gambhiraopeta
-
కట్నం వేధింపులకు ముగ్గురి బలి
గంభీరావుపేట (సిరిసిల్ల): అదనపు కట్నం.. వేధింపులకు మూడు ప్రాణాలు బలయ్యాయి. ముక్కుపచ్చలారని చిన్నారులతో సహా తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం జరిగిన ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం కొత్తపల్లిలో విషా దం నింపింది. ముగ్గురి మృతదేహాలు చూసి స్థానికులు కంటతడి పెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. గంభీరావుపేట మండలం లింగ న్నపేటకు చెందిన రేఖ (28)కు కొత్తపల్లికి చెందిన వరుకుటి రాజు తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. రేఖ తల్లిదండ్రులు దాదాపు రూ.9 లక్షల కట్నం, పది తులాల బంగారం, ఇతర లాంఛానాలతో పెళ్లి చేశారు. అయితే రాజు అదనపు కట్నం కావాలని రేఖను తరచూ శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. నెల క్రితం రేఖ తల్లిదండ్రులు రూ.లక్ష ఇవ్వగా, మూడు రోజుల క్రితం ద్విచక్రవాహనం కొనిచ్చారు. అయినా.. అతను రేఖను వేధించడం మానలేదు. దీంతో మానసికంగా కుంగిపోయిన రేఖ.. భర్త హింస ను తట్టుకోలేక తన పిల్లలు అభిజ్ఞ (3), హన్సిక (ఐదు నెలలు)లతో స్థానిక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో పోలీసులు గ్రామంలో గట్టి బందో బస్తు ఏర్పాటు చేశారు. రేఖ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
చూస్తుండగానే వాగులో కొట్టుకుపోయిన సిద్దిపేట ఆర్టీసీ బస్సు
సాక్షి, సిరిసిల్ల: ఆదివారం రాత్రి నుంచి జిల్లాలో ఎడితెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే పంటలు నీట మునిగాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పలుచోట్ల ఒర్రెలు తెగడం, వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గంభీరావుపేట, లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనపై ఆర్టీసీ బస్సు కొట్టుకుపోయింది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వాగులో చిక్కుకుపోయింది. ఒక టైర్ కిందికి దిగి ఆగిపోయింది. బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉండగా.. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు. కాగా ఎగువ మానేరు జలాశయానికి భారీగా వరద చేరడంతో నీరు మత్తడి దుంకుతుంది. దీంతో వాగుల్లో వరద పెరిగింది. అయితే వరదను తక్కువగా అంచనా వేసి బస్సును ముందుకు పోనివ్వడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ సహాయక చర్యలు కొనసాగాయి. జేసీబీ సాయంతో బస్సును బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు, గ్రామస్తులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద మరింత పెరగడంతో మంగళవారం బస్సు పూర్తిగా వరదలో కొట్టుకుపోయింది. -
పంట చేలకు కోతుల బెడదా? ఇలా చేయండి
సాక్షి, గంభీరావుపేట(సిరిసిల్ల): పొట్టదశకొచ్చిన వరి చేలను కోతులు పీల్చి పడేస్తున్నాయి. పొలం గట్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ వరి కంకులను చిన్నాభిన్నం చేస్తున్నాయి. వెళ్లగొట్టడానికి ఎంత ప్రయత్నించినా మళ్లీ మళ్లీ వచ్చి పంటను నాశనం చేస్తున్నాయి. ఈ క్రమంలో గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన రాజబోయిన ఆంజనేయులు అనే యువ రైతు తన పొలంలో కొండెంగ బొమ్మను కాపలా పెట్టాడు. కొండెంగగా భావిస్తున్న కోతులు భయంతో అటు వైపు రావడం మానేశాయి. ఆంజనేయులు ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. తమ పొలంలోనూ అలాగే ఏర్పాటు చేసుకుంటామంటున్నారు. చదవండి: ప్రకృతి సేద్యం: పల్లెబాట పట్టిన సాఫ్ట్వేర్ యువ జంట -
ఒక్కరోజు ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు!
