ప్రేమ పుట్టించడమే కాదు...
గలాటా చేయడానికి మేం రెడీ... ఆస్వాదించడానికి మీరు రెడీయా అంటున్నారు శ్రీ, హరిప్రియ. ఈ ఇద్దరూ జంటగా కృష్ణ దర్శకత్వంలో క్రియేటివ్ పిక్సెల్స్ పతాకంపై డి. రాజేంద్రప్రసాద్ వర్మ నిర్మిస్తున్న చిత్రం ‘గలాటా’. ఈ చిత్రం ప్రచార చిత్రాన్ని హైదరాబాద్లో వీర్రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీ మాట్లాడుతూ -‘‘నేను యాక్ట్ చేసిన తొలి భారీ బడ్జెట్ చిత్రం ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టించడం మాత్రమే కాదు.. వాళ్లని కలిపే పాత్ర చేశాను. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం అందరికీ నచ్చే విధంగా ఉంటుంది’’ అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ - ‘‘అమ్మాయిలను ప్రేమలో దింపడానికి చిట్కాలు చెప్పే ఓ యువకుడు అనుకోకుండా ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ఆసక్తికరమైన అంశం. సినిమా బాగా వచ్చింది. సునిల్ కశ్యప్ మంచి స్వరాలందించారు. వచ్చే నెల మొదటి వారంలో పాటలను, చివరి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రీ తేజ నడింపల్లి.