గాజువాక ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
గాజువాక ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
Published Fri, Mar 4 2016 9:45 AM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM
ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా..
ఏయ్.. ఉద్యోగాలు ఊడతాయ్
ఫూటుగా తాగి కానిస్టేబుళ్లను బండబూతులు తిడుతూ చిందులు
ఒకరిపై చేయిచేసుకున్న వైనం
అరెస్టు చేసిన పోలీసులు
విజయవాడ సిటీ: ‘ఏయ్..మేమెవరమో తెలుసా? ఎమ్మెల్యే మనుషులనే ఆపుతారా? మీరేమనుకుంటున్నారు మా గురించి. ఉద్యోగాలు ఊడతాయి’ అంటూ బుధవారం అర్ధరాత్రి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అనుచరులు వీరంగం చేశారు. పూటుగా తాగి కారును మితిమీరిన వేగంతో నడపడమే కాక ఆపేందుకు ప్రయత్నించిన పోలీసులను బూతులు తిట్టారు. వైద్య పరీక్షల కోసం వారిని ఎలాగోలా ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులపై కూడా చిందులు వేశారు. ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌కి తరలించి పోలీసు విధులకు ఆటంకం కలిగించడం, దాడి, బహిరంగ ప్రదేశంలో అనుచితంగా ప్రవర్తించడం తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
విశాఖపట్నానికి చెందిన తారక లింగేశ్వరరావు అలియాస్ తారక్ ఆరు నెలలుగా విజయవాడలోని కరెన్సీనగర్‌లో ఉంటూ కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టులు చేస్తున్నాడు. ఇతని స్నేహితుడైన జె.కృష్ణ మూడు రోజుల కిందట అమెరికా నుంచి నగరానికి వచ్చాడు. బుధవారం అర్ధరాత్రి వరకు వీరిద్దరూ కలిసి మద్యం సేవించారు. రాత్రి 1.30 సమయంలో హెల్త్ యూనివర్సిటీ వైపు నుంచి బెంజిసర్కిల్ వైపు సర్వీసు(ఫీడర్) రోడ్డులో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరిట ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఎ.పి. 09సిఎస్ 0610 వోక్స్ వ్యాగన్ కారులో అతివేగంగా అడ్డదిడ్డంగా వెళుతున్నారు. ఇది గమనించిన మాచవరం పోలీసుస్టేషన్ బీటు కానిస్టేబుళ్లు ఆపేందుకు ప్రయత్నించారు. ఆపకుండా వెళుతూ రమేష్ ఆస్పత్రి జంక్షన్‌లో లారీ అడ్డురాగా కారును ఆపారు. వెంబడించిన పోలీసులు వివరాలు అడుగుతుండగా బండ బూతులు తిడుతూ నెట్టేసి ముదుకు వెళ్లిపోయారు.
దీంతో బీటు కానిస్టేబుళ్లు కంట్రోల్ రూమ్‌కి సమాచారం అందించారు. అప్రమత్తమైన రాత్రి గస్తీ పోలీసు అధికారులు పిన్నమనేని పాలీక్లినిక్ వద్ద కారును నిలువరించారు. కిందకు దిగిన ఇద్దరు యువకులు అక్కడికి చేరుకున్న పోలీసు అధికారులపై బూతు పురాణం లంకించుకున్నారు. ఓ కానిస్టేబుల్‌పై చేయికూడా చేసుకున్నట్టు తెలిసింది. వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తే వైద్యులపై కూడా చిందులు వేశారు. చివరకు వీరు అతిగా మద్యం సేవించినట్టు సర్టిఫికెట్ తీసుకొని మాచవరం పోలీసు స్టేషన్‌కి తరలించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేసి వీరిని అరెస్టుచేశారు. తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.
Advertisement
Advertisement