gajuwaka MLA
-
గబ్బర్‌సింగ్ ఎక్కడ?
సాక్షి ప్రతినిధి. విశాఖపట్నం: మీరు ఎండలో మాడిపోతుంటే నేనూ మీతో పాటే మాడిపోతాను కానీ.. రూముల్లో కూర్చోను.మీరు వర్షంలో తడుస్తుంటే నా గొడుగు విసిరేసి నేనూ మీతోనే ఉంటా.. ఎలక్షన్ల కోసమే రాజకీయాలు కాదు.. ప్రజాసమస్యలపై పోరాడటం కోసమే నేను జనసేన పార్టీ పెట్టాను.. రాజకీయాలు మార్చేస్తాను.. ఇవన్నీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ముందు.. సరిగ్గా చెప్పాలంటే పోలింగ్ కు ముందు వీరావేశంతో వల్లించిన డైలాగులు. పవన్ సినిమాటిక్ డైలాగులకు, చేతలకు ఎంత వ్యత్యాసముందో గాజువాకలో వాస్తవ పరిస్థితులను చూస్తేనే అర్ధమవుతుంది. గాజువాకతో ఎటువంటి సంబంధం లేకపోయినా.. కేవలం కులలెక్కలతోనూ, 2009లో పీఆర్పీ నుంచి చింతలపూడి వెంకట్రామయ్య గెలుపును బేరీజు వేసుకుని పవన్ గాజువాకపై వాలిపోయారు. కనీసం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనైనా గాజువాక సమస్యలపై దృష్టి పెట్టి ఇక్కడి ప్రజలతో మమేకమవుతారని అభిమానులు, రాజకీయ పరిశీలకులు ఆశించారు. కానీ ఆయన ఇక్కడి ప్రజల సమస్యలపై ఏమాత్రం అవగాహన తెచ్చుకోలేకపోయారు. వేలాది పుస్తకాలు చదివానని గొప్పగా చెప్పుకునే ఆయన గాజువాకలోని ప్రధాన మౌలిక సమస్యల పరిష్కారం గురించి కూడా చెప్పలేకపోయారు. సినీ డైలాగుల మాదిరిగానే ఉద్యోగాల కల్పనపై, సాధ్యం కాని అగనంపూడి రెవెన్యూ డివిజన్ వంటి హామీలు గుప్పించడం తప్పించి సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక ప్రణాళికను కూడా వెల్లడించలేకపోయారు. స్థానికేతర వివాదం తెరపైకి వచ్చినప్పుడు కూడా తాను ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటాననే ప్రకటన కూడా చేయలేకపోయారు. గాజువాక వై జంక్షన్‌లోని కర్ణవానిపాలెంలో అద్దె ఇల్లు తీసుకున్నానని ఆర్భాటం చేసి ఒక్కరోజు కూడా ఆ ఇంట్లో బస చేయలేకపోయారు. పోనీ కనీసం గాజువాక మొత్తం కలియతిరిగారా.. ప్రచారమైనా పక్కాగా నిర్వహించారా... అంటే అదీ లేదు. నామినేషన్‌కు ముందు ఓసారి.. ఆ తర్వాత ఓసారి.. మొత్తంగా మూడుసార్లు మాత్రమే గా>జువాకలో పర్యటించారు. పోలింగ్‌కు ముందు రోజైనా పవన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని అభిమానులు ఆశించినా.. పవన్ అవేమీ లెక్కచేయలేదు. ఎన్నికలకు ముందు జనసేన అధినేతగా రాష్ట్రమంతటా పర్యటించాల్సి వచ్చిన నేపథ్యంలో గాజువాకకు రావడం కుదరలేదేమోనని అభిమానులే పాపం సరిపెట్టుకున్నారు. ఆత్మీయ సమావేశానికీ రాలేదు... ఇక మేడే రోజు పార్టీ శ్రేణులు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికైనా పవన్ వస్తారని అభిమానులు, పార్టీ నేతలు భావించారు. కానీ ఆ సమావేశానికి కూడా డుమ్మా కొట్టి తన సోదరుడు నాగబాబును పంపించారు. ఆ సమావేశంలోనే నాగబాబు శృతిమించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇలా పోటీ చేసి.. ఆ తర్వాత పత్తా లేకుండా పోయిన అభ్యర్ధి జిల్లాలో మాత్రం పవన్ కల్యాణ్ ఒక్కరే అనడంలో అతిశయోక్తి లేదు. మిగిలిన జనసేన అభ్యర్ధులు కూడా అడపాదడపా కానవొస్తు న్నా... పవన్ మాత్రం ఇంకా సేదతీరుతూనే ఉన్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలో ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటానన్న పవన్ గాజువాకకు వచ్చిన సందర్భంలో ఓసారి పవన్ నెలలో ఎక్కువ రోజులు తాను ఇక్కడే ఉంటానని ప్రకటించారు. కానీ ఎన్నికలైన తర్వాత కనీసం ఒక్కసారి కూడా గాజువాక వైపు కన్నెత్తిచూడకపోవడమే ఇప్పుడు విమర్శలపాలవుతోంది. పోలింగ్‌కు, కౌంటింగ్‌కు తక్కువ రోజుల వ్యవధి ఉంటే ఈ తరహా విమర్శలు వచ్చేవి కావు. కానీ మునుపెన్నడూ లేని విధంగా పోలింగ్‌కు,. కౌంటింగ్‌కు 42రోజుల గ్యాప్ వచ్చింది. దీంతో మధ్యలో పవన్ తప్పకుండా గాజువాక వస్తారని భావించారు. పోలింగ్‌కు ముందు కుదరకపోవడంతో ఆ తర్వాతైనా వచ్చి నియోజకవర్గంలో పర్యటిస్తారని చాలామంది ఆశించారు. పార్టీ శ్రేణులైతే.. నియోజకవర్గ సమీక్ష ఇక్కడే నిర్వహిస్తారని లెక్కలు వేశారు. కానీ పవన్ ఎన్నికల తర్వాత ఎక్కడా గాజువాక ప్రస్తావన కూడా తేలేదు. -
పల్లాకు షాక్, టీడీపీకి 2600 మంది రిజైన్
సాక్షి, గాజువాక: ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాజువాక నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతుందంటూ కొద్దిరోజుల క్రితం వ్యతిరేక గళం విప్పిన ఆ పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ నేతృత్వంలో 50వ వార్డుకు చెందిన సుమారు 2,600 మంది కార్యకర్తలు, నాయకులు నిన్న (బుధవారం) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న తమకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా చేశారంటూ కంటతడి పెట్టుకున్నారు. స్థానికంగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలోను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోను, స్థానిక సమస్యలను పరిష్కరించడంలోను, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతి, అక్రమాలను నిరోధించడంలోను, మహిళా కార్యకర్తలను గౌరవించడంలోను ఆయన ఘోరంగా విఫలమయ్యారని అసమ్మతి నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దొడ్డి రమణ మాట్లాడుతూ.. ‘పార్టీని వీడటం చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్న మాకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడుకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోలేదు’ అని కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీ మహిళ నాయకురాలు మాట్లాడుతూ... ‘నేను రామారావుగారు చనిపోయినప్పుడు ఏడ్చాను. మళ్లీ ఇప్పుడు ఏడుస్తున్నా.. పల్లా ఒంటెద్దు పోకడ వల్లే పార్టీని వీడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గాజువాక నియోజకవర్గంలో సీనియర్లను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వివక్షకు గురి చేస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందినవారిని, సెటిల్మెంట్ బ్యాచ్‌లను మాత్రమే తనతో తిప్పుకొంటున్నారంటూ కొద్దికాలం క్రితం కొంతమంది నాయకులు ఆయనకు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. దొడ్డి రమణ నేతృత్వంలో మొదలైన అసమ్మతి గళం మొత్తం గాజువాక నియోజకవర్గమంతా వ్యాపించింది. దీంతో 58వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు కూడా అసమ్మతివర్గంలో చేరి ఆ వర్గానికి నాయకత్వం కూడా వహించారు. పల్లా శ్రీనివాసరావును ఓడించడం కోసం తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గమంతా తిరిగి అసమ్మతి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటీవల ఆయన నామినేషన్‌కు దొడ్డి రమణ అన్నీ తానై వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి భారీ ర్యాలీతో కోటేశ్వరరావు నామినేషన్ కూడా వేశారు. దీన్ని గమనించిన టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. కోటేశ్వరరావుతో పల్లా శ్రీనివాసరావుకు సయోధ్య కుదిర్చారు. ఈ సయోధ్య కోసం కోట్ల రూపాయల్లో డీల్ కుదిర్చారనే ప్రచారం కూడా ఉంది. కోటేశ్వరరావు తమను మోసం చేశాడని అసమ్మతి నాయకులు కొంతమంది బాహాటంగానే విమర్శలు కొనసాగిస్తున్నారు. అసంతృప్తి ఉన్నప్పటికీ టీడీపీని గెలిపించాలనే ఉద్దేశంతో పల్లా శ్రీనివాసరావుకు సహకరించాలని నిర్ణయించుకున్న 50వ వార్డు నాయకులు, కార్యకర్తలు తమ వార్డులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం పల్లాకు కబురు పంపించారు. వార్డులో సుమారు 4వేల మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి హాజరు కావాల్సిందిగా పల్లాను ఆహ్వానించారు. ‘మీరు వద్దు, మీ కార్యకర్తలు వద్దు.. మీరు వేరే పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వారిని