రుణ మాఫీ కాలేదంటూ జన్మభూమిలో నిరసన
వడ్డేశ్వరం గ్రామ సభలో ఎంపీ గల్లా జయదేవ్‌ను
నిలదీసిన స్థానికులు
వడ్డేశ్వరం (తాడేపల్లి) : అర్హులకు రుణమాఫీ కాలేదంటూ గ్రామస్తులు అధికారులను, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ను నిలదీశారు. స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం ‘జన్మభూమి - మా ఊరు’ గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమానికి మండల ప్రత్యేకాధికారి తిరుమలదేవి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా గుంటూరు పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అమలు చేయటమే తమ ప్రభుత్వ ధేయమని చెప్పారు. ఈ గ్రామం రాజధాని ప్రాంతంలో ఉన్న దృష్ట్యా అనేక పరిశ్రమలు వస్తాయని, వాటిలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం ఎంపీపీ కత్తిక రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తమ గ్రామంలో మంచినీటి సమస్య అధికంగా ఉందని చెప్పారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా రమేష్‌బాబు అనే రైతు కల్పించుకుని తమ గ్రామంలో అర్హులైన వారికి నేటికీ రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేశాడు. తాను టీడీపీ కార్యకర్తనేనంటూ సమస్యను ఎంపీకి విన్నవిస్తుండగానే అతనిపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివర్లో అతను ఎంపీ కారు వద్దకు కూడా వెళ్లి తమ సమస్యలు పరిష్కరించరా అంటూ కేకలేశాడు. అతనిని బయటకు పంపండంటూ టీడీపీ నేతలకు ఎంపీ హుకుం జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దండమూడి శైలజారాణి, గ్రామ సర్పంచ్ కత్తిక మల్లేశ్వరి, ఎంపీడీవో పి.రోశయ్య, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంఈవో సుబ్బారావు, గ్రామ కార్యదర్శి గల్లా అమరేష్, జన్మభూమి కమిటీ సభ్యుడు మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ ఉల్లంఘన..
కాగా, సభలో అడుగడుగునా ప్రొటోకాల్ ఉల్లంఘన చోటు చేసుకుంది. కార్యక్రమం టీడీపీ సభలా మారిపోయింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ గల్లా జయదేవ్ తనతో పాటు వచ్చిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గంజి చిరంజీవి, పలువురు టీడీపీ నేతలను వేదికపై కూర్చోబెట్టుకున్నారు. దీంతో స్థలం లేక అధికారులు వెనుక వరుసలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా, టీడీపీ సభా అని వచ్చిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఇవేమీ పట్టని టీడీపీ నేతలు మాత్రం వేదికపై ఆశీసులై తమ దర్పాన్ని ప్రదర్శించారు.
సీపీఐ వినూత్న నిరసన
వడ్డేశ్వరం జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వం భూములను లీజు పేరుతో విదేశీయులకు కట్టబెట్టడంపై మౌనంగా తన నిరసన వ్యక్తం చేశారు.