విరగబాటుకు విరుగుడు
విశ్లేషణ
తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తనేమి చేసినా చెల్లు బాటు అవుతుందనుకునే గైక్వాడ్లాంటి ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగిన దానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు.
రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా విమానంలో వేసిన వీరంగం ప్రవర్తన సహజం గానే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎయిర్ ఇండియా ఆయనను ప్రయా ణించడానికి అనుమతించడం లేక నిరాకరణను కొనసాగిం చడం ద్వారా ఎలాగోలా ఈ వివాదం పరిష్కారమయ్యే వరకూ అది కొనసాగు తుంది. ఈ విమాన ప్రయాణ నిరాకరణను కొనసాగిం చేట్టయితే, అది ఎప్పటి వరకు? పార్లమెంటు సమావే శాలకు హాజరు కావడానికి ఒక ఎంపీకి ఉన్న హక్కును నిరాకరించి సభా హక్కులను ఉల్లంఘించారంటూ లోక్ సభ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటుందా, లేదా అనేది దాన్ని నిర్ణయిస్తుంది.
గైక్వాడ్ ప్రతాపానికి గురైన విమానయాన సంస్థ వెంటనే ఆయనను తమ విమానాల్లో ప్రయాణించేది లేదంటూ నిషేధం విధించింది. దేశంలోపల విమాన సర్వీసులను నడిపే ఇతర సంస్థలు సైతం అదే దారి పట్టాయి. ఒక రాజకీయవేత్త, అందునా అత్యున్నత స్థాయిగల పార్లమెంటు సభ్యుని ప్రమేయం ఉన్న వ్యవహారం కాబట్టి ఈ రెండూ అసాధారణమైనవే.
ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వరంగ సంస్థ కావ డం వల్ల, కీలకమైన ఆ అత్యున్నత అధికారి ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం నియమించినవారు. కాబట్టి సాధా రణంగా లేనిపోని ఇబ్బందులు ఎందుకని మిన్నకుం టారు, ఒత్తిడులకు లొంగుతారు. ఈ వ్యవహా రంలో అలా జరగకపోవడం అత్యంత సంతోషదాయక పరి ణామం. ఈ ఉదంతాన్ని కూడా అలాగేSకప్పి పుచ్చి ఉంటే, నిజంగానే గైక్వాడ్ ఉచిత టికెట్‌తో విమాన మెక్కినప్పుడల్లా ఇలా చిందులేస్తుండేవారే.
విమాన ప్రయాణికుల జాబితాలో ఆయన పేరు కనబడకుండా చేయాలని పట్టుబట్టడం ద్వారా ఎయిర్ ఇండియా... కాళ్లు నేలపై నిలవకుండా విర్రవీగే మన రాజకీయ ఉన్నత వర్గాన్ని కిందకు దించే విధికి సంబం« దించి గొప్ప పనే చేసింది. ఈ బాపతు వాళ్లు తిరిగి మళ్లీ ఎప్పుడు ఇష్టానుసారం అభ్యంతరకరంగా ప్రవర్తిం చడం ప్రారంభిస్తారో తెలియదు. కిరణ్ రిజ్జూ అనే మంత్రి తన సహచరులతో కలసి, సర్వీసులో ఉన్న ఒక ఐఎఫ్ఎస్ అధికారి సహా ముగ్గురిని విమానంలోంచి దించేసి మరీ ప్రయాణం చేసి ఎంతో కాలం కాలేదు మరి.
మిగతా విమాన సంస్థలు (అన్నీ ప్రైవేటువే) కూడా ఈ నిషేధం కచ్చితంగా అమలయ్యేలా చేయా లని రిజర్వేషన్ల అభ్యర్థనలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలి స్తుండటం ప్రభుత్వ రంగ విమాన సంస్థకు మరింత ధైర్యాన్నిచ్చి, అది తన సంకల్పంపై పట్టు విడవకుండా నిలిచేలా చేసింది. ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ఒక అంశంపై ఒకరికొకరు పోటీదారులైన విమాన సంస్థ లన్నీ కలసికట్టుగా పనిచేయడం విశేషం. విర్రవీగే రాజ కీయ వర్గం వల్ల ఎంతో కాలంగా బాధలు పడుతున్న ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలుపుకోదగిన గొప్ప ప్రయోజనకర వైఖరి ఇది.