తిరస్కరించడంతో మనస్తాపం చెందారు. ఆ వార్డులో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించకపోవడంతో చివరకు రాజీనామా చేసి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. దీంతో సీనియర్ నాయకులు దొడ్డి రమణ, పాండ్రంగి జయరాజు, దేవుపల్లి సీతారామ్, ప్రభావతి, మంత్రి మంజుల, రమణమ్మ, కరణం సతీష్, గంటిబిల్లి అమ్మోరు, సూద అమ్మోరు, వెల్లుస్వామి, హరిపిల్లి ధనరాజ్, నొల్లి పోలరాజు, కంబాల నూకరాజు, రాజు, కదిరి పెంటారావు, కనకరాజు, వెంకటేష్, కంబాల బాపణయ్య, పెంటారావు తదితర నాయకుల ఆధ్వర్యంలో వార్డు నాయకులు, కార్యకర్తలు బీసీ రోడ్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద రాజీనామాలు చేశారు. అంతకుముందు దొడ్డి రమణ ఇంటి నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇన్ని వేలమంది రాజీనామా చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సర్వేలో వెనుకబడిన పల్లాపై ఈ పరిణామం మరింత ప్రభావం చూపుతుందని విమర్శకులు పేర్కొంటున్నారు. -
గాజువాక ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా.. ఏయ్.. ఉద్యోగాలు ఊడతాయ్ ఫూటుగా తాగి కానిస్టేబుళ్లను బండబూతులు తిడుతూ చిందులు ఒకరిపై చేయిచేసుకున్న వైనం అరెస్టు చేసిన పోలీసులు విజయవాడ సిటీ: ‘ఏయ్..మేమెవరమో తెలుసా? ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా? మీరేమనుకుంటున్నారు మా గురించి. ఉద్యోగాలు ఊడతాయి’ అంటూ బుధవారం అర్ధరాత్రి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరులు వీరంగం చేశారు. పూటుగా తాగి కారును మితిమీరిన వేగంతో నడపడమే కాక ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను బూతులు తిట్టారు. వైద్య పరీక్షల కోసం వారిని ఎలాగోలా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులపై కూడా చిందులు వేశారు. ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌కి తరలించి పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, దాడి, బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విశాఖపట్నానికి చెందిన తారక లింగేశ్వరరావు అలియాస్ తారక్ ఆరు నెలలుగా విజయవాడలోని కరెన్సీనగర్‌లో ఉంటూ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇతని స్నేహితుడైన జె.కృష్ణ మూడు రోజుల కిందట అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వరకు వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. రాత్రి 1.30 సమయంలో హెల్త్ యూనివర్సిటీ వైపు నుంచి బెంజిసర్కిల్ వైపు సర్వీసు(ఫీడర్) రోడ్డులో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఎ.పి. 09సిఎస్ 0610 వోక్స్ వ్యాగన్ కారులో అతివేగంగా అడ్డదిడ్డంగా వెళుతున్నారు. ఇది గమనించిన మాచవరం పోలీసుస్టేషన్ బీటు కానిస్టేబుళ్లు ఆపేందుకు ప్రయత్నించారు. ఆపకుండా వెళుతూ రమేష్ ఆస్పత్రి జంక్షన్లో లారీ అడ్డురాగా కారును ఆపారు. వెంబడించిన పోలీసులు వివరాలు అడుగుతుండగా బండ బూతులు తిడుతూ నెట్టేసి ముదుకు వెళ్లిపోయారు. దీంతో బీటు కానిస్టేబుళ్లు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. అప్రమత్తమైన రాత్రి గస్తీ పోలీసు అధికారులు పిన్నమనేని పాలీక్లినిక్ వద్ద కారును నిలువరించారు. కిందకు దిగిన ఇద్దరు యువకులు అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులపై బూతు పురాణం లంకించుకున్నారు. ఓ కానిస్టేబుల్‌పై చేయికూడా చేసుకున్నట్టు తెలిసింది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే వైద్యులపై కూడా చిందులు వేశారు. చివరకు వీరు అతిగా మద్యం సేవించినట్టు సర్టిఫికెట్ తీసుకొని మాచవరం పోలీసు స్టేషన్‌కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి వీరిని అరెస్టుచేశారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.