గంభీరావుపేట (సిరిసిల్ల): ఆ ఊరంతా ఖాళీ అయ్యింది. ఇంటింటికీ తాళం పడింది. జనసమ్మర్ధంతో ఉండే ఊరు.. నిర్మానుష్యంగా మారింది. ఒక్కసారిగా ఊళ్లో నిశ్శబ్దం ఆవరించింది. కరోనా మహమ్మారి నుంచి ఊరును కాపాడాలని గ్రామదేవతలను వేడుకుంటూ జనం ఊరు వదిలి వనంబాట పట్టారు. ముందు ఊరంతా కలసి గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామ శివారులోని పొలాలు, అడవుల్లోకి వెళ్లి భోజనాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజలు వివరాలిలా ఉన్నాయి.. లింగన్నపేటలో సుమారు ఆరు వేల జనాభా ఉంటుంది. 1,400 నివాసాలు ఉంటాయి. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ గ్రామదేవతలకు పూజలు చేద్దామని, ఒకరోజంతా ఊరు వదిలి అడవుల్లోకి వెళ్లాలని అన్ని కుల సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అందరి సమ్మతం మేరకు ఆదివారం దానిని అమలు చేశారు. దీనికి ముందు రెండురోజులుగా ఊళ్లోని ప్రతీవీధి, రహదారిని శుభ్రం చేశారు. అలాగే తమ ఇళ్లను శుభ్రం చేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఊర్లోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన గ్రామదేవతల ప్రతిమలకు అంతా కలసి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని, రోగాలు దరిచేరకుండా కాపాడాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని దేవతలను వేడుకున్నారు. అనంతరం ఉదయం ప్రతీ ఇంటి నుంచి అందరూ ఆహార సామగ్రి, ఇతర వస్తువులు పట్టుకొని పొలాలు, అడవుల్లోకి పయనమయ్యారు. ఎవరికి వారుగా అక్కడ వంటలు చేసుకొని భోజనాలు చేశారు. సూర్యాస్తమయం తర్వాత మళ్లీ గ్రామంలోకి అడుగుపెట్టారు. లింగన్నపేట వాసులు చేసిన ఈ కార్యక్రమం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. -
మూడు రోజుల పాటు ప్రత్యేక లాక్డౌన్
గంభీరావుపేట(సిరిసిల్ల): కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు మండలకేంద్రంలోని ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఇతర దుకాణాలు బంద్ చేసి లాక్డౌన్లో పాల్గొంటున్నారు. ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండడంతో జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సోమవారం నుంచి బుధవారం వరకు లాన్‌డౌన్ అమలు చేయనున్నారు. మండలకేంద్రం కావడంతో చాలా మంది వివిధ పనుల నిమిత్తం నిత్యం గంభీరావుపేటకు వచ్చి వెళ్తుంటారు. కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రైమరీ కాంటాక్టుల ద్వారా వైరస్ ప్రబలే అవకాశం ఉందని పలువురు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల గంభీరావుపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రాగా.. అందులో ఒక మహిళ మృతి చెందింది. ఈ నేపథ్యంలో వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఏం చేయాలన్న విషయమై సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు గ్రామస్తులు, అధికారులతో చర్చించారు. మూడు రోజుల పాటు ప్రత్యేక లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించారు. ‘మనకు మనమే లాక్డౌన్ విధించుకుందాం’ అనే ఆలోచనను ఆచరణలో పెట్టారు. సోమవారం నుంచి లాక్‌డౌన్‌ను అమల్లోకి తెచ్చారు. వణికిస్తున్న మహమ్మారి నుంచి ప్రజలను కాపాడుకునేందుకు లాక్డౌన్ అమలు చేస్తున్నామని సర్పంచ్ కటకం శ్రీధర్‌పంతులు తెలిపారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. (అమ్మా.. అనే పిలుపుకు నోచుకోకుండానే..) స్వీయ రక్షణే శ్రీరామరక్ష స్వీయ రక్షణతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వానాకాలం ప్రారంభమైంది. అంతటా వర్షాలు కురుస్తున్నాయి. కరోనా వైరస్ విజృంభించేందుకు అనుకూల సమయమిది. ఆపై కోవిడ్–19 మరింత భయపెడుతోంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, నిబంధనలు పాటించకపోయినా కరోనా వైరస్ మనల్ని చుట్టేయడం ఖాయం. (కరోనా 2.0 పంజా!) అసలే వానాకాలం.. సాధారణంగానే వానాకాలం అంటే వ్యాధుల సీజన్‌గా పేర్కొంటారు. ఈ కాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా వస్తుంటాయి. కరోనాకు సైతం ఇవే లక్షణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది జలుబు, దగ్గు వస్తే భయపడుతున్నారు. నలుగురిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరికి తుమ్ము, దగ్గు వచ్చినా మిగతా వారు వణికిపోతున్నారు. బేఖాతర్ చేస్తే.. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో చాలామంది కరోనాను లైట్‌గా తీసుకుంటున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. కొందరు కనీసం మాస్క్‌లు కూడా ధరించడం లేదు. భౌతిక దూరం కానరావడం లేదు. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో ఇవే అధికంగా ఉన్నాయి. జిల్లాలో..కరోనా కేసులు 22 జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వేములవాడకు చెందిన ఒక్కరితో కరోనా మొదలైంది. ఆ తర్వాత ముంబయి, హైదరాబాద్, ఇతర రాష్ట్రాల నుంచి వలసజీవులు రావడంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే 22 పాజిటివ్ కేసులు న మోదయ్యాయి. 1,798మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. గంభీరావుపేటలో ఒక కరోనా మరణం నమోదైంది. -
హ్యాట్రిక్ ‘కొండూరి’..!