అయితే, ఎయిర్ ఇండియా ఇలా దూకుడును ప్రదర్శించడానికి మరో కోణం కూడా ఉంది. డీజీసీఏ లేదా పౌర విమానయాన శాఖ నుంచి ఎవరైనా వైఖరిని మెత్తబరుచుకోవాలని, ఆ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేయడం ఉత్తమమని మెల్లగా సూచిస్తే... ఆ సంస్థ ప్రజా సంబంధాల యంత్రాంగం ఆ పని చక్క బెట్టేసేదే. శివసేన నేత గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యో గుల సంఘం ఒకదానికి నేతగా ఉండటం వల్ల కూడా అలా చేయక తప్పేది కాదు.
ఈ సమస్యతో వ్యవహరించే విషయంలో పార్టీల మధ్య రాజకీయాలు తెర వెనుక పనిచేస్తున్నాయని అను మానించడానికి తగు అవకాశం ఉంది. శివసేన, భార తీయ జనతా పార్టీతో సంఘర్షణాత్మక వైఖరిని అవ లంబిస్తోంది కాబట్టి అది కూడా ఈ వ్యవహారంలో ఉదా సీనంగా ఉంటూ శివసేన ఎంపీని ఈ ఇరకాటపు రుచిని చూడనిద్దామని నిర్ణయించిందనిపిస్తోంది. ఏ విమాన సంస్థా ఆయనకు బిజినెస్ లేదా ఎకానమీ క్లాసులు దేనిలోనూ సీటును రిజర్వు చేయడానికి నిరాకరిస్తుండ టంతో ఇప్పటికే ఆయన బాగా చమటలు కక్కారు. కనీసం ఇప్పటివరకైతే ఆయన ప్రత్యామ్నాయంగా రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతున్నట్టు లేదు.
ఒక ఎంపీ అతి హేయంగా, హింసాత్మకంగా ప్రవ ర్తించడంపై ప్రతిస్పందించకుండా ఉండి తెలివిగా ప్రవ ర్తించింది. సదరు మంత్రిత్వశాఖ లేదా లోక్‌సభ సైతం ఈ విషయాన్ని పట్టించుకునేట్టుగా కనిపించడం లేదు. ఒకవేళ శివసేన హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవే శపెడితే, అప్పుడు ఆ పార్టీ ఓటింగ్‌లో పాల్గొంటుందా లేదా అనే దాన్ని బట్టే దాని వైఖరి వెల్లడవుతుంది. శివసేన లాంటి పార్టీ ఒక విమాన సంస్థను పట్టుకుని ‘‘గూండా’’, ‘‘కుమ్మక్కు ముఠా’’ అనడాన్ని ప్రజలు మెచ్చడం లేదు.
తెరవెనుక జరుగుతున్నదేమైనా, తనకున్న హోదా వల్ల తతనేమి చేసినా చెల్లుతుందని ఎగిరిపడే ఓ ఉన్నత స్థాయి వ్యక్తికి ఇంతవరకు జరిగినదానికైతే దేశ ప్రజలు సంబరపడుతున్నారు. ఎన్నిక కావడం అంటేనే ప్రజా న్యాయస్థానం తీర్పు చెప్పేసింది కాబట్టి, ఇక ఏ తీర్పుకూ ఏమంత విలువ లేదని అనడం, వినడం అసాధారణమేం కాదు. ఈసారి ఇంతవరకు ఇది భిన్నం గానే సాగుతోంది, విశేష హక్కులతో ఎగిరెగిరిపడేవారికి ఇదో గుణపాఠం కావాలి.
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
మహేష్ విజాపృకర్
ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com