సాక్షి, గదగ్(బెంగళూరు): ప్రేమించానన్నాడు, ఆమె చుట్టూ తిరిగాడు, తియ్యని మాటలతో లోబరుచుకున్నాడు. గర్భం దాల్చిన ఆమెను పెళ్లి చేసుకోకుండా కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ మృగాడు.
ఈ హృదయవిదారక ఘటన గదగ్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.... గదగ్ జిల్లాలోని శింగటాలూర గ్రామానికి చెందిన ప్రకాష్ ముండవాడ, అదే గ్రామానికి చెందిన బాధిత యువతితో ఐదేళ్లుగా ప్రేమాయణాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే బాధిత యువతి గర్భం దాల్చింది.
ఈ విషయాన్ని ప్రకాష్‌కు చెప్పి తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. దీంతో ప్రకాష్ ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని బాధిత యువతి తన తల్లితో కలిసి శుక్రవారం సాయంత్రం ప్రకాష్ ఇంటి ముందు బైఠాయించింది. ఈక్రమంలో ప్రకాష్, అతని కుటుంబ సభ్యులు బాధిత యువతి ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించి పరారయ్యారు.
స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పి బాధితురాలిని గదగ్ జిల్లాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద‍్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment