సాక్షి, గాజువాక: ఎన్నికలు సమీపిస్తున్న వేళ గాజువాక నియోజకవర్గంలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలింది. పార్టీలో సీనియర్లకు అవమానం జరుగుతుందంటూ కొద్దిరోజుల క్రితం వ్యతిరేక గళం విప్పిన ఆ పార్టీ అర్బన్ జిల్లా కార్యదర్శి దొడ్డి రమణ నేతృత్వంలో 50వ వార్డుకు చెందిన సుమారు 2,600 మంది కార్యకర్తలు, నాయకులు నిన్న (బుధవారం) మూకుమ్మడిగా రాజీనామా చేశారు. పార్టీ కోసం 30 ఏళ్లుగా కష్టపడుతున్న తమకు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కనీస గుర్తింపు, గౌరవం లేకుండా చేశారంటూ కంటతడి పెట్టుకున్నారు.
స్థానికంగా ఉన్న కార్యకర్తలను ఆదుకోవడంలోను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోను, స్థానిక సమస్యలను పరిష్కరించడంలోను, జన్మభూమి కమిటీ సభ్యుల అవినీతి, అక్రమాలను నిరోధించడంలోను, మహిళా కార్యకర్తలను గౌరవించడంలోను ఆయన ఘోరంగా విఫలమయ్యారని అసమ్మతి నాయకులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. దొడ్డి రమణ మాట్లాడుతూ.. ‘పార్టీని వీడటం చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లుగా పార్టీలో ఉన్న మాకు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు. ఈ వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడుకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోలేదు’ అని కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీ మహిళ నాయకురాలు మాట్లాడుతూ... ‘నేను రామారావుగారు చనిపోయినప్పుడు ఏడ్చాను. మళ్లీ ఇప్పుడు ఏడుస్తున్నా.. పల్లా ఒంటెద్దు పోకడ వల్లే పార్టీని వీడుతున్నాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా గాజువాక నియోజకవర్గంలో సీనియర్లను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వివక్షకు గురి చేస్తున్నారని, ఒక సామాజిక వర్గానికి చెందినవారిని, సెటిల్‌మెంట్ బ్యాచ్‌లను మాత్రమే తనతో తిప్పుకొంటున్నారంటూ కొద్దికాలం క్రితం కొంతమంది నాయకులు ఆయనకు ఎదురు తిరిగిన విషయం తెలిసిందే. దొడ్డి రమణ నేతృత్వంలో మొదలైన అసమ్మతి గళం మొత్తం గాజువాక నియోజకవర్గమంతా వ్యాపించింది. దీంతో 58వ వార్డు మాజీ కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు కూడా అసమ్మతివర్గంలో చేరి ఆ వర్గానికి నాయకత్వం కూడా వహించారు. పల్లా శ్రీనివాసరావును ఓడించడం కోసం తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని నియోజకవర్గమంతా తిరిగి అసమ్మతి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇటీవల ఆయన నామినేషన్‌కు దొడ్డి రమణ అన్నీ తానై వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి భారీ ర్యాలీతో కోటేశ్వరరావు నామినేషన్ కూడా వేశారు. దీన్ని గమనించిన టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్.. కోటేశ్వరరావుతో పల్లా శ్రీనివాసరావుకు సయోధ్య కుదిర్చారు.
ఈ సయోధ్య కోసం కోట్ల రూపాయల్లో డీల్ కుదిర్చారనే ప్రచారం కూడా ఉంది. కోటేశ్వరరావు తమను మోసం చేశాడని అసమ్మతి నాయకులు కొంతమంది బాహాటంగానే విమర్శలు కొనసాగిస్తున్నారు. అసంతృప్తి ఉన్నప్పటికీ టీడీపీని గెలిపించాలనే ఉద్దేశంతో పల్లా శ్రీనివాసరావుకు సహకరించాలని నిర్ణయించుకున్న 50వ వార్డు నాయకులు, కార్యకర్తలు తమ వార్డులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం పల్లాకు కబురు పంపించారు. వార్డులో సుమారు 4వేల మందితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి హాజరు కావాల్సిందిగా పల్లాను ఆహ్వానించారు. ‘మీరు వద్దు, మీ కార్యకర్తలు వద్దు.. మీరు వేరే పార్టీతో కుమ్మక్కయ్యారంటూ వారిని తిరస్కరించడంతో మనస్తాపం చెందారు. ఆ వార్డులో చేపడుతున్న కార్యక్రమాలకు కూడా వారిని ఆహ్వానించకపోవడంతో చివరకు రాజీనామా చేసి పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
దీంతో సీనియర్ నాయకులు దొడ్డి రమణ, పాండ్రంగి జయరాజు, దేవుపల్లి సీతారామ్, ప్రభావతి, మంత్రి మంజుల, రమణమ్మ, కరణం సతీష్, గంటిబిల్లి అమ్మోరు, సూద అమ్మోరు, వెల్లుస్వామి, హరిపిల్లి ధనరాజ్, నొల్లి పోలరాజు, కంబాల నూకరాజు, రాజు, కదిరి పెంటారావు, కనకరాజు, వెంకటేష్, కంబాల బాపణయ్య, పెంటారావు తదితర నాయకుల ఆధ్వర్యంలో వార్డు నాయకులు, కార్యకర్తలు బీసీ రోడ్‌లోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద రాజీనామాలు చేశారు. అంతకుముందు దొడ్డి రమణ ఇంటి నుంచి ఎన్‌టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఇన్ని వేలమంది రాజీనామా చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఎన్నికల సర్వేలో వెనుకబడిన పల్లాపై ఈ పరిణామం మరింత ప్రభావం చూపుతుందని విమర్శకులు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment