మొబైల్ ఫోన్లు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీటీ విజయ్‌కుమార్, రూరల్ సీఐ సోమశేఖర్ జుట్టల్, ఎస్ఐ ఎల్కే జూలకట్టి తదితరులు పాల్గొన్నారు.