మన్యం మళ్లీ వణుకు
గడిమామిడి ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడిన గిరిజనం
చనిపోయిన ఇద్దరు మావోలూ సెంట్రీలే
తప్పించుకున్న అగ్రనేతలు!
పుట్టకోట ప్రాంతాన్ని జల్లెడపట్టిన గ్రేహౌండ్స్ కమెండోలు
రెండు నెలలుగా ప్రశాంతంగా ఉన్న మన్యం గడిమామిడి ఎన్‌కౌంటర్‌తో మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్లింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదటి ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇటీవల చింతపల్లి మండలం రాళ్లగెడ్డ కొత్తూరులో పోలీసు అవుట్‌పోస్టు పెట్టేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు ఎక్కువ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. దీనిపై చర్చించేందుకు మావోయిస్టు నేతలు వారికి సురక్షితంగా ఉన్న పుట్టకోట ప్రాంతంలో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించినట్టి తెలిసింది. ఈ సమాచారం అందుకొని గాలింపు చేపట్టిన గ్రేహౌండ్స్ కమెండోల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. దీనికి ప్రతీకారంగా మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించే అవకాశం ఉందని గడిమామిడి చుట్టూ ఉన్న పది గ్రామాల గిరిజనులు భయంతో వణుకుతున్నాయి.
కొయ్యూరు: పుట్టకోట అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగాయన్న సమాచారం పోలీసు అధికారులకు చే రడంతో మూడు రోజుల నుంచి గ్రేహౌం డ్స్ కమెండోలు కూంబింగ్ చేపట్టారు. గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఆజాద్, ఈస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి చలపతి, రవిలతో పాటు మరికొందరు నేతలు గడిమామిడి అటవీ ప్రాంతంలో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించినట్టు తెలిసింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఆదివారం మధ్యాహ్నం కొందరు మావోలు ఎదురు కావడంతో రెండు వైపులా కాల్పులు జరిగాయి. ఈ కాల్పు ల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మృతులిద్దరూ సెంట్రీలుగా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మిగిలిన వారు తప్పించుకున్నారు. కొందరు గాయపడి ఉండే అవకాశం ఉంది. ఆ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది. తప్పించుకున్న వారిని పట్టుకునేందుకు నలువైపుల నుంచి కూంబింగ్ ఉధృతం చేశారు. ఇటు ఎన్కౌంటర్నుంచి తప్పించుకున్న మావోయిస్టులు పోలీసులపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను వెంటనే బయటకు తీసుకురావడం కష్టమని, వాటిని సోమవారం తీసుకు వచ్చే అవకాశం ఉందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు
సురక్షిత ప్రాంతంలో ఎదురుదెబ్బ
మావోయిస్టులకు దట్టమైన అడవితో ఉన్న పుట్టకోట ప్రాంతం ఒకప్పుడు సురక్షితమైనది. ఇప్పుడు సేప్‌జోన్‌ను కోల్పోయింది. గత ఏడాది మావోయిస్టు కేంద్ర మిలటరీ కమిషన్ ఇన్చార్జీ నంబళ్ల కేశవరావు పుట్టకోట ప్రాంతంలో కొందరు మావోయిస్టులకు శిక్షణ ఇచ్చినట్టు పోలీసులకు సమాచారం చేరడంతో అప్రమత్తమయ్యారు. దీంతో తరచూ పోలీసులు ఈ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. 2005లో మావోయిస్టు అగ్రనేత కైలాసం పుట్టకోట అడవిలో ఎన్కౌంటర్లో మరణించారు. అతని మృతదేహాన్ని తీసుకువస్తున్న దారిలో పోలీసులపై రెండుసార్లు మందుపాతర్లు పేల్చారు. గడిమామిడి ఎన్కౌంటర్లో సహచరులను కోల్పోయిన మావోయిస్టులు అధికారపార్టీ నేతలపై దాడులకు పాల్పడే అవకాశం ఉంది. దీంతో పోలీసులు హిట్‌లిస్టులో ఉన్న నేతలను అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్కౌంటర్ సమాచారం తెలిసిన వెంటనే మంప ఎస్ఐ మదుసూధన్ వై.రామవరం వెళ్లారు.