సిరిసిల్ల: ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా జిల్లాకు చెందిన కొండూరి రవీందర్రావు ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆయన కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కావడం ఇది మూడోసారి. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (టెస్కాబ్) చైర్మన్‌గా రవీందర్రావు ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. మరోసారి టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు పేరును సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈనేపథ్యంలో ఆయన రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ చైర్మన్ పదవి కోసం ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పోటీ పడుతున్నారు. ఈనెల 5న టెస్కాబ్ చైర్మన్ ఎన్నిక ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే అన్ని జిల్లాల్లోనూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్లుగా ఎన్నిక కావడంతో రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా రవీందర్రావు ఎన్నిక లాంఛనమే అయింది. 15 ఏళ్లుగా సహకార రంగంలో.. గంభీరావుపేట సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికైన రవీందర్రావు ఉమ్మడి జిల్లా స్థాయిలో మూడోసా రి చైర్మన్‌గా ఎన్నికై హ్యాట్రిక్ సాధించా రు. తొలిసారి 2005 లో గంభీరావుపేట మండలం గజసింగవరం నుంచి డైరెక్టర్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా ఎన్నికై కేడీసీసీ బ్యాంక్ పదవి అలంకరించారు. ఎన్నికయ్యారు. రెండోసారి 2013లోనూ జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికయ్యా రు. 2015లో తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా నియమితులయ్యారు. 2019లో అంతర్జాతీయ సహకార బ్యాంక్‌ల సమాఖ్య ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా స హకార రంగంలో పనిచేసే ఉద్యోగుల హెచ్ఆర్ పాలసీ అమలు కమిటీకి రవీందర్రావు చైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. 15 ఏళ్లుగా సహకార రంగంలో రవీందర్రావు సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సహకార బ్యాంకులను బలోపేతం చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. సహకార సంఘాల ఆధ్వర్యంలో డీజిల్, పెట్రోల్ బంకుల ఏర్పాటు, ప్రతి సహకార సంఘాన్ని బ్యాంకులా మార్చేందుకు ఆయన శ్రమించారు. జిల్లాకు ఆరు డైరెక్టర్ పదవులు... జిల్లాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయిలో ఆరు డైరెక్టర్ పదవులు లభించాయి. కేడీసీసీబీలో డైరెక్టర్లుగా వుచ్చిడి మోహన్‌రెడ్డి (అల్మాస్పూర్), భూపతి సురేందర్ (కొత్తపల్లి), జల్గం కిషన్‌రావు (సనుగుల), వీరబత్తిని కమలాకర్ (సిరిసిల్ల), ముదిగంటి సురేందర్‌రెడ్డి (నర్సింగా పూర్), గాజుల నారాయణ (సిరిసిల్ల అర్బన్ బ్యాంక్)లకు సహకార డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సహకార ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సముచిత స్థానం దక్కింది. ఉమ్మడి జిల్లా స్థాయిలో చైర్మన్‌గా రవీందర్రావు ఉండగా... రాష్ట్ర స్థాయిలోనూ టెస్కాబ్ చైర్మన్ అవకాశం ఆయనకే లభించడంతో మరోసారి రాష్ట్ర స్థాయి పదవి రాజన్న సిరిసిల్ల జిల్లాకు లభించింది. పలువురు జిల్లా నాయకులు రవీందర్రావును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్.. ఉద్రిక్తత!
పోటాపోటీ ఆందోళనలు.. గంభీరావుపేటలో టెన్షన్ రాజన్న సిరిసిల్ల: అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ శ్రేణుల పోటాపోటీ ఆందోళనలతో జిల్లాలోని గంభీరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ సోమవారం గంభీరావుపేటలో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో గంభీరావుపేటతోపాటు పలు గ్రామాల్లో అక్రమాలు జరిగాయంటూ మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ నేతలు భావించారు. అయితే, వారిని అడ్డుకొని హస్తం నేతలు, శ్రేణులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. పలువురిని ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ నేతలు గంభీరావుపేట బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను విఫలం చేసేందుకు పోటీగా టీఆర్ఎస్ నేతలు కూడా రంగంలోకి దిగారు. రెండు పార్టీల శ్రేణులు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో ప్రస్తుతం గంభీరావుపేటలో ఉద్రిక్తత నెలకొంది.