గేల్ రికార్డుల మోత
కాన్ బెర్రా: జింబాబ్వేతో ప్రపంచ కప్ మ్యాచ్ లో విండీస్ రికార్డుల మోత మోగించింది. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ రికార్డుల మీద రికార్డులు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ లో ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ, వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం తదితర రికార్డులు నమోదయ్యాయి.
ప్రపంచ కప్ లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ (215) చరిత్ర సృష్టించాడు. క్రిస్ గేల్ 138 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతర క్రికెటర్ గా, తొలి విండీస్ ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు. క్రిస్ గేల్, శ్యామ్యూల్స్ తో కలసి అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. ద్రావిడ్, సచిన్ ల పేరిట ఉన్న 331 పరుగుల భాగస్వామ్యాన్ని అధిగమించారు. గేల్, శామ్యూల్స్ రెండో వికెట్ కు 372 పరుగులు జోడించారు. అంతర్జాతీయ క్రికెట్లో ఏ వికెట్ కైనా ఇదే అత్యధికం. ఇక అంతర్జాతీయ టీ-20ల్లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా గేల్ మరో రికార్డు నెలకొల్పాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా గేల్ మరో రికార్డు బద్దలు కొట్టాడు. ఇక వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్ మన్ గానూ క్రిస్ గేల్ (16 సిక్సర్లు).. రోహిత్ శర్మ, ఏబీ డివిలియర్స్ సరసన నిలిచాడు.
ఇంతకుముందు ప్రపంచ కప్ లో అత్యధిక పరుగుల రికార్డు సౌతాఫ్రికా ఆటగాడు గ్యారీ కిర్ స్టన్ పేరిట ఉండేది. 1996 వరల్డ్ కప్ లో యూఏఈ జట్టుపై కిర్ స్టెన్ 188 పరుగులు చేశాడు. ఇప్పుడు గేల్ ఆ రికార్డును అధిగమించాడు. ఇక వన్డేల్లో రోహిత్, సచిన్, సెహ్వాగ్ డబుల్ సెంచరీలు బాదాగా, తాజాగా గేల్ వారి సరసన నిలిచాడు.