సీఎం మదిలో ఎవరో..?
సాక్షి, గజ్వేల్: సీఎం సొంత ‘ఇలాకా’ గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో పురపాలక ఎన్నికలు అధికార పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారబోతున్నాయి. ఈ పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధితో పాటు అన్ని అంశాల్లో నమూనాగా చూపాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారని తెలుస్తోంది. ప్రత్యేకించి చైర్మన్ అభ్యర్థి అంశంలో అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఆచితూచి ఎంపిక చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేకించి మున్సిపాలిటీ అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతున్నారు. వందలాది కోట్ల రూపాయల నిధుల వరద కురిపించి పట్టణానికి కొత్తరూపు తెచ్చారు.
అతుకుల బొంతలా ఉన్న ఈ పట్టణానికి కొత్త హంగులను అద్దారు. సీఎం ఆలోచనల మేరకే పట్టణాన్ని ప్రత్యేక జోన్లుగా విభజించారు. ఈ క్రమంలోనే ఎడ్యుకేషన్ హబ్, ప్రభుత్వ కార్యాలయాల సముదాయం, ఆడిటోరియం, మార్కెట్, బస్టాండ్, వైద్యం, పార్కులు జోన్ల వారీగా ఏర్పాటు చేసి నయా లుక్ తీసుకువచ్చారు. ఇక్కడ నిర్మించిన రింగురోడ్డు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆడిటోరియం, డబుల్ బెడ్రూమ్ మోడల్‌కాలనీ, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, ఎడ్యుకేషన్‌హబ్, వంద పడకల ఆసుపత్రి, పాండవుల చెరువు సుందరీకరణ, అర్బన్‌పార్కు, రోడ్ల విస్తరణ వంటి నిర్మాణాలు అంతర్జాతీయ ప్రమాణాలతో సాగాయి.
ఈ నిర్మాణాలు భవిష్యత్‌లో పట్టణం ఎలా ఉండబోతుంది.. అనే సంకేతాలను సీఎం ఇచ్చారు. తాజాగా ముట్రాజ్‌పల్లి రోడ్డు వైపున నిర్మిస్తున్న ఆర్అండ్ఆర్ కాలనీ, తూప్రాన్ రోడ్డు వైపు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పట్టణాన్ని విస్తరింపజేయడానికి చొరవ చూపారు. మోడల్ మున్సిపాలిటీగా గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌ను నిలబెట్టేందుకే ఈ పనులన్నీ సాగాయి. ఇలాంటి సందర్భంలో పాలకవర్గం కూడా సమర్థంవంతంగా ఉండాలని, పారదర్శకతకు నిదర్శనంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన ఆలోచనలకు తగ్గట్టు అభ్యర్థుల ఎంపిక సాగనుందని తెలుస్తోంది.
ఒక్కో వార్డుకు డజన్ మంది పోటీ
అవినీతిరహితంగా ఉండే వ్యక్తులకు ప్రాధాన్యతనిచ్చే అవకాశం కనిపిస్తుంది. పట్టణంలో బలమైన నాయకత్వమున్న వ్యక్తులను చైర్మన్ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశముందని చెప్పుకుంటున్నారు. చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. ఇప్పటికే పట్టణంలో ప్రముఖ న్యాయవాది టీ రాజు, రిటైర్డ్ అధికారి కాల్వ శ్రీధర్‌రావు, తాజా మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, టీఆర్ఎస్ గజ్వేల్ పట్టణశాఖ అధ్యక్షుడు వంటేరు గోపాల్‌రెడ్డి సతీమణి ఉమాదేవి, ఉప్పల మెట్టయ్య, దుర్గాప్రసాద్, ఎన్సీ రాజమౌళి, ఊడెం కృష్ణారెడ్డి, తాజా మాజీ వైస్‌చైర్మన్ దుంబాల అరుణలు చైర్మన్ అభ్యర్థిత్వం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆశావహుల ప్రయత్నాలు ఎలా ఉన్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టణంలో ఎవరి అభ్యర్థిత్వమైతే బాగుంటుందనే అంశంపై ఇంటిలిజెన్స్ నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం. ఇంటిలిజెన్స్ నివేదిక, పట్టణంలో ప్రజాభిప్రాయం, నేతల అభిప్రాయం ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండవచ్చని భావిస్తున్నారు. సీఎం దృష్టిలో పడేందుకు ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇకపోతే 20 వార్డుల్లోనూ కౌన్సిలర్ల అభ్యర్థిత్వం కోసం టీఆర్ఎస్లో తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఒక్కో వార్డు నుంచి అధికార పార్టీ నుంచి డజను మంది అభ్యర్థిత్వం ఆశిస్తుండగా ఎంపిక పార్టీ పెద్దలకు తలకుమించిన భారంగా మారే అవకాశముంది. టికెట్లు దక్కనివారు రెబల్స్‌గా పోటీలో ఉండే అవకాశముంది. ఏదేమైనా కౌన్సిలర్‌గా గెలవాలనే పట్టుదల అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కనిపిస్తోంది.