పథకాల పంపిణీలో వివక్ష
జన్మభూమి కమిటీలదే హవా
గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల గోడు
‘పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారు. జన్మభూమి కమిటీలదే తుది నిర్ణయంగా మారుతోంది. రెండేళ్లయినా పింఛను ఇవ్వలేదు. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. ఇంటి రుణం ఇస్తామంటే, ఇల్లు కూల్చి, పునాదులు వేసుకున్నాం. రుణం మంజూరు కాక, అసంపూర్తిగా ఉన్నాయి.’ ఇదీ అనేక గ్రామాల్లో ప్రజల ఆవేదన. మంగళవారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ నేతల వద్ద ప్రజలు తమ గోడు వెళ్లగక్కారు.
– సాక్షి ప్రతినిధి, కాకినాడ
రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బాలాంత్రంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదని, దీంతో రోడ్లపైనే మురుగునీరు ఉండిపోతోందని మహిళలు మేడిశెట్ది దుర్గాదేవి, పిల్లి వరలక్ష్మి, పిల్లి వెంకటలక్ష్మి తదితరులు వైఎస్సార్ సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. శివారు గ్రామాలైన గోపాలరావుపేటలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నేతల ఇష్టానుసారం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడితిప్పలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి.. అర్హులైన తమకు పింఛన్లు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడం ఏమిటని రాజమహేం ద్రవరం రూరల్ నియోజకవర్గం హుక్కుంపేటలో బూరా రాజమణి పేర్కొంది. బొమ్మూరులో మురళీకొండపై సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిక్కాల వెంకటేశ్వరరావు చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ 11వ డివిజన్ వీఎల్ పు రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు రూ.200 పింఛను ఇచ్చేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల నుంచి పింఛను ఇవ్వడం లేద ని 70 ఏళ్ల తమ్మరి నూకరాజు వాపోయాడు. తన కుమార్తెకు రేషన్‌కార్డు మంజూరుచేసి ఏడాదైనా, ఇప్పటి వరకూ రేషన్ ఇవ్వడం లేదని కోరుమిల్లి వరలక్ష్మి తల్లి బిక్కవోలు నూకాలమ్మ పేర్కొంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని గొల్లపేటలో తనకు అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని జ్యోతుల చక్రం తెలిపాడు.
మరుగుదొడ్డికి రూ.3 వేలు వసూలు
మండపేట నియోజకవర్గంలోని వెలగతోడులో స్వచ్ఛ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి మంజూ రుకు రూ.మూడు వేలు వసూలు చేశారని గ్రామానికి చెందిన ఎల్.వరలక్ష్మి పేర్కొంది. రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పాలవుతున్నామని మాచర మట్టలుకు చెందిన శీలం రాంబాబు పేర్కొన్నారు. శివారు గ్రామం కావడంతో శ్రీరాంపురానికి అధికారులు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో రాజుగారి బీడు ప్రాంతంలో కనీసం పంచాయతీ కుళాయిలు వేయడం లేదని భీమవరపు మంగ తెలిపింది. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని మురారిశెట్టి నారాయణరావు తెలిపాడు.
పునాదుల్లో నిలిచిన నిర్మాణం
ఎన్నికల్లో ఇల్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇవ్వలేదని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తండి కొండలో గొర్రెల కనకరత్నం తెలిపింది. రుణం మంజూరు చేయకపోవడంతో పునాదులతో ఇల్లు ఆగిపోయిందని పిల్లి అచ్చియమ్మ, మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని పిల్లి సాయమ్మ నిప్పులు చెరిగారు. తనకు రెండేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో నవుండ్రు లక్ష్మణరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గృహరుణం మంజూరు చేశారని, టీడీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని గోడ సత్యవతి విలపించింది.